
Indian Air Force Jobs : తెలుగు యువతకు అద్భుత అవకాశం. కఠినమైన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో ఉద్యోగాలను పొందవచ్చు. ఇందుకోసం డిగ్రీ, పిజీ వంటి పెద్దపెద్ద చదువులు అవసరంలేదు… కేవలం ఇంటర్మీడియట్ చదివుంటే చాలు. సర్టిఫికేట్లు పట్టుకుని నేరుగా వెళ్లి ఓపెన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో పాల్గొనవచ్చు.. ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ అవకాశం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ యువతీయువకులకు మాత్రమే.
భారత రక్షణశాఖ త్రివిధ దళాల్లో అగ్నివీర్ పేరిట సైనికులకు భర్తీ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. కేవలం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ యువతీయువకుల కోసమే ప్రత్యేక రిక్రూట్మెంట్ ర్యాలీ చేపడుతోంది కేంద్రం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని... దేశానికి సేవ చేసుకుంటూనే మంచి ఆదాయాన్ని, భవిష్యత్ కు భరోసాను పొందవచ్చని తెలుగు రాష్ట్రాల (నియామకాల భర్తీ) అధికారి, సికింద్రాబాద్ 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు.
భారత వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలపై ఆసక్తి, అర్హతలు కలిగిన యువతీయువకులు ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు. ఈ నెల (మార్చి 2026) 9వ తేదీ అంటే వచ్చే సోమవారం నుండి 16వ తేదీ అంటే ఆ తర్వాత సోమవారం వరకు రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు... తెలంగాణ, ఏపీ అభ్యర్థులకు వేరువేరుగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ నిర్వహిస్తారు... అందుకే వారం రోజుల సమయం ఇచ్చారు.
మొదట మార్చి 9,10 (సోమ, మంగళవారం) ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడతారు. వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలకు తగిన అర్హతలున్నాయో లేవో పరిశీలిస్తారు. అంతా ఓకే అనుకుంటే పరుగుపందెం, ఇతర ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఇక మార్చి 12, 13 (గురు, శుక్రవారం) కేవలం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఏపీలోని అన్నిజిల్లాల అభ్యర్థులు ఈ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు. మార్చి 12వ తేదీ ఉదయమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ పురుష అభ్యర్థులకు మార్చి 15,16 (ఆది, సోమవారం) రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. ఆదివారం ఉదయమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.. రెండు రోజులపాటు తెలంగాణ అభ్యర్థుల నియామక ప్రక్రియ కొనసాగుతుంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ వాయు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో కొనసాగుతుంది. గుంటూరు పట్టణంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU)లో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఇక్కడ హాజరుకావాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ టైమింగ్స్ ఫాలో అవ్వాలి... లేదంటే అభ్యర్థులు ఉద్యోగ అవకాశాన్ని మిస్ అవుతారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు హాజరుకావాలి.
భారత వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియట్ పాసైతే చాలు. లేదా పదో తరగతి తర్వాత ఇంటర్ తో సమానమైన తత్సమాన పరీక్ష, మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ ((పాలిటెక్నిక్), రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల్లో (ఐటిఐ) ఉత్తీర్ణత సాధించినవారు కూడా అర్హులే. ఆయా విద్యార్హతల్లో మొత్తం మార్కుల్లో 50 శాతం, ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్కులు లేకుంటే అగ్నివీర్ ఉద్యోగాలకు అనర్హులు.
అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు అప్పుడే చదువు పూర్తిచేసిన యువత మాత్రమే అర్హులు. అంటే 17 1/2 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసుగల అవివాహిత యువతీ, యువకులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 2 జులై 2005 నుంచి 2 జనవరి 2009 తేదీల మధ్య జన్మించినవారు మాత్రమే అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు అర్హులు.
పురుషులే కాదు మహిళా అభ్యర్థుల కనీస ఎత్తు 152 సెం.మీ ఉండాలి. అలాగే వయసు, ఎత్తుకు తగినట్లు బరువు ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. గర్బిణి మహిళలు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు అనర్హులు.
భారత వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలకు ముందుగా అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోనవసరం లేదు... నేరుగా ర్యాలీకి హాజరుకావచ్చన్నారు. ఈ సమయంలో ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధ్రువపర్చిన విద్యార్హత పత్రాలు, డొమిసైల్ సర్టిపికిట్, ఎన్.సి.సి సర్టిఫికెట్ (ఉంటే), ఆధార్ కార్డు, ఇటీవల తీసుకున్న 10 పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, ప్రతి ధ్రువపత్రానికి సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్ళాలి.
మొదట శారీరక పరీక్షలు నిర్వహిస్తారు. ఎత్తు, ఇతర అంశాలను పరిశీలించి అర్హులకు మాత్రమే 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు ఏడు, మహిళా అభ్యర్థులు ఎనిమిది నిమిషాల్లోపు పరుగు పూర్తిచేయాలి. అలాగే పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా భౌతిక, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష ఉంటుంది. ఇందులోనూ ఉత్తీర్ణత సాధిస్తే భారత వాయుసేనలో నిర్ణీయ కాలం పనిచేసే అవకాశం లభిస్తుంది.
ఈ సువర్ణావకాశాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లకు చెందిన మహిళ, పురుష అభ్యర్థులు సద్వినియోగపరచుకోవలని వాయుసేన అధికారులు కోరుతున్నారు. ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ttps://agnipathvayu.cdac.in ను సందర్శించవచ్చు.