నోట్ల రద్దు ప్లస్ జీఎస్టీలే వృద్ధిరేటుకు గుదిబండ: రఘురాం రాజన్ ఆందోళన

By sivanagaprasad kodatiFirst Published Nov 11, 2018, 12:25 PM IST
Highlights

నోట్లరద్దు, ఆ పై జీఎస్టీ అమలు చేయడంతో దేశ ఆర్థిక వృద్ధిరేటు మందగించడానికి ప్రధాన కారణాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు తాజాగా పెరిగిన ముడి చమురు ధరలు మరో సమస్యగా పరిణమించాయన్నారు. 

రెండేళ్ల క్రితం నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేసిన నోట్ల రద్దు, గతేడాది జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ విధానం వల్లే 2017- 18 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి తిరోగమన బాట పట్టిందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత 7 శాతం వృద్ధి రేటు దేశ అవసరాలను తీర్చలేదని స్పష్టం చేశారు.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు రూపంలో ఎదురు దెబ్బలు తగలకముందు నాలుగేళ్ల పాటు అంటే 2012 నుంచి 2016 వరకు భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందుతూ వచ్చిందన్నారు. కానీ ఆ రెండు నిర్ణయాలు వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపాయని రఘురాం రాజన్ స్పష్టం చేశారు. 

అవసరాలకు వృద్ధిరేటు సుదూరం
25 ఏళ్లపాటు యేటా 7 శాతం చొప్పున వృద్ధి అంటే మంచిదేననని, కానీ, నెలకు పది లక్షల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో వారందరికీ అవకాశాలు కల్పించాలంటే ఆ వృద్ధి రేటు సరిపోదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్‌ అత్యంత స్వేచ్ఛాయుత విపణుల్లో ఒకటి. ప్రపంచ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా భారత్‌ వృద్ధి గమనం సాగుతోంది. కానీ పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా గత ఏడాది భారత్‌ జీడీపీ వృద్ధి ఇందుకు భిన్నంగా పయనించిందన్నారు.

జీఎస్టీ, నోట్ల రద్దుతోపాటు ముడి చమురు ధరలతో ఇలా 
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రభావాల నుంచి బయటపడి మళ్లీ పుంజుకుంటున్న వృద్ధికి భారీగా పెరిగిన ముడి చమురు ధరలు ప్రధాన సమస్యగా మారాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎందుకంటే, భారత్‌ ఇంధన అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండటం దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనని తెలిపారు.
 
మొండి బాకీల కట్టడికి బహుముఖ వ్యూహం
ప్రస్తుత పరిస్థితుల్లో మొండి బకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారానికి బ్యాంకుల ఆస్తి, అప్పుల పట్టిక నుంచి వాటిని తుడిచి పెట్టేయడమే ఉత్తమ మార్గమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ పేర్కొన్నారు.

అప్పుడే బ్యాంకులను తిరిగి గాడిలో పెట్టగలమన్నారు.‘మొండి బాకీలపై చర్యలు చేపట్టేందుకు భారత్‌కు చాలా సమయం పట్టింది. సమస్యను ఎదుర్కొనేందుకు అవసరమైన చట్టాలు లేకపోవడమే అందుకు కారణం.

ఎన్‌పీఏల పరిష్కారానికి కొత్తగా ప్రవేశపెట్టిన దివాలా స్మృతి చట్టం (ఐబీసీ) ఒక్కటే మార్గం కారాదు. పెద్ద మొత్తంలో బకాయిలను పరిష్కరించేందుకు మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఈ సమస్యను మొత్తంగా ఎదుర్కొనేందుకు బహుముఖ విధానం అవసరం’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
 
దేశ ఆర్థిక వ్యవస్థకు మూడు ప్రధాన అవరోధాలిలా..
ప్రస్తుతం దేశం మూడు ప్రధాన అవరోధాలను ఎదుర్కొంటోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ అన్నారు. వాటిల్లో మౌలిక వసతుల లేమి, విద్యుత్‌ ఉత్పత్తి రంగ సంక్షోభం, మొండి బకాయిలు ఉన్నాయి. ఈ మూడు అవరోధాలను అధిగమించగలిగితేనే మరింత వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
 
అధికార కేంద్రీకరణ మరో సమస్య 
భారత్‌లో మితిమీరిన అధికార కేంద్రీకృతం మరో సమస్య అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ అన్నారు. ‘‘ఒకే కేంద్రం నుంచి పాలించడం భారత్‌కు సరిపోదు. అధికార వికేంద్రీకరణ జరగాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అధికార కేంద్రీకృతం మితిమీరిన స్థాయిలో ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రతీ నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కార్యాలయం కనుసన్నల్లోనే జరుగుతోందని, పీఎంవో అనుమతి లేనిదే ఎవరూ కూడా నిర్ణయం తీసుకునే సాహసం చేయలేకపోతున్నారని రాజన్‌ అన్నారు. అధికార కేంద్రీకృతానికి తోడు అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నారని ఆయన అన్నారు.

ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అధికారులు వ్యాపారపరమైన నిర్ణయాల్లో చొరవ తీసుకోలేకపోతున్నారని అన్నారు. వరుసగా అవినీతి కుంభకోణాలు వెలుగు చూసినప్పటి నుంచి అధికారులు నిర్ణయాల్లో వెనకడుగు వేస్తున్నారని రాజన్‌ పేర్కొన్నారు.

click me!