అపరిశుభ్రతకు అడ్డాగా వేములవాడ హోటళ్లు

By telugu teamFirst Published Nov 6, 2019, 1:42 PM IST
Highlights

వేములవాడ హోటళ్లు అపరిశుభ్రతకు ఆలవాలంగా మారాయి. వాటిని పరిశీలించినప్పుడు అపరిశుభ్రత తాండవిస్తూ కనిపించింది. దీనిపై వేములవాడకు వస్తున్న భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలో స్థానిక హోటళ్లు భక్తుల పాలిట శాపంగా మారాయి. రాజన్న దర్శనం కోసం ఎన్నో గంటలు వేచి చూసి అలసిపోయి గుడి బయటకు వచ్చి ఏదైనా తిందామని భావిస్తున్న భక్తులకు హోటళ్ల వాతావరణం చూసి హడలిపోతున్నారు. సాధారణంగా కార్తీక మాసంలో, శివరాత్రి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకునే హోటల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వీపరీతమైన ధరలతో వాళ్ళు నిర్ణయించిన పెద్ద మొత్తంలో భక్తులకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. చిన్న అల్పాహారం చేయాలన్న ఆ అపరిశుభ్రమైన ఆహారానికి అంత మొత్తం వెచ్చించలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

గుడి ఎదురుగానే ఉన్న కూమారన్ హోటల్ ని పరిశీలించినప్పుడు అక్కడ విపరీతమైన అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ జరుగుతుంది. నిల్వ ఉంచిన పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. భక్తులు వేరే అవకాశం లేక గుడికి దగ్గరలోనే ఉన్న హోటల్ నే ఆశ్రయించటాన్ని వ్యాపారులు అంది వచ్చిన అవకాశంగా తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల రాజన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్లిన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు.

దీనిపై భక్తులు మున్సిపల్ అధికారులకు, ఫుడ్ ఇన్స్పెక్టర్ లకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ... పట్టించుకోవట్లేదు. ఒకవేళ ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చి తనిఖీ చేసినా కానీ ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు. దీనికంతటికి కారణం స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్ లకు మామూళ్లు అందటమే అని తెలుస్తుంది. ఇటు పోలీసులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇలా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హోటళ్లపై చర్యలు తీసుకొని భక్తులకు సరైన ఆహరం అందేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

click me!