కరోనా ఎఫెక్ట్ః రైతుగా మారిన హిందీ నటుడు..

By Aithagoni RajuFirst Published Jul 20, 2021, 10:38 AM IST
Highlights

కరోనా ప్రభావంతో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రైతుగా మారిపోయాడు. అయితే కరోనా తనకు మంచే చేసిందంటున్నారు హిందీ నటుడు ఆశిష్‌ శర్మ.

కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను తలక్రిందులు చేస్తుంది. సినిమా రంగంపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. అనేక మంది సినీ కార్మికులు రోడ్డు పడ్డారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌  నటుడు రైతుగా మారిపోయాడు. అయితే కరోనా తనకు మంచే చేసిందంటున్నారు హిందీ నటుడు ఆశిష్‌ శర్మ. `సియా కే రామ్‌` సీరియల్‌తో బుల్లితెరకి పరిచయమైన ఆశిష్‌.. `మోదీః జర్నీ ఆఫ్‌ కామన్‌ మ్యాన్‌`వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో యంగ్‌ ఏజ్‌ మోడీగా నటించారు. 

తాజాగా కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. సొంత రాష్ట్రమైన రాజస్థాన్‌కి వెళ్లిపోయిన ఆయన రైతుగా మారాడు. పచ్చని చేలలో సేద తీరుతున్నాడు. తన పంట పొలాలను, ఆవులను చూసుకుంటూ హాయిగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫోటోలను సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు ఆశిష్‌. 

 ఇందులో ఆయన చెబుతూ, `జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం మనం ఎప్పుడో మర్చిపోయాం. నిజానికి కోవిడ్‌ మూలంగానే మన జీవితంలో అతి ముఖ్యమైనవి ఏమిటో తెలిసివచ్చింది. ప్రకృతి విలువ, అందులోని మాధుర్యం గురించి అర్థం చేసుకోగలిగాను. తరతరాలుగా మా వృత్తి వ్యవసాయం. ముంబైకి వచ్చాక నేను నా మూలాలకు దూరమయ్యాను. లాక్‌డౌన్‌ సమయంలో మా ఊరు ఎంతగానో గుర్తుకువచ్చింది. ఊళ్లో మాకు 40 ఎకరాల భూమి ఉంది. 40 ఆవులు ఉన్నాయి. ప్రకృతి తల్లితో మమేకమవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే తిరిగి వచ్చాను` అని చెప్పుకొచ్చాడు.

 జైపూర్‌లోని తమ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఆశిష్‌ శర్మ.. గోమాత గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేమని, తాను ఇప్పుడు పాలు పితకడం కూడా నేర్చుకున్నానని పేర్కొన్నాడు. `లవ్‌ సెక్స్‌ ఔర్‌ ధోఖా`, `జిందగీ తేరేనామ్‌` వంటి సినిమాల్లో నటించిన ఆశిష్‌ శర్మ.. `రంగ్‌రసియా` సీరియల్‌తో బుల్లితెరపై స్టార్‌గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన కరణ్‌ రాజ్‌దాన్‌ `హిందుత్వ` ప్రాజెక్టులో కనిపించనున్నాడు.  2013లో నటి అర్చన తడేను మ్యారేజ్‌ చేసుకున్నాడు. 

click me!