
చేపల పులుసులో ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తారు. ఎలా చేసినా కూడా టేస్ట్ అదిరిపోతుంది. ఎక్కువ మంది చింతపండు పులుసు పోసి చేపల పులుసు చేస్తూ ఉంటారు. అలాగే చేపల పులుసు కోసం ప్రత్యేకమైన మసాలా పొడి కూడా ఉంటుంది. దాన్ని తయారు చేసుకొని కూరలో కలిపి వండితే అదిరిపోతుంది. ఇక్కడ మేము చేపల పులుసు టేస్టీగా ఎలా వండాలో ఇచ్చాము. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు కచ్చితంగా నచ్చితేరుతుంది.
చేపలు అరకిలో, నూనె అరకప్పు, కొత్తిమీర తరుగు మూడు స్పూన్లు, చింతపండు నిమ్మకాయ సైజులో, నీళ్లు ఒక గ్లాసు, ధనియాల పొడి ఒక స్పూను, కారం ఒక స్పూను, పసుపు అర స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను, టమోటో తరుగు అరకప్పు, పచ్చిమిర్చి ఐదు, ఉల్లిపాయల తరుగు అరకప్పు, కరివేపాకులు గుప్పెడు, ధనియాలు ఒక స్పూను, వెల్లుల్లి రెబ్బలు 10, మెంతులు అర స్పూను, ఎండుమిర్చి పది... సిద్ధం చేసుకోవాలి.
1. ముందుగా చేప మసాలా పొడిని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం మీరు స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు వేసి వేయించండి.
3. ఆ తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు కూడా వేసి వేయించండి. వీటిని పొడి చేసి పక్కన పెట్టుకోండి. అంతే చేప మసాలా పొడి రెడీ అయినట్టే.
4. ఆ తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తటి పేస్ట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
5. ఆ నూనెలో ముందు కరివేపాకులు వేసి వేయించండి. ఆ తర్వాత మిక్సీలో రుబ్బుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను వేసి రంగు మారేవరకు వేయించుకోండి.
6. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఉప్పును వేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకోండి.
7. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. ఇప్పుడు టమోటో ముక్కలను వేసి బాగా కలిపి మూత పెట్టండి. టమోటోలు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
9. టమోటోలు మెత్తగా ఇగురులాగా ఉడికాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసి కలపండి.
10. అలాగే గ్లాస్ వాటర్ ని కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు పైన మూత పెట్టి చేపల పులుసును బాగా మరగనివ్వండి.
11. మూత తీసాక చేపల పులుసు నుంచి ఆవిరి,బుడగలు వస్తున్నప్పుడు చేప ముక్కలను వేసేయండి. దాన్ని చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించండి.
12. మరొక 15 నిమిషాలలో నూనె పైకి తేలి పులుసు చిక్కగా అవుతుంది. ఆ సమయంలోనే చేపల మసాలా పొడిని వేసి కలుపుకోవాలి.
13. అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసి కలుపుకోవాలి. దీన్ని చేపలు విరిగిపోకుండా ఒకసారి కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి.
14. టేస్టీ చేపల పులుసు రెడీ అయినట్టే. ఇది పలుచగా కాకుండా చిక్కగా వస్తుంది. అంతే చేపల పులుసు సిద్ధమైపోతుంది.
చేపల పులుసు వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది. ఒక్కసారి తిని చూడండి మీ ఇంటిల్లిపాదికి నచ్చేస్తుంది. పైన మేము చెప్పిన పద్ధతిలో వండి చూడండి రుచి మర్చిపోలేరు.