
పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరిగే 'ఎల్ నినో' మార్పులు, భారతదేశంలో కురిసే రుతుపవన వర్షాలను శాసిస్తున్నాయంటే మీరు నమ్ముతారా? కానీ, ఇది నిజం. అదే జరుగుతోంది. దీని వెనుక బలమైన వాతావరణ సైన్స్ ఉంది. భూమిపై వాతావరణం, సముద్ర ప్రవాహాలు అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. దీనినే సైన్స్ భాషలో టెలికనెక్షన్ అంటారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాకర్ సర్క్యులేషన్ అనే గాలి చక్రం భారత్ వరకు విస్తరించి ఉంటుంది. ప్రస్తుత నైరుతి రుతుపవనాల పై ఈ ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు భారత వాతావరణ శాఖ (IMD) శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ కీలక హెచ్చరికలు జారీ చేశారు.
ఎల్ నినో (El Nino) అనేది పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఒక ముఖ్యమైన వాతావరణ మార్పు ప్రక్రియ. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయి.
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వీచే గాలులు వేడి నీటిని ఆసియా వైపు నెడతాయి. కానీ, ఎల్ నినో సమయంలో ఈ గాలులు బాగా బలహీనపడతాయి. దీనివల్ల మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు సాధారణం కంటే చాలా వేడిగా మారుతుంది. ఇవి భారత వాతావరణం పై ప్రభావం చూపుతాయి.
సాధారణ రోజుల్లో పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ భాగంలో (ఆస్ట్రేలియా, ఇండోనేషియా వైపు) వేడి నీరు, తూర్పు భాగంలో (పెరూ తీరం వైపు) చల్లని నీరు ఉంటుంది. ఆసియా ప్రాంతంలో ఉండే ఈ వేడి వాతావరణం వల్ల గాలి పైకి లేచి, అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది భారత రుతుపవన గాలులను బలంగా మనవైపు లాక్కోవడానికి హెల్ప్ అవుతుంది.
కానీ ఎల్ నినో సమయంలో ఈ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు భాగం (అమెరికా వైపు) విపరీతంగా వేడెక్కుతుంది. దీనివల్ల గాలి పైకి లేచే కేంద్రం అంటే అల్పపీడన ప్రాంతం ఆసియా నుండి అమెరికా వైపు షిఫ్ట్ అయిపోతుంది. దీనివల్ల భారతదేశం వైపు రావాల్సిన చల్లని, తేమతో కూడిన గాలుల ప్రవాహం పూర్తిగా వీక్ అవుతుంది.
సముద్రం వేడెక్కడం వల్ల గ్లోబల్ వాతావరణ చక్రం దెబ్బతింటుంది. అమెరికా వంటి దేశాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే... ఆస్ట్రేలియా, ఇండోనేషియా, భారత్ వంటి ప్రాంతాలలో తీవ్రమైన వేడి, పొడి వాతావరణం నెలకొంటుంది. ఎల్ నినో వల్ల భారతదేశంలో ప్రధానంగా కింది మార్పులు సంభవిస్తాయి..
భారతీయ వ్యవసాయం ఎక్కువగా రుతుపవన వర్షాలపైనే ఆధారపడి నడుస్తుంది. ఎల్ నినో వల్ల వర్షాలు టైంకి పడక, పడినా తక్కువగా ఉండటం వల్ల ఖరీఫ్ పంటలు, ఎక్కువగా వరి, సోయాబీన్, పత్తి, చెరకు వంటివి తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది దేశంలో ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోవడానికి కారణమవుతుంది.
పంటల దిగుబడి తగ్గితే మార్కెట్‌లో ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి, సామాన్యుడిపై ఆర్థిక భారం పడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగిస్తుంది. వర్షాలు లేకపోవడం వల్ల నదులు, జలాశయాలు, డ్యాములలో నీటి మట్టాలు అడుగున పడతాయి. ఇది తాగునీటి ఎద్దడికి, జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడానికి దారితీస్తుంది.
అయితే, ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ భారత్‌లో 100% తీవ్ర కరవు వస్తుందని చెప్పలేం. హిందూ మహాసముద్రంలో ఏర్పడే 'ఇండియన్ ఓషన్ డైపోల్' వంటి లోకల్ వాతావరణ అంశాలు అనుకూలంగా ఉంటే, అవి ఎల్ నినో ప్రభావాన్ని కొంతవరకు కంట్రోల్ చేయగలవు.
రుతుపవనాలు జూన్ రెండో వారానికల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు ఎంటర్ అయినప్పటికీ... ఎల్ నినో ప్రభావం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది.
తెలంగాణ పరిస్థితి: జూన్ మధ్య నాటికి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం వరకు విస్తరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవడం లేదు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నా, సిస్టమాటిక్ గా కురవాల్సిన రుతుపవన వర్షాలు తక్కువగానే ఉన్నాయి. జూన్ మూడో వారంలో కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి: ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించినా వర్షాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షాలు నమోదవుతున్నాయి. కోస్తా జిల్లాలలో గాలిలో తేమ శాతం పెరిగి ఉక్కపోత తీవ్రంగా ఉంది. ఎల్ నినో కారణంగా జూన్ చివరి వరకు ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ రోజులు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది
తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం ఎక్కువగా ఈ నైరుతి రుతుపవనాల పైనే ఆధారపడి ఉంటుంది. ఎల్ నినో వల్ల వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాతావరణ నిపుణులు, వ్యవసాయ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వర్షాలు పూర్తిగా సెట్ అయ్యే వరకు ఖరీఫ్ పంటల విత్తనాలు వేయడంలో తొందరపడకూడదు. తక్కువ నీటితో, తక్కువ రోజుల్లో చేతికి వచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం మంచిది. అవైలబుల్ గా ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతులను ప్లాన్ చేసుకోవాలి.