ఇద్దరు ముఖ్యమంత్రులను కెలికిన వర్మ.. `కరోనా వైరస్`‌ ట్రైలర్‌

By Satish ReddyFirst Published May 26, 2020, 6:38 PM IST
Highlights

ప్రపంచంలోనే కరోనా నేపథ్యంలో తొలి సినిమాను రూపొదించాడు వర్మ. కరోనా వైరస్‌ పేరుతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెర తీశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ ప్రకటించటంలో సినీ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. వర్మ మాత్రం కరోనాకు లాక్‌ డౌన్‌కు అతీతుడిలా ఉన్నాడు. ఇటీవల క్లైమాక్స్‌ పేరుతో పోర్న్‌ స్టార్ మియా మాల్కోవాతో తెరకెక్కించిన సినిమా ప్రమోషన్‌ ప్రారంభించాడు. ఈ సినిమాను ఈ నెల 29న డిజిటల్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ. ఈ సినిమా పనులు కొనసాగుతుండగానే మరో సినిమాను షూట్‌ చేసి ట్రైలర్‌ కూడా రిలీజ్ చేశాడు.

ప్రపంచంలోనే కరోనా నేపథ్యంలో తొలి సినిమాను రూపొదించాడు వర్మ. కరోనా వైరస్‌ పేరుతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్‌ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కరోనా విపరీతంగా విస్తరిస్తోంది అని వార్తల్లో వస్తున్న వాయిస్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఆ ఇంట్లో ఉండే అమ్మాయి దగ్గు, జలుబు, గొంతు నొప్పి రావటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలవుతుంది. ఓ మామూలు అంశాన్ని వర్మ తనదైన స్టైల్‌లో థ్రిల్లింగ్‌గా రూపొందించాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా అగస్త్య మంజు పేరునే వేశాడు వర్మ.

వర్మ ఆస్థాన నటులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  చెప్పిన `పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది.. బ్లీచింగ్ పౌడర్‌ చల్లితే సరిపోతుంది` అన్న మాటలతో ముగించాడు. కాంట్రవర్సీ లేకుండా సినిమాను రిలీజ్ చేయని వర్మ కాంట్రవర్సీ కోసమే ఆ మాటలను చేర్చి ఉంటాడని భావిస్తున్నారు. పూర్తిగా లాక్‌ డౌన్‌ సమయంలోనే షూట్‌ చేసినట్టుగా చెప్పాడు వర్మ. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ ప్లాట్‌ ఫాంలో రిలీజ్‌ అవుతుందన్న విషయాన్ని మాత్రం వర్మ ప్రకటించలేదు.

click me!