మార్చికల్లా ఐపీవోకు ‘ఎస్బీఐ’ కార్డ్.. స్థిర వడ్డీరేట్‌పై ఇంటి రుణాలు

By narsimha lodeFirst Published Sep 16, 2019, 11:33 AM IST
Highlights

తమ కార్డ్స్‌ వ్యాపారంపై ఇన్వెస్టర్లకు అమితాసక్తి ఉందని, ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీఓ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్‌ కుమార్‌ చెప్పారు.

లేహ్‌: కాగా తమ కార్డ్స్‌ వ్యాపారంపై ఇన్వెస్టర్లకు అమితాసక్తి ఉందని, ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీఓ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. ఇందులో ఎస్‌బీఐకి 74 శాతం వాటా ఉంది. కంపెనీలో వాటా ఉన్న విదేశీ భాగస్వామి ఐపీఓ ద్వారా తన వాటాను విక్రయించుకునే అవకాశం ఉందన్నారు. 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన అనుబంధ సంస్థ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ప్రణాళికను ఉపసంహరించుకుంది. అదనంగా మూలధన అవసరం లేనందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఐపీఓను మార్కెట్లోకి తేవాలని బ్యాంకు భావించింది. 

ఎస్‌బీఐ జనరల్‌ విలువ రూ.12,000 కోట్ల వరకు ఉంటుందని ఇటీవల లెక్కగట్టారు. ఇన్సూరెన్స్‌ ఆస్ర్టేలియా గ్రూప్‌తో కలిసి ఎస్‌బీఐ ఈ కంపెనీని ఏర్పాటు చేసింది. ఎస్‌బీఐ లైఫ్‌లో వాటాల విక్రయం గురించి మాట్లాడుతూ.. సెబీ నిబంధనల ప్రకారం.. మరో 2 శాతం వాటాను విక్రయించాల్సి ఉందని దీనికి వచ్చే ఏడాది వరకు సమయం ఉందని చెప్పారు.

స్థిర రేటుపై గృహ రుణాలను తేవాలని ఎస్బీఐ భావిస్తోంది. ఇవి స్థిర రేటు (ఫిక్స్‌డ్‌) నుంచి అస్థిర రేటు (ఫ్లోటింగ్‌)కు మారే గృహ రుణాలు. అంటే ప్రారంభం నుంచి నిర్ణీత కాలం వరకు (సుమారు ఐదు పదేళ్లు) ఒకటే వడ్డీ రేటు కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా గృహ రుణంపై రేటు మారుతుంటుంది. 

ఈ విధమైన గృహ రుణాలను ఆఫర్‌ చేయవచ్చా? అన్న దానిపై ఆర్‌బీఐ నుంచి స్పష్టత కోరినట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. అన్ని రకాల రిటైల్‌ రుణాలను ఫ్లోటింగ్‌ రేటు ఆధారంగానే అందించాలని, రుణాలపై రేట్లు రెపో వంటి ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లఆధారంగానే ఉండాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించిన విషయం గమనార్హం. 

ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాల విడుదల అనంతరం ఫ్లోటింగ్‌ రేటు రుణాల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై స్పష్టత లేదని రజనీష్‌ కుమార్ అన్నారు‌.  

కొంత మంది కస్టమర్లు గృహ రుణాలపై రేట్లు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అటువంటి వారి కోసం ఫిక్స్‌డ్‌–ఫ్లోటింగ్‌ రేటు ఉత్పత్తులను అందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. వీటిల్లో ఐదు లేదా పదేళ్ల వరకు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందన్నారు. కొంత కాలం తర్వాత ఫ్లోటింగ్‌ రేటుకు మార్చడం... భవిష్యత్ పరిస్థితులను బ్యాంకు అంచనా వేయలేకపోవడం వల్లనేనని రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. 


సాధారణంగా గృహ రుణాల కాల వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటాయన్న విషయాన్ని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ గుర్తు చేశారు. ఆస్తుల నిర్వహణ బాధ్యతల విషయంలో 30 ఏళ్ల కాలానికి స్థిర రేటు ఉత్పత్తిని ఆఫర్‌ చేయడం కష్టమని వివరించారు.


 ఎస్‌బీఐ గరిష్టంగా 30 ఏళ్ల కాలానికే గృహ రుణాలను అందిస్తోంది. ప్రస్తుతానికి ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత ఫ్లోటింగ్‌ రేటు గృహ రుణాలను ఆఫర్‌ చేస్తోంది. రెపో రేటు ఆధారిత ఫ్లోటింగ్‌ రుణాలపై రేట్లు తరచుగా మారే పరిస్థితులు ఉంటుంటాయి. ఆర్‌బీఐ రేపో రేటును సవరించినప్పుడల్లా బ్యాంకులు కూడా ఆ మేరకు మార్పులు చేయాల్సి వస్తుంది.    

click me!