విద్యార్థిపై ప్రధానోపాధ్యాయురాలి వేధింపులు... బాలుడి ఆత్మహత్యాయత్నం

By Arun Kumar PFirst Published Oct 17, 2019, 5:16 PM IST
Highlights

కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహిళా ఉపాధ్యాయురాలి వేధింపులు తట్టుకోలేక ఓ బాలుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

కర్నూలు: జిల్లాలోని ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఈ గ్రామానికి సమీపంలోని లోకిపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం విద్యార్థి  పరిస్థితి విషయంగా వున్నట్లు సమాచారం. 

 స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేఖాదేవి వేధింపుల వల్లే అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పదో తరగతి చదువుతున్న తనను  నిత్యం రేఖాదేవి వేధించేదని...ఈ మధ్యకాలంలో ఆ వేధింపులు మరీ ఎక్కువవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు రవిశంకర్(16) ఆరోపిస్తున్నాడు. 

కేవలం తననే టార్గెట్ గా చేసుకుని ప్రధానోపాధ్యాయురాలు అందరి ముందర అవమానకరంగా మాట్లాడేదన్నాడు. నేలపై కూర్చోబెట్టి తనను చిత్రహింసలకు గురి చేసిందని విద్యార్థి ఆరోపించాడు. 

ఇంట్లో తన తల్లిదండ్రులకు తాతకు విషయం చెప్పినా వారు తనకే సర్దిచెప్పి స్కూలుకు పంపించే ప్రయత్నం చేశారని వాపోయాడు. దీంతో ఏం  చేయాలో తోచలేదని...వేధింపులతో కూడిన స్కూల్ కు వెళ్ళడం ఇష్టం లేక తాను ఇలా ఆత్మహత్యాయత్నం చేశానని బాలుడు తెలిపాడు.

 తన మనవడు విషయం చెప్తున్న సర్దిచెప్పి స్కూలుకు పంపించానని... కానీ ఇటువంటి పనికి పాల్పడతాడని తెలిస్తే ఇంతవరకు తెచ్చుకునే వారం కాదని  బాలుడి తాతయ్య తెలిపాడు. బాలుడు ఒంటికి పెట్రోల్ తో నిప్పంటించుకోడంతో 50% కాలిన గాయాలవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో అతడికి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారని తెలిపారు. 
 

click me!