హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీకి దిగనున్నారు. టీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి నిలబడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
హుజూర్ నగర్: హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేయనున్నారు. శాసనసభ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
నల్లగొండ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దాంతో ఆయన హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. తద్వారా హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
undefined
ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కోదాడ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ నుంచి ఉప ఎన్నికలో పోటీకి దించడానికి కాంగ్రెసు పలువురు నాయకుల పేర్లను పరిశీలించింది. మాజీ మంత్రి కె. జానారెడ్డి పోటీ చేయడానికి నిరాకరించారు. దాంతో ఎట్టకేలకు అందరూ అనుకున్నట్లుగానే పద్మావతి పేరు ఖరారైంది.
కాగా, టీఆర్ఎస్ నుంచి తిరిగి శానంపూడి సైదిరెడ్డే పోటీ చేసే అవకాశాలున్నాయి. బిజెపి కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దాంతో అభ్యర్థి వేటలో పడింది. కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణికి బిజెపి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది.