అవసరం ఏదైనా... నేనున్నానంటూ వాలిపోతూ ప్రాణాలు కాపాడుతున్న వరుణ్

By team teluguFirst Published May 14, 2021, 9:54 PM IST
Highlights

కరోనా మహమ్మారి కబళిస్తున్న వేళ... ప్రజల అవసరం ఏదైనా హాస్పిటల్ బెడ్ నుండి ఆక్సిజన్ వరకు వారికి అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నాడు వరుణ్.

భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ ప్రభుత్వాలు సైతం ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. ప్రజలు ఆక్సిజన్ దొరక్క, ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేక, ఉన్నా ఎక్కడున్నాయో తెలియక, మందుల కోసం, ప్లాస్మా కోసం నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్లాట్ ఫారంలు వారి పాలిటి కొంగుబంగారంగా మారాయి. ఎందరో యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రాత్రనకా పగలనకా ప్రజలకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా నిస్వార్థంగా సేవలందిస్తున్న యువతను గుర్తించి వారిని మీకు పరిచయం చేయడం కోసం నేటి నుండి రోజు వారీగా ఈ ఒక్కో హీరో/ షీరోలను మీ ముందుకు తీసుకువస్తున్నాము. 

సమయం ఉదయం దాదాపుగా 9 అవుతుంది. ఒక 35 సంవత్సరాల యువకుడు పడిపోతున్న ఆక్సిజన్ లెవెల్స్ తో ఒక ఆసుపత్రి బయట ఐసీయూ బెడ్ కోసం వేచి ఉన్నాడు. ఏ ఆసుపత్రిలోనూ బెడ్స్ ఖాళీ లేకపోవడంతో తిరిగి తిరిగి అలసిపోయిన అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు నిస్సహాయంగా రోడ్డుపై రోదిస్తున్నారు. పరిస్థితి తెలుసుకొని అక్కడకు చేరుకున్న ఒక యువకుడు ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి, తనకున్న పరిచయాలతో పోలీస్ కమీషనర్ ని కూడా రిక్వెస్ట్ చేసి అత్యవసరంగా ఒక ఐసీయూ బెడ్ ని ఇప్పించి ఆ రోగికి ఏమీ కాదు అని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వెంటనే వచ్చిన మరో కాల్ కి రెస్పాండ్ అవుతూ అక్కడినుండి వెళ్ళిపోయాడు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడ్డ నాటి నుండి ప్రజలకు ఇలా నిస్వార్థంగా సేవ చేస్తూనే ఉన్నాడు. 

అతనే వరుణ్. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ 30 సంవత్సరాల యువకుడు ఒక పెద్ద ఫార్మా కంపెనీలో నేషనల్ డిజిటల్ సేల్స్ టీం ని లీడ్ చేస్తున్నాడు. తన ప్రొఫెషనల్ వర్క్ లో భాగంగా డాక్టర్లు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, ఆసుపత్రి యాజమాన్యాలతో ఏర్పడ్డ పరిచయాలను ప్రజల అవసరం కోసం వాడుతూ వారికి సహాయపడుతున్నాడు. ఇతని నిస్వార్థమైన ఇంటెన్షన్ ని గుర్తించిన డాక్టర్లు సైతం వరుణ్ సహాయం చేయడం మొదలుపెట్టారు. 

ప్రజలు ఆక్సిజన్ కోసం, మందులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వారు ఏ ఊరిలో ఉన్నా సరే తన కాంటాక్ట్స్ నెట్వర్క్ తో వారికి అవసరమైన మందులను వారికి అందిస్తున్నాడు. ఏ ఊరిలో ఉన్నవారైనా సరే తమకు ఈ మందులు కావాలి అని చెబితే మూడు నుండి నాలుగు గంటల సమయంలో వారి వద్దకే మందులను పంపే ఏర్పాట్లు చేస్తున్నాడు. 

తొలుత వాట్సాప్ ద్వారా తనను కాంటాక్ట్ అయ్యే వారికి మాత్రం సహాయం చేసిన ఈ యువకుడు సోషల్ మీడియా ద్వారా అయితే ఎక్కువమందికి సహాయం అందించొచ్చని ట్విట్టర్ వేదికగా తన కార్యక్రమాలను విస్తృతపరిచాడు. అప్పటివరకు పదుల సంఖ్యలో వచ్చిన రిక్వెస్ట్లు వందల సంఖ్యలో రావడం మొదలయ్యాయి.

రోజువారీగా అన్నింటిని సాల్వ్ చేస్తున్నాడు. పేషెంట్ కి బెడ్ ఇప్పించి ఊరుకోవడం కాకుండా అత్యంత అవసరమైన ధైర్యాన్ని ఇటు రోగికి, అటు వారి కుటుంబ సభ్యులకు ఇస్తూ... ఇప్పుడు ఎందరో కుటుంబాల్లో సొంతమనిషిలా మారిపోయాడు. 

తన సొంతఊరు చిత్తూరులో సైతం ఆసుపత్రిలోని పేషెంట్స్ కి, అక్కడి సిబ్బందికి వాటర్ బాటిల్స్, పండ్లు ఇస్తూ కూడా సహాయపడుతున్నాడు. ప్రభుత్వాసుపత్రిలో అవసరమైన పల్స్ ఆక్సీమీటర్స్, ఆక్సిజన్ మాస్కులను సైతం ఏర్పాటు చేసాడు. ఆసుపత్రులపై అదనపు భారం పడుతున్న విషయాన్ని గుర్తించిన ఈ యువకుడు డాక్టర్లు రాసిచ్చిన కోవిడ్ కిట్లను ఎవరైనా కొనలేని పరిస్థితుల్లో ఉంటే... వారికి ఉచితంగా అందిస్తున్నాడు. 

కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న సమయంలో వలసకూలీలను గుర్తించి వారికి లాక్ డౌన్ కాలమంతా భోజనం ఏర్పాటు చేసాడు. ఆ సమయంలో చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా కొందరికి తనవంతు సహాయం చేసాడు. ఈ యువకుడి సేవా తత్పరతను గుర్తించిన సోనూసూద్ ఇతగాడిని తన ఫౌండేషన్ లోకి ఆహ్వానించాడు. ఇప్పుడు సోనూసూద్ ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తున్నాడు. ఫౌండేషన్ ద్వారా కొందరి పేషెంట్స్ కి రెమిడిసివిర్ ఇంజెక్షన్లను కూడా ఉచితంగా అందించాడు. 

గత ఏడాది మీకు గుర్తుండి ఉంటే... మదనపల్లి సమీపంలో సోనూసూద్ ఒక కుటుంబ కష్టాన్ని చూసి ట్రాక్టర్ అందించాడు. ఆ ట్రాక్టర్ ని డెలివరీ ఇచ్చింది కూడా ఈ యువకుడే. కోవిడ్ బారినపడ్డప్పటికీ... కోలుకున్న తెల్లారే రంగంలోకి దిగి ప్రజలకు తన వంతు సహాయాన్ని అందించడం మొదలుపెట్టాడు.

రోజూ కళ్లు చెమ్మగిల్లకుండా పడుకున్న సందర్భాలు లేవని గుర్తుచేసుకుంటూనే.... ఆ పరిస్థితులు గనుక తనను కృంగదీస్తే తదుపరి రోజు వేరే వాళ్లకు సహాయం చేయలేనని ఆ దుఃఖాన్ని దిగమింగి తదుపరి కార్యక్రమాలను మొదలుపెడుతున్నాడు. కులం, మతం, ప్రాంతం అనే వివిధ ఆడ్డుగోడలను అన్నిటిని చెరిపేసి ప్రజలంతా ఏకమవ్వాల్సిన సమయం ఇది అంటున్న ఈ యువకుడు నిజంగా మనందరికీ స్ఫూర్తిదాయకం.  

click me!