అదే సూపర్ స్టారో... పవర్ స్టారో అయితే ఇలానే అంటావా దర్శకేంద్రా!

By Sambi ReddyFirst Published Aug 17, 2022, 11:46 AM IST
Highlights


వాంటెడ్ పండు గాడ్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహనం కోల్పోయారు. వేడుకకు వచ్చిన అభిమానులపై మండిపడ్డారు. అసలు వీళ్ళను ఎవరు పిలిచారు. ఎక్కువ చేస్తే బయటకు పంపేస్తా అన్నారు. 


పబ్లిక్ వేడుకల్లో ఫ్యాన్స్ రచ్చ మాములే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో సపరేట్ బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉన్నారు. వాళ్ళ అల్లరి పలుమార్లు విమర్శల పాలైంది. తాజాగా వాంటెడ్ పండు గాడ్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన సుడిగాలి సుధీర్ అభిమానులు అల్లరి చేశారు. సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో ఆయన ఆవేశం కట్టలు తెంచుకుంది. వాళ్ళు నొచ్చుకునేలా అవమానకర వ్యాఖ్యలు చేశాడు. 

మౌనంగా ఉండాలని రెండు నిమిషాలు చెప్పి చూసిన రాఘవేంద్రరావు... సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్  కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. వేడుకలో అల్లరి చేయకుండా ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి. మిమ్మల్ని అసలు ఎవడు పిలిచాడు. గోల చేయడం ఆపకపోతే బయటికి గెంటేస్తా. పెద్ద చిన్నా అనే మర్యాద లేదా  అన్నారు. ఒక విధంగా వేడుకకు హాజరైన వాళ్ళను ఆయన అవమానించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

ఆ మాత్రం అల్లరికే తీవ్ర స్థాయిలో తిట్టాల్సిన, అవమానించాల్సిన అవసరం లేదంటున్నారు. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ స్థానంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ ఫ్యాన్స్ ఉంటే ఆయన ఇలాగే స్పందించేవారా? అని ప్రశ్నిస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఓ చిన్నస్థాయి హీరో కాబట్టి  ఆయన వేదికపై ఉండగానే ఫ్యాన్స్ ని రాఘవేంద్రరావు అవమానించారన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. 

మరోవైపు వాంటెడ్ పండు గాడ్ భారీ తారాగణంతో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. బ్రహ్మానందం, అనసూయ, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్, విష్ణు ప్రియతో పాటు వెండితెర, బుల్లితెరకు చెందిన నటులు, యాంకర్స్ చాలా మంది నటిస్తున్నారు. సునీల్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఆగస్టు 19న పండు గాడ్ విడుదల కానుంది. 

click me!