ప్రభుత్వ బ్యాంకులకు కష్టాలొచ్చాయి‌.. రికవరీ కావాలంటే కొన్నేళ్లు..

By Sandra Ashok KumarFirst Published Jul 1, 2020, 11:59 AM IST
Highlights

కరోనా మహమ్మరితో దేశీయ ప్రభుత్వ బ్యాంకులకు కష్టాలొచ్చాయి. ఇప్పటికే రుణాలు వసూలు కాక సతమతం అవుతున్న బ్యాంకులకు కరోనా వల్ల మొండి బాకీలు 2020-21లో 14 శాతానికి చేరవచ్చునని, కరోనాతో బ్యాంకింగ్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని, వాటి రికవరీకి కొన్నేళ్లు పడుతుందని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఎస్‌ అండ్‌ పీ తెలిపింది. 
 

ముంబై: కరోనా సంక్షోభం కారణంగా దేశీయ బ్యాంకింగ్‌ రంగ పునరుద్ధరణకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది. కరోనాను నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్‌లో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం, ఆర్థిక మాంద్యం వంటి అంశాలు బ్యాంకింగ్‌పై తీవ్ర, దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయని తాజా నివేదికలో పేర్కొంది.

ఈ పరిణామం బ్యాంకుల రుణ వితరణకు అవరోధమని, తత్ఫలితంగా దేశ ఆర్థిక పురోగతిపై ప్రభావం పడనుందని ఎస్‌ అండ్‌ పీ అభిప్రాయపడింది. కరోనా దెబ్బకు బ్యాంకింగ్‌ రంగంలో స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) సరికొత్త ఆల్‌టైం గరిష్ఠానికి పెరగవచ్చునని పేర్కొన్నది.

2021 మార్చి నెలఖారుతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకుల మొండి బాకీలు 13-14 శాతానికి పెరగవచ్చని ఎస్ అండ్ పీ అంచనా వేసింది. 2018 మార్చి నాటికి 11.6 శాతం వద్ద ప్రస్తుత ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేసుకున్న స్థూల ఎన్‌పీఏలు.. గత ఆర్థిక సంవత్సరం (2019-20) ముగిసేసరికి 8.5 శాతానికి దిగివచ్చాయి.

మళ్లీ బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరిగిపోవడం వల్ల వాటిపై రుణ వ్యయాన్ని పెంచుతుందని ఎస్ అండ్ పీ స్పష్టం చేసింది. రేటింగ్‌పైనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. 

అనూహ్యంగా పెరగనున్న మొండిబకాయిల సమస్య పరిష్కారం మాత్రం నెమ్మదిగానే జరగనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో స్థూల మొండి బాకీలు తగ్గినా మహా అయితే ఒక శాతం వరకు తగ్గవచ్చునని ఎస్ అండ్ పీ వివరించింది. 

also read 
  
కరోనా సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమైన రంగాలకు రుణాల పునర్‌వ్యవస్థీకరణ అవకాశం కల్పించాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా బ్యాంకులు మొండి బకాయిల గుర్తింపును కొంతకాలం వాయిదా వేయగలవు. 

అంతే తప్ప, ఆర్బీఐ నిర్ణయం ఎన్పీఏల సమస్యకు పరిష్కారం కాని ఎస్ అండ్ పీ స్పష్టం చేసింది. గతంలోనూ బ్యాంకులు రుణాలను భారీ స్థాయిలో పునర్‌ వ్యవస్థీకరించాయని గుర్తు చేసింది.

దాంతో మొండి పద్దుల వాస్తవిక పరిస్థితిపై స్పష్టత కోసం ఆర్బీఐ మళ్లీ బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించాల్సి వచ్చిందని ఎస్ అండ్ పీ తెలిపింది. బ్యాంకులతో పోలిస్తే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్బీఎఫ్సీ)పై అధిక ప్రభావం పడనున్నది.

బలహీన వర్గాలకు రుణాలివ్వడం, టోకు ఫండింగ్‌పై ఎన్బీఎఫ్సీలు ఆధారపడాల్సి రావడం, ద్రవ్య సమస్యలు ఇందుకు కారణం కానున్నాయని ఎస్ అండ్ పీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)కు రూ.40,000 కోట్ల మేర మూలధన సాయం అవసరం పడవచ్చు. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దాని కంటే ఇది అధికం అని తెలిపింది.

click me!