ఇది పక్కా: స్టార్టప్స్ హబ్‌గా భారత్.. తేల్చి చెప్పిన నాస్కామ్.. కానీ

By sivanagaprasad kodatiFirst Published Oct 26, 2018, 9:37 AM IST
Highlights

స్టార్టప్ ల కేంద్రంగా భారత్ అవతరించేందుకు అపారమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని నాస్కామ్ అంచనా వేసింది. అయితే ఆ స్టార్టప్ లు ఎంత త్వరగా ఒక పరిశ్రమగా రూపాంతరం చెందుతాయన్నదే ప్రధాన సవాల్ అని నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్ జానీ ఘోష్ స్పష్టం చేశారు.
 

అంతర్జాతీయంగా స్టార్టప్‌ల కేంద్రంగా భారత్ ఎదిగేందుకు బోలెడు అవకాశాలు ఉన్నాయని నాస్కామ్ అంచనా వేసింది.సదరు స్టార్టప్ ఎంత త్వరితంగా ఒక కంపెనీ పరివర్తన చెందుతుందన్నది ఒక సవాల్‌ అని నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్‌జానీ ఘోస్ పేర్కొన్నారు. 

దేశంలో స్టార్టప్‌ కంపెనీలకు నిధుల కల్పనలో 2017-18లో 108 శాతం వృద్ధి సాధించినట్లు నాస్కామ్‌ నివేదిక తెలిపింది. 2016-17లో స్టార్ట్‌ప్‌లకు రూ.14 వేల కోట్ల (200 కోట్ల డాలర్లు) నిధులు అందితే ఈ ఏడాది ఇప్పటికే రూ.29,400 కోట్లు (420 కోట్ల డాలర్లు) నిధులు అందినట్టు నాస్కామ్‌ అధ్యక్షురాలు దేబ్‌జానీ ఘోష్‌ పేర్కొన్నారు.

మొత్తం మీద స్టార్ట్‌పలకు నిధుల పరిమాణం పెరిగినా ప్రారంభ దశలోని కంపెనీలకు నిధులు తగ్గడం ఆందోళనకరమైన అంశమని ఆమె అన్నారు. 2018లో దేశంలో 1200 స్టార్ట్‌ప్‌లు ప్రారంభమయ్యాయని, వాటితో కలిపి ఆ సంఖ్య 7200కి చేరిందని నాస్కామ్‌ అధ్యక్షురాలు దేబ్‌జానీ ఘోష్‌ తెలిపారు.

కాని ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు అందిన నిధులు 19.1 కోట్ల డాలర్ల నుంచి 15.1 కోట్ల డాలర్లకు తగ్గాయని ఆమె చెప్పారు. 2016-17లో స్టార్టప్‌ విభాగంలో కొంత మందగమనం ఏర్పడినప్పటికీ తర్వాతి సంవత్సరంలో తిరిగి వేగం అందుకున్నదని, ఆ కంపెనీలు 40 వేల కొత్త ఉద్యోగాలు కల్పించాయని నాస్కామ్ నివేదిక వివరించింది.

ఈ కొత్త ఉద్యోగాలకల్పనతో దేశంలోని స్టార్టప్‌ కంపెనీల్లో ఉద్యోగాల సంఖ్య 1.7 లక్షలకు చేరిందని పేర్కొన్నది. 2017లో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సూచీలో భారత్‌ 60వ స్థానం నుంచి 57వ స్థానానికి ఎదిగినట్టు పేర్కొంది. 

ప్రధానంగా బి, సి, డి, ఇ, ఎఫ్‌ శ్రేణిలోకి వచ్చే స్టార్టప్‌లకు 250 శాతం  నిధులు పెరిగినట్టు నాస్కామ్ తెలిపింది. భారత స్టార్టప్‌ వ్యవస్థపై ఇన్వెస్టర్ల విశ్వాసం ఇనుమడించిందనేందుకు ఇది సంకేతమని పేర్కొన్నది.

ప్రధానంగా కృత్రిమ మేధస్సు, అనలిటిక్స్‌, ఏఆర్‌/వీఆర్‌, బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ‌, ఐఓటి వంటి విభాగాల్లో కొత్త సొల్యూషన్లు అందుబాటులోకి తేవడానికి స్టార్టప్‌లు అపారమైన కృషి చేసినట్టు తెలిపింది. 

ప్రధానంగా ఇంటర్నెట్‌ విస్తరణ, డిజిటల్‌ లావాదేవీలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడం ఈ విభాగానికి చక్కని ఆలంబన అయిందని నాస్కామ్ నివేదిక తెలిపింది. 2018లో పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలోని 8 స్టార్టప్‌లు ఏర్పాటైనట్టు నాస్కామ్ పేర్కొంది.

గత రెండేళ్లలో ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌, కెనడా, జపాన్‌, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, ఆస్ర్టేలియా, ఎస్తోనియా, జర్మనీ, రష్యా వంటి దేశాలు భారతదేశంతో సహకారం విస్తరించుకోవడం వల్ల భిన్న భౌగోళిక ప్రదేశాలకు భారత స్టార్టప్‌లు విస్తరించినట్టు కూడా ఆ నివేదికలో నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్ జానీ ఘోష్ తెలిపారు.
 

click me!