బాలీవుడ్ లో డ్రగ్ బానిసలు ఉన్నారు, కానీ...షోలే నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

By Satish ReddyFirst Published Sep 19, 2020, 10:10 AM IST
Highlights

బాలీవుడ్ లో డ్రగ్స్ రచ్చ నడుస్తుండగా రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బాలీవుడ్ డ్రగ్ కల్చర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, మరికొందరు వాటిని ఖండిస్తున్నారు. తాజాగా షోలే మూవీ నిర్మాత రమేష్ సిప్పీ ఈ వ్యవహారంపై స్పందించారు. 

డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ లో ఆరోపణలు,  ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. బాలీవుడ్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిందని, డ్రగ్ కల్చర్ తీవ్ర స్థాయిలో ఉందని కంగనా, రవి కిషన్ లాంటి వాళ్ళు ఆరోపణలు చేశారు. వీరి ఆరోపణలను సీనియర్ నటి జయ బచ్చన్ ఖండించడం జరిగింది. ఎవరో ఒకరు డ్రగ్స్ వాడుతున్నారన్న నెపంతో మొత్తం బాలీవుడ్ కి డ్రగ్స్  మరక అంటించడం సరికాదు అన్నారు. డ్రగ్స్ కేసులో రాజకీయ కోణం ఉందని, పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రగ్ కేసు అని ఆమె ధ్వజం ఎత్తారు. 

తాజాగా సీనియర్ నిర్మాత రమేష్ సిప్పీ ఈ వ్యవహారంపై నోరు విప్పారు. బాలీవుడ్ ని కొందరు ఉద్దేశ పూర్వకంగా చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. బాలీవుడ్ అంటేనే డ్రగ్స్, సెక్స్, ఆల్కహాల్ చుట్టూ తిరిగే పరిశ్రమగా చెప్పడం సబబు కాదని అన్నారు. బాలీవుడ్ లో అసలు డ్రగ్ కల్చర్ లేదని నేను అనను, అన్ని పరిశ్రమలలో మాదిరే ఇక్కడ కూడా ఎంతో కొంత ఉంది. కానీ ప్రచారం జరుగుతున్నట్లుగా బాలీవుడ్ డ్రగ్స్ ఊబిలో కూరుకుపోలేదు అన్నారు. 

బాలీవుడ్ లో కూడా కొందరు డ్రగ్స్  బానిసలు ఉన్నారని, అయితే దానిని ప్రతి ఒక్కరికీ ఆపాదించి నిందించడం తప్పని సిప్పీ చెప్పుకొచ్చారు. నేను డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించడం లేదు, వస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని చెబుతున్నానని రమేష్ సిప్పీ చెప్పడం జరిగింది. కాగా మరోవైపు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్  గతంలో ఇచ్చిన ఓ ప్రైవేట్ పార్టీకి సంబందించిన వీడియో బయటికి రాగా అందులో చాల మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ వీడియోలో దీపికా, మలైకా, అర్జున్ కపూర్, విక్కీ కౌశల్, రన్బీర్ కపూర్ తోపాటు మరికొందరు ప్రముఖులు ఉన్నారు.   

click me!