TB Free India: కేవలం 2 నిమిషాల్లో టీబీ గుర్తింపు.. ఏపీలో కొత్త టెక్నాలజీ షురూ !

Published : Mar 24, 2026, 11:05 PM IST

TB Free India: టీబీ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం రూ. 20 కోట్లతో 100 అత్యాధునిక ఏఐ హ్యాండ్ హెల్డ్ ఎక్స్-రే మిషన్లను కొనుగోలు చేయనుంది. వీటి ద్వారా కేవలం 2 నిమిషాల్లోనే పరీక్ష పూర్తి చేస్తారు. గ్రామాల్లోని 71 లక్షల మందికి పరీక్షలు చేస్తారు.

PREV
16
టీబీ బాధితులకు గుడ్ న్యూస్: ఇక ఇంటి వద్దకే వచ్చి నిమిషాల్లోనే పరీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్షయ (టీబీ) రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఏఐ ఆధారంగా పనిచేసే అత్యాధునిక హ్యాండ్ హెల్డ్ ఎక్స్ రే మిషన్ల ద్వారా టీబీ అనుమానిత కేసులను కేవలం రెండు నిమిషాల్లోనే గుర్తించనున్నట్లు ఆయన వెల్లడించారు.

26
రూ. 20 కోట్లతో 100 అత్యాధునిక మిషన్ల కొనుగోలు

రాష్ట్రవ్యాప్తంగా టీబీ పరీక్షలను వేగవంతం చేసేందుకు సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో 100 హ్యాండ్ హెల్డ్ ఎక్స్ రే మిషన్లను టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మిషన్లు సూట్‌కేస్ తరహాలో కేవలం 12 కేజీల బరువు మాత్రమే ఉంటాయి. దీనివల్ల వైద్య సిబ్బంది వీటిని సులభంగా మారుమూల గ్రామాలకు తీసుకెళ్లి, ప్రజల ఇంటి ముంగిటనే పరీక్షలు నిర్వహించే అవకాశం కలుగుతుంది. ప్రతి జిల్లాకు సగటున 6 నుండి 8 మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

36
రెండు నిమిషాల్లోనే టీబీ పరీక్ష ఫలితం.. ఎలా పనిచేస్తుందంటే?

ప్రస్తుతం అందుబాటులోకి రానున్న ఈ ఏఐ మిషన్ల పనితీరు అత్యంత వేగవంతంగా ఉంటుంది.

• వ్యక్తి ఛాతీ భాగాన్ని డిజిటల్ ఎక్స్ రే తీయగానే, కేవలం 30 సెకన్లలో అది కంప్యూటర్ తెరపై కనిపిస్తుంది.

• ఏఐ సాఫ్ట్‌వేర్ సాయంతో మరో నిమిషం వ్యవధిలోనే రిపోర్టు సిద్ధమవుతుంది.

• మొత్తం ప్రక్రియ రెండు నిమిషాల్లోనే పూర్తవుతుంది.

• ఈ ఎక్స్ రే రిపోర్టులో అనుమానిత లక్షణాలు కనిపిస్తే, తదుపరి చర్యగా కళ్లె పరీక్షలు నిర్వహిస్తారు.

గణాంకాల ప్రకారం 100 మందికి ఎక్స్ రే తీస్తే 25 శాతం అనుమానిత కేసులు, అందులో 5 శాతం నిర్ధారిత కేసులు వచ్చే అవకాశం ఉందని అంచనా.

46
4,126 హాట్‌స్పాట్ గ్రామాలు.. 71 లక్షల మందికి పరీక్షలు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 4,126 గ్రామాలను టీబీ హాట్‌స్పాట్లుగా గుర్తించింది. ఈ గ్రామాల్లో నివసిస్తున్న 14 ఏళ్లు పైబడిన సుమారు 71 లక్షల మందికి ఎటువంటి లక్షణాలు లేకపోయినా ఉచితంగా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 612 గ్రామాలు హాట్‌స్పాట్లుగా ఉండగా, శ్రీకాకుళంలో 374, విజయనగరంలో 317 గ్రామాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం, లిక్కర్ సేవించడం, ధూమపానం, వాతావరణ మార్పుల ఆధారంగా ఈ గ్రామాలను కేంద్రం ఎంపిక చేసింది.

56
ఇంటర్నెట్ లేకున్నా పని చేసే ప్రత్యేక టెక్నాలజీ

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 47 మిషన్లను రాష్ట్రానికి పంపగా, వాటి పనితీరును ఐసీఎంఆర్ (ICMR) మెచ్చుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోయే కొత్త మిషన్లకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏఐ రిపోర్టుల కోసం ఇంటర్నెట్ అవసరం అవుతుంది, కానీ ఈ కొత్త మిషన్లు ఇంటర్నెట్ సదుపాయం లేని మారుమూల గ్రామాల్లో కూడా రిపోర్టులను అందించగలవు. వీటిని గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల వద్దకు తీసుకెళ్లి స్థానికులకు పరీక్షలు నిర్వహిస్తారు.

66
ఏపీలో టీబీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?

మంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025లో రాష్ట్రంలో 78,416 టీబీ కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి లక్ష మందికి 146 మంది బాధితులు ఉన్నారు. 2026 జనవరి నుంచి ఇప్పటివరకు 16,727 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం పాత, కొత్త కేసులు కలిపి సుమారు 40 వేల మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో టీబీ స్వస్థత రేటు 95.5 శాతంగా ఉండటం సానుకూల అంశం. నిక్షయ్ మిత్ర పథకం ద్వారా గత ఏడాది దాతలు 22,788 న్యూట్రిషన్ కిట్లను బాధితులకు అందజేశారు.

చివరగా, రాష్ట్రంలోని 1,118 గ్రామాలను టీబీ ముక్త పంచాయతీలుగా కేంద్రం గుర్తించింది. వెయ్యి జనాభాకు 30 మందికి పరీక్షలు చేయడం, నగదు బదిలీ (DBT) వంటి ప్రమాణాలను పాటించినందుకు గాను ఈ గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యవేక్షణాధికారి డాక్టర్ రమేష్ పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories