కేంబ్రిడ్జి అనలిటికా స్కామ్ ఎఫెక్ట్: ఫేస్‌బుక్‌పై 6.44 లక్షల డాలర్ల ఫైన్

By Arun Kumar PFirst Published Oct 26, 2018, 12:34 PM IST
Highlights

చట్ట విరుద్ధంగా వ్యవహరించే వారు ఎప్పటికైనా ప్రభుత్వం విధించే జరిమానా, శిక్షలను భరించక తప్పదు. అంతర్జాతీయంగా ప్రతి అంశాన్ని వెలుగులోకి తెస్తూ సంచలనాలు నెలకొల్పుతున్న సోషల్ మీడియా దిగ్గజం.. తన ఖాతాదారుల పర్మిషన్ లేకుండా వారి వ్యక్తిగత డేటా కేంబ్రిడ్జి అనలిటికా అనే కన్సల్టెన్సీ సంస్థకు అమ్ముకున్నందుకు ఫేస్ బుక్ పై బ్రిటన్ 6.44 లక్షల డాలర్ల జరిమానా విధించింది. 

లండన్‌: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై బ్రిటన్‌ భారీ జరిమానా విధించింది. చట్టంలోని గరిష్ఠ పరిమితి మేరకు ఐదు లక్షల పౌండ్లు (6.44 లక్షల డాలర్లు) జరిమానా విధించింది. రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే కన్సల్టెన్సీ సంస్థకు అనుచితంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఇచ్చినందుకు ఫేస్ బుక్ పై బ్రిటన్ ప్రభుత్వం ఈ జరిమానా విధించింది.  

కేంబ్రిడ్జి అనలిటికా స్కాంగా ప్రాచుర్యం
ఇది ఆ మధ్య కాలంలో కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణంగా ప్రాచుర్యం పొందింది. కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణం బయటపడగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రంకంపలను పుట్టిన సంగతి తెలిసిందే. 2016 అమెరికా ఎన్నికల్లో రాజకీయ సహాయ సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు పనిచేసిందని వార్తలు వచ్చాయి. 

బీజేపీ, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు ఇలా
భారత్‌లోనూ ప్రదాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ‌గాంధీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కేంబ్రిడ్జి అనలిటికాను ఉపయోగించుకొన్నారని ఆయా పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి. ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యతా హక్కును ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్‌పై ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది ఫేస్‌బుక్‌ నుంచి వెళ్లిపోయారు.

అనుమతి లేకుండా ఇలా కస్టమర్ల డేటా తస్కరణ
ప్రజల అనుమతితో పనిలేకుండా ఫేస్‌బుక్‌ 2007 నుంచి 2014 వరకు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా, ఇతర యాప్‌ డెవలపర్లకు అందించిందని బ్రిటన్‌ సమాచార కమిషనర్‌ దర్యాప్తులో తేలింది. దీంతో చట్టం విధించిన గరిష్ఠ పరిమితి మేరకు ఫేస్‌బుక్‌పై బ్రిటన్ జరిమానా విధించింది. ఒక వేళ బ్రిటన్‌లో‌ ‘ఐరోపా సమాఖ్య’ రూపొందించిన కొత్త సమాచార భ్రదతా నిబంధనలు అమల్లోకి వచ్చుంటే జరిమానా మొత్తం ఇంకా పెరిగేది.

ఇక హార్డ్‌వేర్ రంగంలోకి ఫేస్ బుక్
తమ తర్వాతీ భారీ ప్రాజెక్టు హార్డ్‌వేర్‌ రంగంలో ఉండనున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ఆగ్‌మెంట్‌ రియాలిటీ (ఏఆర్‌) గ్లాసెస్‌ తయారీపై దృష్టి పెడుతున్నామని ఆ ప్రాజెక్టు చీఫ్‌ ఫికస్‌ కిర్క్‌పాట్రిక్‌ తెలిపారు. టెక్‌ క్రంచ్‌ అమెరికాలో నిర్వహించిన ఏఆర్‌, వీఆర్‌ వేడుకలో ఆయన ఈ సంగతి  ధ్రువీకరించారు. గతంలో గూగుల్‌ సంస్థ తయారు చేసిన ఆగ్‌మెంట్‌ రియాలిటీ గ్లాసెస్‌ వాణిజ్యపరంగా విజయం సాధించడంలో విఫలమయ్యాయి.

వర్చువల్, ఆగ్‌మెంట్ రియాల్టీ మధ్య తేడా
2017లో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆగ్‌మెంట్‌ గ్లాసెస్‌ తయారీపై మాట్లాడుతూ ఈ గాడ్జెట్‌ల తయారీపై తమకు ఆసక్తి ఉందని, కానీ అందుకు కావాల్సిన పరిజ్ఞానం పూర్తి స్థాయిలో తమ వద్ద లేదన్నారు. వీఆర్‌ (వర్చువల్‌ రియాలిటీ) టెక్నాలజీకి.. ఏఆర్‌ (ఆగ్‌మెంట్‌ రియాలిటీ) టెక్నాలజీకి మధ్య కొంత తేడా ఉంది. వీఆర్‌ టెక్నాలజీ ద్వారా దృశ్యంలో మనం కూడా భాగమైన అనుభూతి పొందే వీలుంది. ఏఆర్‌ టెక్నాలజీ ద్వారా కంటికి కనిపిస్తున్న ప్రత్యక్ష దృశ్యానికి డిజిటల్‌ అంశాలు జోడించి కనిపిస్తాయి.

click me!