బెంగళూరులో మహీంద్రా ‘ఈ-టెక్’ హబ్: ‘ఈవీ’ల కోసం రూ.900 కోట్లు

By Siva KodatiFirst Published Mar 4, 2019, 11:01 AM IST
Highlights

దేశీయ ఆటోమొబైల్ మేజర్ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం&ఎం).. విద్యుత్‌ వాహనాల తయారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రూ.900 కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించింది.

దేశీయ ఆటోమొబైల్ మేజర్ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం&ఎం).. విద్యుత్‌ వాహనాల తయారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రూ.900 కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించింది.

విద్యుత్‌ వాహనాల తయారీ ప్రక్రియను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్‌-2 పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించడం ఇందుకు నేపథ్యమని మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్ ఎం) మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా పేర్కొన్నారు.

మహీంద్రా పరిశోధనాభివ్రుద్ది కేంద్రానికి రూ.350 కోట్లు
ప్రస్తుతం విద్యుత్‌ కార్ల విభాగంలో కంపెనీ ఈ2ఓ ప్లస్‌, ఈ-వెరిటో మోడల్ కార్లను విక్రయిస్తోంది. బెంగళూరులో రూ.100 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ టెక్నాలజీ తయారీ హబ్‌ను సైతం ఏర్పాటు చేసింది. విద్యుత్‌ వాహనాల అభివృద్ధికి చకన్‌ ప్లాంట్‌పై రూ.450 కోట్లు, బెంగళూరులోని పరిశోధనా అభివృద్ధి కేంద్రంపై మరో రూ.350 కోట్లు పెట్టుబడులు పెడుతోంది.

చకన్ ప్లాంట్ విస్తరణకు మహీంద్రా ప్రణాళిలకు
దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాలపై మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మొత్తం పెట్టుబడులు రూ.900 కోట్లకు చేరతాయి. పుణెలోని చకన్‌లో ప్లాంట్‌ విస్తరణకు పెట్టుబడులను పెంచుతామని గోయెంకా తెలిపారు.

స్థానికంగా ఉత్పత్తి పెంచడం ద్వారా తయారీ పెరుగుతుందని, విద్యుత్‌ వాహనాల రూపంలో భారత్‌లో తయారీ జోరందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మహీంద్రాలో సిద్ధంగా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవే
విద్యుత్‌ కార్లలో వినియోగించే మోటార్‌లో అధిక భాగాలను స్థానికంగా తయారు చేయడానికి కంపెనీ చూస్తోందని వెల్లడించారు. 2018 వాహనాల ప్రదర్శనలో ఆరు విద్యుత్‌ నమూనా కార్లను కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఇందులో ఇ-కేయూవీ 100, రెండు సీట్ల ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాడ్‌ ‘ఆటమ్‌’, త్రిచక్ర వాహనం ట్రెయో, విద్యుత్‌ బస్సు ఈ-కాస్మో, ఈ2ఓ ఎన్‌ఎక్స్‌టీ, ఈ-సుప్రో, ఈ-ఆల్ఫా  ఉన్నాయి.

విద్యుత్‌ వాహనాల వినియోగంలో ఈ-రిక్షాలు కీలకం: డెలాయిట్‌ నివేదిక
దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెంచడంలో ఎలక్ర్టిక్‌ త్రీవీలర్లు కీలక పాత్ర పోషించనున్నట్టు డెలాయిట్‌ తాజా నివేదిక చెబుతోంది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో మొదటి, చివరి గమ్యస్థానాలను అనుసంధానం చేయడంలో ఈ వాహనాల అవసరం అసమానమైనదని పేర్కొంది. 

‘ఈవీ’ల అనుసంధానంలో కేంద్రానిదే కీలక పాత్ర
దేశంలో విద్యుత్‌ వాహనాలు విజయవంతం అయ్యేందుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పరచడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించనుందని తెలిపింది. సబ్సిడీలు, అభివృద్ధి విధాన మద్దతు ద్వారా ప్రభుత్వం అనుసంధానకర్తగా వ్యవహరించనుందని పేర్కొంది.

ఇక పట్టణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ కేవలం ప్రధాన మార్గాల్లోనే అందుబాటులో ఉంటుందని, మొదటి, చివరి గమ్యస్థానాలకు తగిన విధంగా రవాణా సదుపాయాలు ఉండవచ్చని నివేదిక వివరించింది.

‘ఎలక్ట్రిక్ ఆటో’ రిక్షాలే ప్రత్యామ్నాయమన్న డెల్లాయిట్
ఎలక్ర్టిక్‌ ఆటో రిక్షాలువంటివి ప్రత్యామ్నాయ పరిష్కారంగా ఉంటాయని పేర్కొన్నది. ఈ-రిక్షాలు విజయవంతం కావాలంటే ప్రభుత్వం, వాహన, బ్యాటరీల తయారీదారులు, ప్రైవేటు ఆపరేటర్లు అందరూ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంటుందని తెలిపింది. ఈ వాహనాల కొనుగోళ్లు, వినియోగం, పర్యవేక్షణ, నియంత్రణ వంటివి ప్రభావవంతంగా ఉండేలా వ్యాపార నమూనాలు ఉండాలని పేర్కొంది. 

ఇలా చేస్తేనే విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుదల
కొనుగోళ్లపై పర్యవేక్షణ, నియంత్రణ కొనసాగిస్తే నగరాల్లో విద్యుత్‌ వాహనాల వినియోగం పెరిగేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. విద్యుత్‌ వాహనాల వినియోగం పెరగడంతోపాటు నియంత్రణా విధానం అమలు, బ్యాటరీల వ్యయం తగ్గడంలో, చార్జింగ్‌ మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వ మద్దతు అవసరం ఉంటుందని పేర్కొంది.
 

click me!