దేశీయ స్టాక్ మార్కెట్లు 2019 చివరి రోజు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 304, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 87 పాయింట్ల పతనమయ్యాయి. అయితే ఒడిదొడుకుల మాటెలా ఉన్నా నిత్యం స్టాక్ మార్కెట్లు రికార్డులు నెలకొల్పడంతో మదుపర్లకు రూ.11 లక్షల కోట్ల సంపద ఒనగూడింది.
ముంబై: 2019లో స్టాక్ మార్కెట్లలో లాభాల జడివానలో మదుపర్లు తడిసి ముద్దయ్యారు. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరుల సంపద లక్షల కోట్ల స్థాయిలో ఎగబాకింది. 2019లో సెన్సెక్స్ 14 శాతం లాభపడటంతో మదుపరుల సంపద ఏకంగా రూ.11 లక్షల కోట్ల మేర పెరిగింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థల విలువ రూ.11,05,363.35 కోట్లు పెరిగి రూ. 1,55,53,829.04 కోట్లకు చేరుకున్నది.
2019లో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధమేఘాలు, అంతర్జాతీయ మార్కె ట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నా ఈక్విటీ మార్కెట్లు భారీగా లాభపడ్డాయని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
undefined
ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధిరేటుకు మళ్లీ ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు మార్కెట్లు వేగవంతంగా కోలు కున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు.
అయితే ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలే మిగిల్చాయి. ఈ ఏడాది తొలి రోజు లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరకు నష్టాలతో వీడ్కోలు పలికాయి. కానీ దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో 2019 ఏడాది సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నది.
తీవ్ర ఆటుపోటుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు పడిలేచిన కెరటంలాగా అంతే వేగంతో దూసుకుపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవడం, సౌదీ చమురు బావులపై డ్రోన్లతో దాడులు జరిగినామార్కెట్ల వేగం ఏ మాత్రం తగ్గలేదు. నేలకు కొట్టిన బంతిలా దూసుకుపోయింది.
2019 చివరి రోజు మంగళవారం బ్లూచిప్ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం, అంతర్జాతీయ మార్కెట్లో నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. ఇంట్రాడేలో 423 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 304.26 పాయింట్లు పతనమై 41,253.74 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 87.40 పాయింట్లు క్షీణించి 12,168. 45 వద్ద స్థిరపడింది.
2019 జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సెక్స్ 5,185.41 పాయింట్లు లేదా 14.37 శాతం లాభపడగా, అదే నిఫ్టీ 1,305.90 పాయింట్లు లేదా 12.02 శాతం చొప్పున పెరిగాయి. అభివృద్ధి చెందిన దేశాల స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురైనా దేశీయ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకుపోయాయని, వరుసగా రెండేండ్లలో నిఫ్టీ-50 అత్యధిక రిటర్నులను పంచిందని మార్కెట్ పండింతలు వెల్లడించారు.
2019 లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు 14.3 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఆకట్టుకోగా, 7.5 బిలియన్ డాలర్లు మ్యూచువల్ ఫండ్ల నుంచి వచ్చాయి. చివరి రోజు టెక్ మహీంద్రా షేర్ 2.51 శాతం పతనమై టాప్ లూజర్‌గా నిలిచింది.
వీటితోపాటు బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి.
రంగాలవారీగా ఇంధనం, టెలికం, ఆటో, టెక్, ఐటీ, ఫైనాన్స్ రంగ షేర్లు ఒక్క శాతానికి పైగా నష్టపోగా.. విద్యుత్, రియల్టీ, మెటల్ షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు రెండంకెలకు పైగా లాభపడ్డాయి.
కానీ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఈ ఏడాదిలో సెన్సెక్స్ తొలిసారిగా 40 వేలు దాటి 42 వేల పాయింట్ల దిశగా ప్రయాణించగా, నిఫ్టీ 12 వేల కీలక మైలురాయిని అధిగమించింది.