బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐఎండీ అలర్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతారణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
తమిళనాడులోని పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పాటు భారీ వర్షాల హెచ్చరికల మధ్య ఎంకే స్టాలిన్ సర్కారు అప్రమత్తమైంది. బుధవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.
ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఈ అల్పపీడనం రాబోయే 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఈ వాతావరణ వ్యవస్థ, బుధవారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, “వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వెళ్లరాదు” అని హెచ్చరించారు.