సోనూసూద్‌ దారిలో విలక్షణ నటుడు.. పేద విద్యార్థిని పాలిట ఆప‌ద్బాంధ‌వుడు

By Aithagoni RajuFirst Published Oct 3, 2020, 8:04 PM IST
Highlights

సోనూసూద్‌ మాదిరిగా తాను కూడా రియల్‌ హీరో అనిపించుకున్నారు విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌. తాజాగా మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఓ మట్టిలో మాణిక్యాన్ని ఉన్నత చదువులు చదివించేందుకు ముందుకు వచ్చారు. 

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ముందే ఉంటారు. ఆయన నాలుగేళ్ల క్రితమే తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని తన గొప్ప మనసుని చాటుకున్నారు. అంతేకాదు లాక్‌ డౌన్‌ సమయంలో వలస కార్మికులను ఆదుకున్నారు. వారికి తన హౌజ్‌లోనే భోజనం, వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. సురక్షితంగా వారి స్వస్థలాలకు వెళ్లే ఏర్పాటు చేశారు. 

ఇలా సోనూసూద్‌ మాదిరిగా తాను కూడా రియల్‌ హీరో అనిపించుకున్నారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఓ మట్టిలో మాణిక్యాన్ని ఉన్నత చదువులు చదివించేందుకు ముందుకు వచ్చారు. పశ్చిమ గోదావరికి చెందిన సిరిచందన అనే అమ్మాయి మాస్టర్‌ డిగ్రీ చేయడానికి మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సాల్‌ఫోర్డ్ లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో సీట్‌ వచ్చింది. 

అయితే సిరిచందన పేద విద్యార్థి. తండ్రి కూడా లేడు. విదేశాలకు వెళ్లే ఆర్థిక స్థోమత లేదు. అక్క‌డ‌కు వెళ్ల‌డానికి ఆశ‌లు వ‌దిలేసుకున్న ఆమె పాలిట ఆప‌ద్బాంధ‌వుడ‌య్యారు ప్ర‌కాష్‌రాజ్‌. ఆమెను మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో చ‌దివించ‌డానికి ముందుకు వ‌చ్చారు. దీంతో సిరిచంద‌న‌, ఆమె త‌ల్లి ఆనందాన్ని అవ‌ధులు లేవు. హైద‌రాబాద్‌లో షూటింగ్‌లో ఉన్న ప్ర‌కాష్‌రాజ్‌ను క‌లుసుకొని, త‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా సిరిచంద‌న తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, `నాకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు నాన్నగారు చనిపోయారు. అప్పటిం నుంచి అమ్మే కష్టపడి మమ్మల్ని చదివించింది. యూనివ‌ర్సిటీలో సీట్‌ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడానికి నేను ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆర్థికంగా నా కుటుంబ పరిస్థితి నాకు తెలుసు. న‌రేంద్ర అనే మా శ్రేయోభిలాషి ఒక‌రు నా గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన‌ప్పుడు, ప్ర‌కాష్‌రాజ్ గారు అదిచూసి, త‌న‌కు నేను హెల్ప్ చేస్తాను, త‌ను బాగా చ‌దువుకోవాలి అని ముందుకు వ‌చ్చారు. అన్ని ఖ‌ర్చులు ఆయ‌నే భ‌రిస్తున్నారు. ఆయ‌న ఇచ్చిన ప్రేర‌ణ‌తో నేను బాగా చ‌దువుకొని, నాలాంటి స్థితిలో ఉన్న మ‌రో న‌లుగురికి సాయం చేయాల‌ని అనుకుంటున్నా` అని తెలిపింది. 

click me!