వర్ల రామయ్యకు నెలరోజుల గడువు ఇచ్చిన సీఎం జగన్

By Nagaraju penumalaFirst Published Sep 28, 2019, 4:23 PM IST
Highlights

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న టీడీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. కానీ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న వర్ల రామయ్య మాత్రం రాజీనామా చేయకుండా ఉన్నారు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యకు నెలరోజులు గడువు ఇచ్చింది జగన్ ప్రభుత్వం.  ఆర్టీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకునేందుకు నెలరోజులుపాటు సమయం ఇస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది.

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న టీడీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. కానీ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న వర్ల రామయ్య మాత్రం రాజీనామా చేయకుండా ఉన్నారు. 

రాజీనామా చేయాలని గతంలో ప్రభుత్వం కోరినా పట్టించుకోవడం లేదు. దాంతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవి కేవల ఏడాది కాలం పాటు ఉంటుంది. కానీ వర్ల రామయ్య ఏడాది కాలం దాటినా ఆ పదవిని వదలడం లేదు. 

వాస్తవానికి ఏప్రిల్ 24, 2019కి ఆర్టీసీ చైర్మన్ గా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్నారు వర్ల రామయ్య. అనంతరం తన పదవికి రాజీనామా చేయాల్సి ఉండగా చేకపోవడంతో రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్ 8లోని ఉప నిబంధన2 ప్రకారం నెలరోజులు గడువు ఇస్తూ నోటీసులు జారీ చేశారు.  

వర్ల రామయ్యతోపాటు విజయవాడ జోనల్‌ చైర్మన్‌ పార్థసారధికి కూడా ఒక నెల గడువిస్తూ ఆర్టీసీ ఎండీ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన కడప జోనల్‌ చైర్మన్‌ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదించారు. 

 

click me!