Published : Oct 28, 2025, 06:49 PM ISTUpdated : Oct 28, 2025, 06:56 PM IST
Cyclone Montha : మొంథా సైక్లోన్ మరికొద్దిగంటల్లో తీరం దాటబోతోంది. దీంతో ప్రజలు ఇళ్ళలోనే ఉండాలని.. అత్యవసరం అయితేతప్ప బయటకు రావద్దని సూచిస్తోంది ప్రభుత్వం. మరి ఇప్పటికే వాహనాల్లో రోడ్డుపై ఉన్నవారు ఏం చేయాలంటే..
Cyclone Montha : ఆంధ్ర ప్రదేశ్ లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి... రాత్రికి తీరందాటే సమయంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. దీంతో అప్రమత్తమైన రైల్వే, విమానయాన శాఖల అధికారులు ఏపీలో సర్వీసులను రద్దుచేశాయి. ఇప్పుడు రోడ్డు మార్గాలను కూడా మూసేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
26
మరికొద్దిగంటల్లో తీరం దాటనున్న తుపాను
మొంథా తుపాను మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది... ఈ నేపథ్యంలో హైవేలపై రాకపోకలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా ప్రమాదాలు జరక్కుండా నివారించేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో రహదారులపై అక్టోబర్ 28 రాత్రి 8.30 గంటలనుండి భారీ వాహనాలను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాబట్టి వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ఏదైనా సురక్షిత ప్రాంతంలో వాహనాన్ని నిలుపుకోవాలని సూచించారు.
36
ఈ రాత్రి రోడ్లపైకి రాకండి
భారీ వాహనాలే కాదు చిన్నవాహనాలను కూడా రోడ్లపైకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. అత్యవసరం అయితేతప్ప ఈ రాత్రి ప్రయాణాలు చేయవద్దని సూచించారు. వర్ష సమయంలో కాలినడకన కూడా బయటకు రావద్దని... ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సివస్తే వాగులువంకలు, పెద్దపెద్ద చెట్లు లేని మార్గాలను ఎంచుకోవాలని... నీటిప్రవాహాలను దాటే ప్రయత్నం అస్సలు చేయరాదని సూచిస్తున్నారు.
తుపాను ప్రభావిత జిల్లాల్లో హైవేలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఇలా కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉంటుందని ఆర్టిజిఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడు జిల్లాలలో ఈరోజు రాత్రి 8:30 నుంచి రేపు (అక్టోబర్ 29, బుధవారం) ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయా జిల్లాలనుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. అయితే అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని సూచించింది.
56
రైళ్లు, విమాన సర్వీసులు రద్దు
బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో గత శనివారం(అక్టోబర్ 25) నుండి వర్షాలు మొదలయ్యాయి. అయితే వాయుగుండం తుపాను, తీవ్ర తుపానుగా మారాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు తుపాను తీరం దాటబోతోంది... దీంతో వర్ష తీవ్రతే కాదు ఈదురుగాలులు కూడా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఏపీకి రైలు, విమాన సర్వీసులను రద్దుచేశారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేశారు... అంటే ఇక్కడినుండి నడిచే అన్ని సర్వీసులను రద్దు చేశారు. ఇక విజయవాడ నుండి నడిచే ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.
66
ప్రస్తుతం మొంథా తుపాను ఎక్కడుంది?
నిన్న(సోమవారం) తుపానుగా బలపడి... ఇవాళ(మంగళవారం) ఉదయం తీవ్ర తుపాను ఏర్పడింది. ఇది ముందుకు కదులుతూ ప్రస్తుతం కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరానికి దగ్గరయ్యింది. ప్రస్తుతం మచిలీపట్నంకి 60 కిమీ, కాకినాడకి 140 కిమీ, విశాఖపట్నంకి 240 కిమీ దూరంలో కేంద్రీకృతమయ్యింది. గడిచిన 6 గంటల్లో ఇది 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది... దీన్నిబట్టి మరో నాలుగైదు గంటల్లో తుపాను తీరందాటే అవకాశాలున్నాయి. ఈ మొంథా తుపాను తీరందాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి...కాబట్టి తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్ధ సూచిస్తోంది.