యురేనియం: నల్లమలలో నల్గొండ చరిత్ర పునరావృతమయ్యేనా?

By narsimha lodeFirst Published Sep 15, 2019, 6:45 AM IST
Highlights

నల్లమలలో యురేనియం తవ్వకాలపై స్థానికులు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడ స్థానికుల పోరాటానికి అండగా నిలిచారు. గతంలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేసి ప్రాజెక్టును రాకుండా అడ్డుకొన్నారు.

నల్గొండ:ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడ యురేనియం తవ్వకాలపై ప్రజలు సమరభేరి మోగించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగించారు.ఈ పోరాటంతో యురేనియం ప్రాజెక్టు శుద్ది ప్రాజెక్టు వెనక్కి వెళ్లింది. ప్రాజెక్టు చేపట్టాలని ఒకరిద్దరూ యురేనియం కార్పోరేషన్ కు మద్దతుగా నిలిచినా 90 శాతం ప్రజలు ప్రాజెక్టును వ్యతిరేకించారు.

నల్లమలలో యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాల విషయమై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విపక్షాలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టాయి. ఆదివారం నాడు హైద్రాబాద్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాయి.ఈ సమావేశంలో యురేనియంపై తవ్వకాలపై భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేయనున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టు ఏర్పాటు విషయమై ప్రతిపాదనలు తెరమీదికి వచ్చాయి.యురేనియం ప్రాజెక్టుకు అవసరమైన  ముడి యురేనియం నిక్షేపాలు పెద్దఅడిశర్లపల్లి మండలంలోని నంభాపూర్- పెద్దగట్టు గుట్టల్లో ఉన్నాయని యురేనియం కార్పోరేషన్ గుర్తించింది. రోజుకు 1250 టన్నుల యురేనియం నిక్షేపాలను వెలికి తీసే అవకాశం ఉంది. యురేనియం నిక్షేపాల వెలికి తీసేందుకు రూ.507 కోట్లు ఖర్చు అవుతోందని యురేనియం కార్పోరేషన్ ఆనాడు ప్రకటించింది.

యురేనియం తవ్వకాల ప్రాజెక్టు కోసం 1316 ఎకరాల భూమి అవసరమని యూసీఐఎల్ ప్రతిపాదించింది.ఈ భూమిలో 1058 ఎకరాల భూమి ఎల్లాపూర్ రిజర్వ్ ఫారెస్ట్(రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యం) భూమి. మిగిలిన భూమిని ప్రాజెక్టు ప్రతిపాదించే గుట్టల పక్క గ్రామాల నుండి సేకరించాలని తలపెట్టారు. 

యురేనియం శుద్ది కర్మాగారాన్ని పెద్ద అఢిశర్లపల్లి మండలంలోని దుగ్యాల- మల్లాపూర్ గ్రామాల మధ్య నెలకొల్పాలని భావించారు. దీని కోసం 795 ఎకరాలు భూమి అవసరమని యూసీఐఎల్ ప్రతిపాదించింది. ఇందులో 632 ఎకరాల భూమిని గ్రామస్తుల నుండి సేకరించాలని తలపెట్టారు.

మిగిలిన భూమి ప్రభుత్వానిది. గ్రామస్తుల నుండి భూ సేకరణ కోసం రూ.315 కోట్లు ఖర్చు అవుతోందని యూసీఐఎల్ అంచనా వేసింది.యురేనియం ముడి  నిక్షేపాలను వెలికి తీసి దుగ్యాల సమీపంలో ప్రతిపాదించిన ప్యాక్టరీలో శుద్ది చేయాలని యూసీఐఎల్ తలపెట్టింది. 

యురేనియం నిక్షేపాలు వెలికితీసే గుట్టలు నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు 1.5 కి.మీ దూరంలోనే ఉన్నాయి. నిక్షేపాలు వెలికితీసే క్రమంలో వచ్చే దుమ్ము, థూళి సాగర్ రిజర్వాయర్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. 

మరో వైపు యురేనియం శుద్ది చేసిన వృధా నీరు కూడ సాగర్ రిజర్వాయర్ లో కలిసే అవకాశం ఉంది. మరో వైపు ప్రాజెక్టుకు సమీపంలోనే జంటనగరాలకు కృష్ణా నీటిని  అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. ఈ నీరు కూడ కలుషితమయ్యే అవకాశం ఉంది

మరో వైపు రాజీవ్ గాంధీ టైగర్ ప్రాజెక్టుకు, అరుదైన పక్షులకు కూడ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆనాడు పర్యావరణ వేత్తలు, స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.

యురేనియం ప్రాజెక్టు ఏర్పాటు కోసం 2003 ఆగష్టు 19ననల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో యురేనియం ప్రాజెక్టు ఏర్పాటు విషయమై పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ఈ పబ్లిక్ హియరింగ్ లో ప్రజలంతా ముక్తకంఠంతో ప్రాజెక్టును వ్యతిరేకించారు.

స్థానికంగా ప్రజలు వ్యతిరేకించడంతో ముడి యురేనియంను వెలికితీసి కొండమల్లేపల్లికి సమీపంలోని శేరిపల్లిలో శుద్ది కర్మాగారం ఏర్పాటు చేయాలని యూసిఐఎల్ ప్రతిపాదించింది.ఈ మేరకు 2005 మార్చి 3వ తేదీన నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.

పలు రాజకీయపార్టీలు, ప్రజలు,స్వచ్ఛంధ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించడంతో యురేనియం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన వెనక్కు వెళ్లింది. ప్రస్తుతం నల్లమలలో కూడ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు.నల్లగొండ ప్రజల మాదిరిగానే నల్లమల వాసులు కూడ పోరాటం చేసి యురేనియం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొంటారా.. లేదా అనేది కాలమే నిర్ణయించనుంది.

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్: ఐక్య పోరాటానికి పిలుపు

యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ నిరసన: నాగర్‌కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

నల్లమలని నాశనం చేయొద్దు.. కేటీఆర్ కు ట్యాగ్ చేసిన శేఖర్ కమ్ముల

పవన్ తర్వాత విజయ్ దేవరకొండ సెటైర్స్.. ఏం పీకుతాం దానితో!!

ఎలా అనుమతిస్తున్నారు సార్ ఇదంతా..? అనసూయ ఫైర్!

సేవ్ నల్లమల.. మహేష్ బాబు ఎందుకంత సైలెన్స్?

 

 

click me!