ఏం లాభం: 8 నెలల ముందే ఐటీ ‘లెన్స్’లో నీరవ్‌ మోదీ

By rajesh yFirst Published Dec 4, 2018, 11:16 AM IST
Highlights


బోగస్ విక్రయాలు, చెల్లింపులు, షేర్ల విలువల పెంపు తదితర అంశాలతో అప్రమత్తమైన ఆదాయం పన్నుశాఖ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ.13,500 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై తనిఖీలు నిర్వహించింది. గతేడాది ప్రారంభంలోనే 45 చోట్ల తనిఖీలు చేపట్టి ఎనిమిది నెలల ముందే ఐటీ శాఖ నివేదిక తయారుచేసినా ఇతర దర్యాప్తు సంస్థలతో పంచుకోకపోవడంతోనే నీరవ్ మోదీ, చోక్సీ పారిపోయారన్న విమర్శలు ఉన్నాయి. 

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ)ని ముంచిన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ జరుపుతున్న బోగస్ లావాదేవీలను ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ముందే గుర్తించినట్లు తెలుస్తోంది. బోగస్‌ కొనుగోళ్లు, షేర్ల ధరలు పెంచడం, బంధువులకు అనుమానాస్పద రీతిలో చెల్లింపులు జరుపడం, మోసపూరిత రుణాలు వంటి వాటిపై కన్నేసిన ఐటీ శాఖ ఒక నివేదికను కూడా రూపొందించింది. ఈ కుంభకోణం వెలుగు చూడటానికి ఎనిమిది నెలల ముందే నివేదిక తయారైందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక కథనం ప్రచురించింది. 
 
కానీ ఇంత పెద్ద కుంభకోణాన్ని ముందే గుర్తించినా ఈ వివరాలను ఏ దర్యాప్తు సంస్థ (సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) తోనూ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆఫీస్ ఇండియా (ఎస్ఎఫ్ఐఓ) ఐటీ శాఖ పంచుకోలేదని తెలుస్తోంది. పదివేల పేజీలు ఉన్న నివేదికను దర్యాప్తు ఏజెన్సీలకు పంపి ఉంటే నీరవ్‌ మోదీ విదేశాలకు పారిపోకుండా పట్టుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచార మార్పిడికి సంబంధించిన ప్రొటోకాల్‌ అప్పుడు లేనందువల్లే ఐటీ శాఖ నివేదికను ఇతర ఏజెన్సీలతో పంచుకోలేదని పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు.

నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల ఆర్థిక లావాదేవీలపై గతేడాది జూన్ ఎనిమిదో తేదీనే నివేదిక రూపొందించింది. నీరవ్ మోదీ - మెహుల్ చోక్సీ జోడీ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత గత జూలై- ఆగస్టు నుంచి అన్ని రకాల దర్యాప్తు నివేదికలను ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)తో షేర్ చేసుకోవాలని ఐటీ శాఖ కోరినట్లు సమాచారం. సరైన టైంలో నివేదికలు పరస్పరం అందజేసుకోవాలని ఆ శాఖ కోరినట్లు సమాచారం. 

గత జనవరి ప్రారంభంలో కుంభకోణంపై బ్యాంకులో సందేహాలు బయటపడగానే విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మే, జూన్ నెలల్లో చార్జిషీట్లు దాఖలు చేశాయి. గతేడాది జనవరి 14వ తేదీనే నీరవ్ మోదీ సంస్థలు, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ ఆస్తులు, సంస్థల లావాదేవీలపై నిఘా పెట్టిన ఐటి శాఖ. 45 చోట్ల తనిఖీలు నిర్వహించింది. 

click me!