కరోనా ఎఫెక్ట్..‌ సినిమాల సెన్సార్‌ విషయంలో కీలక నిర్ణయం

By Satish ReddyFirst Published May 14, 2020, 4:24 PM IST
Highlights

లాక్ డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి జాతీయ స్థాయిలో సెన్సార్ బోర్డ్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. దీంతో చాలా సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు సినిమాల రిలీజ్‌కు పర్మిషన్‌ ఇచ్చినా ఉన్న పళంగా సినిమాలను రిలీజ్ చేసే పరిస్థితి లేదు. దీంతో సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రపంచ అంతా ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు అడుగు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఈ ప్రభావం సినీ రంగం మీద తీవ్ర స్థాయిలో ఉంది. చాలా సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.  అయితే షూటింగ్ దశలోనే ఆగిపోయిన సినిమాలు లాక్ డౌన్‌ తరువాత షూటింగ్ కు వెళతాయి. కానీ ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సినిమాల రిలీజ్‌ విషయంలో సందిగ్దత నెలకొంది. లాక్ డౌన్‌ ముగిసిన వెంటనే సినిమాలు రిలీజ్ కావాలంటే ఈ లోగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావాలి.

అయితే లాక్ డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి జాతీయ స్థాయిలో సెన్సార్ బోర్డ్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. దీంతో చాలా సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు సినిమాల రిలీజ్‌కు పర్మిషన్‌ ఇచ్చినా ఉన్న పళంగా సినిమాలను రిలీజ్ చేసే పరిస్థితి లేదు. దీంతో సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌ డౌన్‌ చాలా సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సెన్సార్‌ బోర్డ్ ఆగిపోయిన సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రీయ చలన చిత్ర ధృవీకరణ సంస్థ (సెన్సార్ బోర్డ్‌) కీలక నిర్ణయం తీసుకుంది.

కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అలాంటి వారి కోసం కూడా సెన్సార్‌ సర్టిఫికేట్‌ను జారీ చేయనున్నారు. అందుకు సెన్సార్ బోర్డ్‌ కొన్ని వెసలుబాట్లు కలిగిస్తూ కొన్ని మార్గదర్శకాలు వెల్లడించింది. తాజాగా ఈ సంస్థ చైర్మన్ దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లోని సెన్సార్ కార్యాలయాలతో చర్చించారు. 

ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ... `  లాక్‌డౌన్ వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించాం. సినిమా సెన్సార్‌కు నిర్మాతలు పర్సనల్‌గా హాజరు కాకున్నా ఆన్‌లైన్‌లో సంప్రదింస్తే, ఈ-మెయిల్‌లో సర్టిఫికెట్లు జారీ చేస్తాం. అలాగే నిర్మాత కొరుకున్న చోట సినిమా సెన్సార్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామ`ని చెప్పారు.  ఈ నిర్ణయంతో చిన్న సినిమాల నిర్మాతలకు ఊరట లభించినట్టైంది.

click me!