పన్నుల్లో కోత.. ‘ఐటీ’ లిమిట్స్‌పై ‘నిర్మల’ ఫోకస్

By Sandra Ashok KumarFirst Published Oct 26, 2019, 3:01 PM IST
Highlights

ఆదాయపు పన్ను పరిమితి పెంపు దిశగా కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం 30 శాతం పన్ను చెల్లిస్తున్న వారికి ఉపశమనం కల్పించేలా కసరత్తు చేస్తున్నది. ప్రజల్లో వినియోగశక్తి పెంపొందించడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తూ.. తద్వారా మందగమనానికి చెక్ పెట్టొచ్చని భావిస్తోంది. వచ్చే బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసే అవకాశం ఉన్నది.

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనానికి చెక్‌ పెట్టేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్‌ పన్ను తగ్గింపు, బ్యాంకులకు ఊతమిచ్చేలా మూలధనం కేటాయింపు వంటి చర్యలు చేపట్టినా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు ఊపందుకోక మార్కెట్‌లో కొనుగోలు శక్తిని ప్రోత్స హించేందుకు మరో మార్గాన్ని అన్వేషిస్తోంది.

వినియోగం పెరిగితే మార్కెట్‌లో పేరుకుపోయిన వివిధ రకాల ఉత్పత్తులు అమ్ముడు పోయి.. నగదు కొరతకు చెక్‌ పడుతుందని భావిస్తోంది. వృద్ధి రేటును పెంచుకోవాలంటే ఆదాయం పన్ను శ్లాబుల్లోనూ మార్పులు తప్పవని యోచిస్తోంది. ప్రస్తుతం ఏడాదికి రూ.10 లక్షలు, ఆ పై ఆదాయం కల వ్యక్తుల నుంచి ప్రభుత్వం 30 శాతం పన్ను వసూలు చేస్తోంది. 

రూ.10 లక్షల పరిమితిని మరికొంత పెంచడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహం కల్పించి.. వినియోగ శక్తిని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.10 లక్షలపై విధిస్తున్న 30% పన్ను పరిమితిని కనీసం రెండు నుంచి నాలుగు లక్షలకు పెంచితే ప్రజలకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

also read భారతదేశం అంతటా... బిఎస్ఎన్ఎల్ ఫ్రీ కాల్స్...

తద్వారా వారి అవసరాలను తీర్చుకునేందుకు కొనుగోళ్లు చేస్తారని.. తద్వారా ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి పెరిగి ఆర్థిక మందగమనం ప్రభావం తగ్గుతుందని నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై లోతుగా చర్చిస్తున్న మోడీ సర్కార్ అన్ని రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెట్టే బడ్జెట్‌లో ప్రస్తావించే అవకాశం ఉందన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు సవాళ్లపై స్వారీ చేస్తున్నారు. ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా తాండవిస్తున్న ఆర్థిక మందగమనం.. ఆ ప్రభావం భారత్‌పై పడటంతో తయారీ రంగం తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ పలు దఫాలుగా వివిధ కంపెనీల సీఈవోలతో సమావేశమై కొనుగోళ్ల పెంపునకు అనుసరించాల్సిన తీరుపై చర్చలు జరిపారు.

రోజురోజుకూ పెరిగిపోతున్న ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ఆమె తనదైన శైలిలో కసరత్తును చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును 3.3 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

also read డిజిటల్‌ సేవల్లో రిలయన్స్‌ సంచలనం....

జీడీపీలో ద్రవ్యలోటు కట్టడి ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. కార్పొరేట్‌ పన్నును 10 శాతం తగ్గించడం కోసం 20 బిలియన్‌ డాలర్ల ఉద్దీపనలు ప్రకటించిన కేంద్రం.. తద్వారా రెవెన్యూ వసూళ్లు పెరిగి.. వినియోగానికి ఊతమిచ్చినట్లవుతుందని భావిస్తోంది.

ఆర్థిక మందనానికి చెక్‌ పెట్టి.. మార్కెట్‌లో విస్తృ తంగా నగదు చలామణి కోసం మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్‌ రిటైలింగ్‌లోకి ప్రైవేట్‌ సంస్థలను సైతం ఆహ్వానిచేందుకు ఆమోదం తెలిపింది.250 కోట్ల టర్నోవర్‌ గల సంస్థలు ఫ్యూయల్‌ రిటైలింగ్‌లో అడుగుపెట్టేందుకు అనుమతి నిచ్చింది. 

తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయమని ప్రభుత్వం భావిస్తోంది. 17 ఏళ్లుగా అమలులో ఉన్న చమురు రిటైలింగ్‌ నిబంధనలను సడలిస్తూ.. చమురు రిటైలింగ్‌లో ప్రైవేట్‌ సంస్థలు ప్రవేశించేలా నిర్ణయం తీసుకుంది. 

నూతన నిబంధనల ప్రకారం చమురుయేతర సంస్థలు కూడా ఎక్కువ సంఖ్యలో పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్రోల్‌ బంకుల మధ్య పోటీ పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో ఏదైనా కంపెనీ, సంస్థ చమురు రిటైలింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే రూ. 2000 కోట్లు సమకూర్చుకోవడంతోపాటు హైడ్రోకార్బన్‌ అన్వేషణలో పాలుపంచుకోవడం, ఉత్పత్తి, రిఫైనింగ్‌, పైప్‌ లైన్స్‌, ఎల్బీజీకి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

also read ధంతెరాస్ వేళ ....మెరవని బంగారం...

విదేశీ పెట్టుబడులు అత్యధికంగా రాబట్టడం ద్వారా ఆర్థిక మంద గమనానికి మందు వేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఇటీవల అమెరికా పర్యటనలో సైతం విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. పెట్టుబడులకు భారత్‌ స్వర్గధామం అని చెప్పారు. 

భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం, ఇక్కడి చట్టాలు కల్పిస్తున్న ఆర్థిక భరోసా అంశాలను నిర్మలా సీతారామన్ వివరించారు. ఆర్థిక మంత్రి కృషితో విదేశాల నుంచి పెట్టుబడులు భారీ వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గతంలోని బొగ్గు, తయారీ వంటి రంగాల్లో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతినివ్వగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలోని సారాంశాన్ని ఆర్థిక మంత్రి ఐఎంఎఫ్‌ వేదికగా జరిగిన వివిధ కంపెనీల ప్రతినిధుల భేటీలో వివరించారు.

click me!