Free Bus : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకే కాదు కొందరు మగవారికి కూడా ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
Free Bus Scheme : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరికొన్ని రాష్ట్రాల్లోనూ మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణలో "మహాలక్ష్మి', ఆంధ్ర ప్రదేశ్ లో 'స్త్రీ శక్తి'' పేరిట రూపాయి ఖర్చులేకుండా మహిళలు జీరో టికెట్ పై ప్రయాణించే పథకాలు అమలవుతున్నాయి. అయితే ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి కొందరు మగవారికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది... ''ఇంద్రధనుస్సు'' పేరిట కొత్త పథకాన్ని అమలుచేస్తోంది.
25
ఏమిటీ ఇంద్రధనుస్సు పథకం?
గతేడాది చివర్లో (డిసెంబర్ 3న) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ 'ఇంద్రధనుస్సు' పథకాన్ని ప్రకటించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు పథకాలను ఈ 'ఇంద్రధనుస్సు' ద్వారా అమలుచేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒకటి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. ప్రస్తుతం మహిళలు ఎలాగైతే ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారో ఇకపై దివ్యాంగులైన పురుషులు కూడా ఫ్రీగా ప్రయాణించవచ్చు.
35
దివ్యాంగ పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం..
ఇప్పటికే స్త్రీ శక్తి పథకం కింద దివ్యాంగ మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన 'ఇంద్రధనుస్సు' ద్వారా దివ్యాంగ పురుషులు కూడా ఉచితంగా ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించవచ్చు. గత నెల ఫిబ్రవరి 24న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించగా... అధికారులు వెంటనే ఈ పథకం అమలుకు చకచకా ఏర్పాట్లు చేశారు. గత శనివారం (ఫిబ్రవరి 28న) దివ్యాంగులకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఏపిఎస్ ఆర్టిసి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి దివ్యాంగులందరూ అర్హులు కాదు... కేవలం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగినవారే అర్హులు. అంటే చిన్నచిన్న వైకల్యాలు ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వం జారీచేసే సదరం సర్టిఫికేట్ లేదా స్మార్ట్ కార్డుల ఆధారంగా ఎంతశాతం వైకల్యం ఉందో గుర్తిస్తారు... దీని ఆధారంగానే కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షలమంది దివ్యాంగులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో చాలా తక్కువమంది ఆర్టిసి అందించే టికెట్ ధరలో 50 శాతం రాయితీ సదుపాయాన్ని పొందుతున్నారు. తాజా ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్టిసి బస్సుల్లో దివ్యాంగ ప్రయాణికులు పెరుగుతారని భావిస్తున్నారు... వీరికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టిసి యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
55
ఏఏ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు..?
స్త్రీ శక్తి మాదిరిగానే ఇంద్రధనుస్సు పథకాన్ని అమలుచేస్తోంది కూటమి ప్రభుత్వం. అంటే ప్రస్తుతం మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్న అన్ని బస్సుల్లో దివ్యాంగులు కూడా ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఇలా పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తారు.
దివ్యాంగులకు ఇప్పటికే అన్నిరకాల ఆర్టిసి బస్సుల్లో టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తున్నారు... దీన్ని యధావిధిగా కొనసాగించనున్నారు. అంటే కుదిరితే ఉచితంగా లేదంటే 50 శాతం రాయితీతో దివ్యాంగులు ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఇలా దివ్యాంగులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.