Mukesh Ambani TTD: ఆదివారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి తన సేవా మనసును చాటుకున్నారు. భక్తుల సంక్షేమం కోసం ఆయన కుటుంబం, రిలయన్స్ ఫౌండేషన్ కలసి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ తరఫున ఒక ఆధునిక, అత్యుత్తమ సాంకేతికతతో కూడిన వంటశాల నిర్మాణాన్ని ప్రకటించారు.
ఈ కొత్త వంటశాల పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థలతో ఉండనుంది. రోజుకు రెండు లక్షలకుపైగా భక్తులకు పవిత్ర అన్నప్రసాదం అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పరిశుభ్రత, పోషక విలువలు, భక్తి సమన్వయంతో ఈ ఆహార సేవను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతోంది.
అంబానీ ఈ ప్రాజెక్టును తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో చేపట్టడం విశేషం. “భక్తుల కోసం ప్రతి అన్నమూ ఒక దైవ సేవ” అనే భావనతో, ‘ఏ భక్తుడూ ఆకలితో ఉండకూడదు’ అనే తిరుమల దివ్య సంకల్పానికి మేము భాగస్వామ్యం కావడం గర్వంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.