BWF: వరల్డ్ ఛాంపియన్షిప్‌లో భారత్ ఇప్పటివరకు ఎన్ని పతకాలు గెలిచింది..? టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది..?

By Srinivas MFirst Published Aug 17, 2022, 2:27 PM IST
Highlights

BWF World championship 2022: ఈనెల 21 నుంచి 28 వరకు జపాన్  రాజధాని టోక్యో వేదికగా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్సిప్ పోటీలు జరుగనున్నాయి. మరి ఈ మెగా టోర్నీలో భారత ప్రదర్శన ఎలా ఉంది..? 

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎప్)  ఆధ్వర్యంలో జరుగనున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం బ్యాడ్మింటన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పతకాలతో పాటు  వ్యక్తిగత ర్యాంకులను మెరుగుపరుచుకునేందుకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది.  క్రికెట్ లో ఐసీసీ ట్రోఫీల మాదిరిగా బ్యాడ్మింటన్ లో ఇది కూడా ప్రతిష్టాత్మక టోర్నీయే. ఒలింపిక్స్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ తర్వాత  వరల్డ్ చాంపియన్షిప్స్ కు అంతటి పేరుంది. 

1977లో మొదటిసారిగా బీడబ్ల్యూఎప్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ప్రారంభమైనప్పుడు ఇవి మూడేండ్లకోమారు జరిగేవి. కానీ 1983 తర్వాత వీటిని రెండేండ్లకోసారి నిర్వహించారు. ఇక 2005 నుంచి ఈ పోటీలను ఒలింపిక్ క్రీడలు జరిగే ఏడాది తప్ప ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు.  

2020లో  కరోనా కారణంగా వీటిని వాయిదా వేశారు.  కానీ 2021లో ఒలింపిక్స్ తో పాటు వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఒకే ఏడాది జరగడం గమనార్హం. మరి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ ఎన్ని పతకాలు గెలిచింది..? మన షట్లర్ల ప్రదర్శన ఎలా ఉంది..? అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

తొలి పతకం పదుకునేది.. 

ఈ పోటీలు 1977లో ప్రారంభమైనా.. భారత్ కు తొలి పతకం దక్కింది. 1983లో.  ప్రస్తుత బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే తండ్రి ప్రకాశ్ పదుకునే..  1983లో పురుషుల సింగిల్స్ లో తొలి పతకం (కాంస్యం) నెగ్గాడు. ఇండోనేషియాకు చెందిన సుగియార్టోను ఓడించి కాంస్యం నెగ్గిన పదుకునే ఈ క్రీడలలో భారత్ కు తొలి పతకం అందించాడు.  

ప్రకాశ్ పదుకునే  పతకం తర్వాత 28 ఏండ్ల దాకా  భారత్ కు ఈ క్రీడలలో పతకం రాలేదు. 2011లో  జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్పలు  ఉమెన్స్ డబుల్స్ లో  కాంస్యం గెలిచారు.  

స్వర్ణ సింధు.. 

2011 తర్వాత 2013లో పివి సింధు.. 18 ఏండ్ల వయసులో ఈ పోటీలలో తొలి పతకం అందించింది. ఉమెన్స్ సింగిల్స్ లో  సింధు.. 2013, 2014లో కాంస్యాలు గెలిచింది.  2017, 2018లో రజతం నెగ్గిన సింధు..  2019లో స్వర్ణ పతకం గెలిచి భారత్ తరఫున ఈ క్రీడలలో స్వర్ణం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా  అరుదైన ఘనత సాధించింది. ఒక స్వర్ణం... రెండు రజతాలు, రెండు కాంస్యాలతో మొత్తంగా ఆమె బీడబ్ల్యూఎఫ్ లో ఐదు పతకాలు నెగ్గింది.

సైనాకు రెండు.. 

మరో హైదరాబాదీ   సైనా నెహ్వాల్ కూడా  ఈ పోటీలలో రెండు పతకాలు నెగ్గింది. 2015లో ఉమెన్స్ సింగిల్స్ లో రజతం నెగ్గిన ఆమె.. 2017లో కాంస్యం గెలిచింది.  

36 ఏండ్ల తర్వాత  పురుషుల సింగిల్స్ లో పతకం.. 

1983లో ప్రకాశ్ పదుకునే పురుషుల సింగిల్స్ లో కాంస్యం గెలిచిన తర్వాత 2019వరకు భారత్ కు వచ్చిన పతకాలన్నీ మహిళా షట్లర్లు సాధించినవే. 36 ఏండ్ల తర్వాత సాయి ప్రణీత్.. 2019లో పురుషుల సింగిల్స్ లో కాంస్యం గెలిచాడు. అతడి తర్వాత కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ లు గతేడాది వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో పతకాలు సాధించారు. శ్రీకాంత్ రజతం నెగ్గగా.. లక్ష్య సేన్ కాంస్యం గెలుచుకున్నాడు. 

click me!