Cryptocurrency regulation: అమెరికా, చైనాతో సహా ప్రపంచ దేశాలలో క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ ఎలా ఉంది..?

By team teluguFirst Published Nov 25, 2021, 6:45 PM IST
Highlights

భారతదేశంలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను (cryptocurrencies) బ్యాన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. అయితే క్రిప్టో కరెన్సీ పైన వివిధ దేశాలు భిన్న ఆలోచనలతో ఉన్నాయి. కొన్ని దేశాలు వీటిపై పూర్తిగా నిషేధం విధంచగా, మరికొన్ని దేశాలు నిబంధనలతో పనిచేయడానికి అనుమతిస్తున్నాయి. 

భారతదేశంలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను (cryptocurrencies) బ్యాన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన ‘ది క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్‌‌ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021’(The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021) ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. కేంద్ర కేబినెట్ బుధవారం చర్చకు లిస్ట్‌ చేసిన మొత్తం 26 బిల్లుల్లో క్రిప్టో కరెన్సీ  బిల్లు కూడా ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జారీ చేసే అధికారిక డిజిటల్‌ కరెన్సీని రూపొందించడానికి సులభతరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. ఇది భారతదేశంలోని అన్ని ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కూడా కోరుతోంది. కానీ  క్రిప్టో కరెన్సీ టెక్నాలజీని ప్రమోట్ చేసేందుకు కొన్ని మినహాయింపులను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

గ్లోబల్ మార్కెట్‌లలో క్రిప్టో కరెన్సీల ధరలు పెద్దగా మారనప్పటికీ.. ఈ వార్తలు వెలువడిన తర్వాత లోకల్ ఎక్చేంజ్‌లో రాత్రికి రాత్రే క్రిప్టో కరెన్సీ ధరలు క్రాష్ అయ్యాయి. అయితే రాబోయే నిషేధం లేదా పరిమితులకు భయపడి క్రిప్టో హోల్డర్లు భయాందోళనలకు గురవుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. . ప్రస్తుతం భారతదేశంలో క్రిప్టోకరెన్సీలపై ఎటువంటి నియంత్రణ గానీ,  నిషేధం గానీ లేదనే సంగతి తెలిసిందే. అయితే వర్చువల్ కరెన్సీని నిర్వచించడం, నియంత్రించడంలో ప్రపంచ దేశాలు ఒక్కో రకంగా స్పందిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్స్ రోజురోజుకి పెరుగుతున్నారు. ఇందులో తక్కువ సమయంలో అధిక లాభం పొందవచ్చని మొగ్గు చూపేవారే ఎక్కువ. అయితే క్రిప్టో కరెన్సీ పైన వివిధ దేశాలు భిన్న ఆలోచనలతో ఉన్నాయి. కొన్ని దేశాలు వీటిపై పూర్తిగా నిషేధం విధంచగా, మరికొన్ని నిబంధనలతో పనిచేయడానికి అనుమతిస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో వర్చువల్ కరెన్సీని ట్రెండింగ్‌ను అనుమతిస్తున్నాయి. ఇలా ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది.  ఉదాహరణకు ఎల్-సాల్వేడార్ బిట్ కాయిన్‌ను చట్టబద్ద కరెన్సీగా గుర్తించింది. అదే సమయంలో చైనా నిషేధించింది. క్రిప్టో కరెన్సీలు, సర్వీస్ ప్రొవైడర్లపై ఉక్కుపాదం మోపింది. 


భారతదేశం వంటి దేశాలు కొన్ని నియంత్రణ ప్రయోగాల తర్వాత క్రిప్టోలను నియంత్రించడానికి ఉత్తమమైన మార్గాన్ని కనుగొనే ప్రక్రియలో ఉన్నాయి. ఇదిలా ఉంటే యునైటెడ్ స్టేట్స్, యూరోపియిన్ యూనియన్ దేశాలు రెగ్యులేటర్స్ పైన పని చేస్తోంది.


కెనడా.. ఈ ఏడాది జూన్‌లో థామ్సన్ రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. కెనడా క్రిప్టోను ముందుగా స్వీకరించేవారిలో ఒకటిగా ఉంది . కెనడా రెవెన్యూ అథారిటీ (CRA) సాధారణంగా క్రిప్టోకరెన్సీని దేశ ఆదాయపు పన్ను చట్టం ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తుంది.

ఇజ్రాయోల్.. ఆర్థిక సేవల చట్టం (Financial Services Law) యొక్క పర్యవేక్షణలో.. ఆర్థిక ఆస్తుల నిర్వచనంలో వర్చువల్ కరెన్సీలను కలిగి ఉంది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ రెగ్యులేటర్.. క్రిప్టో కరెన్సీని సెక్యూరిటీ సబ్జెక్ట్ అని తీర్పునిచ్చింది. అయితే ఇజ్రాయెల్ టాక్స్ అథారిటీ క్రిప్టోకరెన్సీని ఆస్తిగా నిర్వచిస్తోంది. అంతేకాకుండా మూలధన లాభాలపై 25 శాతం పన్ను డిమాండ్ చేస్తోంది.

జర్మనీ.. ఇక్కడ ఫైనాన్షియల్ సూపర్‌వైజరీ అథారిటీ వర్చువల్ కరెన్సీలను “ఖాతా యూనిట్లు (units of account)” గుర్తించడంతో ఆర్థిక సాధనాలుగా అర్హత పొందింది. బుండెస్‌ బ్యాంక్ (Bundesbank) బిట్‌కాయిన్‌ని క్రిప్టో టోకెన్‌గా పరిగణిస్తుంది.. కానీ కరెన్సీ యొక్క సాధారణ విధులను నెరవేర్చదు. అయినప్పటికీ, జర్మన్ ఫెడరల్ ఫైనాన్షియల్ సూపర్‌వైజరీ అథారిటీ ద్వారా లైసెన్స్ పొందిన ఎక్స్ఛేంజీలు,  కస్టోడియన్స్ ద్వారా పౌరులు, చట్టపరమైన సంస్థలు క్రిప్టో సెట్‌లను కొనుగోలు లేదా విక్రయించడం చేయవచ్చు.

యునైటెడ్ కింగ్‌డమ్‌.. హర్ మెజెస్టి రెవిన్యూ అండ్ కస్టమ్స్.. క్రిప్టో ఆస్తులను కరెన్సీ లేదా డబ్బుగా పరిగణించలేదు. అయినప్పటికీ క్రిప్టోకరెన్సీలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ మరే ఇతర పెట్టుబడి కార్యకలాపాలతో గానీ, చెల్లింపు విధానంతో గానీ నేరుగా పోల్చలేమని పేర్కొంది.


అమెరికా (US).. ఇక్కడ క్రిప్టో కరెన్సీలకు వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు నిర్వచనాలు, నిబంధనలను కలిగి ఉన్నాయి. ఫెడరల్ ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలను చట్టపరమైన టెండర్‌గా గుర్తించనప్పటికీ.. రాష్ట్రాలు జారీ చేసిన నిర్వచనాలు వర్చువల్ కరెన్సీల వికేంద్రీకృత స్వభావాన్ని గుర్తిస్తాయి.

థాయ్‌లాండ్‌.. థామ్సన్ రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం థాయ్‌లాండ్‌లో డిజిటల్ ఆస్తి వ్యాపారాలకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. అన్యాయమైన వ్యాపార పద్ధతులను, ఆర్థిక సంస్థలు మనీలాండరింగ్ చేయకుండా ఉండేలా పర్యవేక్షించడానికి కోసం ఈ నిబంధన తెచ్చారు. చాలా ఏళ్ల కిందట థాయ్‌లాండ్ రుణదాతగా ఉన్న సియామ్ కమర్షియల్ బ్యాంక్.. స్థానిక క్రిప్టోకరెన్సీ ఎక్చేంజ్ బిట్‌కుబ్ ఆన్‌లైన్‌లో 51% వాటాను కొనుగోలు చేయడానికి ఒక చర్యను ప్రకటించింది.

అయితే ఈ దేశాల్లో చాలా వరకు క్రిప్టోకరెన్సీలను చట్టపరమైన టెండర్‌గా గుర్తించనప్పటికీ.. ఈ డిజిటల్ యూనిట్లు సూచించే విలువను మాత్రం గుర్తిస్తారు. భారతదేశం‌ మాదిరిగానే అనేక ఇతర దేశాలు తమ దేశాల్లోని సెంట్రల్ బ్యాంక్ (భారత దేశానికి రిజర్వ్ బ్యాంక్‌లాగా) మద్దతుతో డిజిటల్ కరెన్సీని ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి.

click me!