ఇక పీఎఫ్ పైన పన్ను...రూ.7.5 లక్షలు దాటిందా? బాదుడే ?!

By Sandra Ashok KumarFirst Published Feb 8, 2020, 10:14 AM IST
Highlights

కార్పొరేట్ రంగానికి దారాళంగా రాయితీలు కల్పిస్తూ, రుణాలు మాఫీ చేసి ఆదుకుంటునన కేంద్రం.. వేతన జీవులను, పెన్షనర్లను మాత్రం వెంటాడుతున్నది. తాజాగా ఈపీఎఫ్‌లో ఒక సంస్థ వార్షిక వాటా రూ.7.5 లక్షలు దాటితే దానిపై పన్ను విధించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఇంకా ఈపీఎఫ్‌, ఎన్పీఎస్‌, ఇతర పదవీ విరమణ నిధులపై సీలింగ్‌ కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి మోదీ సర్కార్ పన్ను రూపంలో భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. 
 

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం.. పన్ను వసూళ్లలో తగ్గుదల.. ఆదాయ వనరుల లేమి. లక్ష్యాలు చేరని పెట్టుబడుల ఉపసంహరణ.. సంక్షేమ, అభివ్రుద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత.. దీంతో ఉద్యోగులకు చేదు గుళిక మిగల్చనున్నది. వేతన జీవుల పన్ను ప్రయోజనాలకు తూట్లు పొడుస్తూ భవిష్యనిధిపైనా కేంద్రం కన్నేసింది. ఇప్పటికే భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) బొక్కసానికి మోదీ సర్కార్ ఎసరుపెట్టింది. 

ఇప్పుడు శ్రామికుల కష్టార్జితాన్నీ దోచుకునే ఎత్తు వేసింది. పదవీ విరమణ తర్వాత పొందే పీఎఫ్ సొమ్మునూ వదిలిపెట్టకుండా పన్నులను ప్రకటిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ఈ నెల ఒకటో తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌), నేషనల్‌ పెన్షన్‌ స్కీం (ఎన్పీఎస్‌)లతోపాటు ఇతర ఉద్యోగానంతర నిధులపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పన్నులను ప్రతిపాదించారు. 

also read ఇళ్ళు, వాహనాల రుణాలు మరింత చౌకగా....

దేశ ఆర్థికవ్యవస్థలో నెలకొన్న మందగమనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్రం.. ఎలాగైనా ఖజానాకు కాసుల్ని తరలించాలని చూస్తున్నది. పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ఈసారి ఏకంగా రూ.2 లక్షల కోట్లను దాటించింది. అయినా సరిపోదని చివరకు ఉద్యోగ భవిష్య నిధులనూ ట్యాక్స్‌ పరిధిలోకి లాగింది.

వ్యక్తిగత ఆదాయం పన్ను (ఐటీ) చెల్లింపుదారులను కొత్త విధానం పేరిట గందరగోళానికి గురిచేసిన కేంద్ర ప్రభుత్వం.. రిటైర్మెంట్‌ ఉద్యోగుల నుంచీ పిండుకోవాలని నిర్ణయించింది. పార్లమెంట్‌ ఆమోదిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి బాదుడు మొదలే.

ఈపీఎఫ్‌, ఎన్పీఎస్‌ ఇతర అన్ని పదవీ విరమణ నిధుల్లో సంస్థల ద్వారా వచ్చే సొమ్ము ఏడాదికి (ఒక ఆర్థిక సంవత్సరం) రూ.7.5 లక్షలు దాటితే పన్ను పడుతుంది. ఉద్యోగి తన రిటైర్మెంట్‌ తర్వాత తీసుకునే మొత్తంలో నుంచి పన్ను చెల్లించాలన్న మాట.

ప్రస్తుత ఆదాయం పన్ను (ఐటీ) చట్టాల ప్రకారం ఈపీఎఫ్‌, ఎన్పీఎస్‌సహా పదవీ విరమణ అనంతరం ఉద్యోగులు పొందే మరే ఇతర పథకాల్లోని నిధులకు ఏ రకమైన పన్నులూ లేవు. కానీ ఈ బడ్జెట్‌లో వాటిపై పన్ను ప్రతిపాదించారు. దీంతో రిటైర్మెంట్‌ ఉద్యోగులపైనా బడ్జెట్‌ పిడుగు పడినైట్లెంది. 

ఇక అధిక వేతనాలు తీసుకునే ఉద్యోగులపై ఈ భారం మరింతగా పడనున్నది. ‘గుర్తింపు పొందిన ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలోని ఉద్యోగి వేతనంలో సంస్థ వాటా 12 శాతాన్ని దాటితే పన్ను’ అని బడ్జెట్‌లో పేర్కొన్నారు. 

ఇతర ఆమోదిత రిటైర్మెంట్‌ ఫండ్స్‌లోని ఉద్యోగి కష్టార్జితంలో సంస్థ వాటా రూ.1.5 లక్షలు దాటినా పన్ను మోత మోగుతుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇక ఎన్పీఎస్‌ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో సర్కారు వాటా 14 శాతం మించితే, ఇతర సంస్థల ఉద్యోగులకు 10 శాతం దాటితే పన్ను చెల్లించాల్సిందే. 

also read అలాంటి యాడ్స్ పై ఇక నుంచి 50 లక్షల జరిమానా, ఐదు ఏళ్ల జైలు శిక్ష....

ఈపీఎఫ్‌, ఎన్పీఎస్‌, ఇతర పదవీ విరమణ అనంతర నిధులపై ఉద్యోగులకు అందే వడ్డీపైనా పన్ను పడుతుందని బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐటీ చట్టాల్లోని కొన్ని నిబంధనల ప్రకారం వీటికి పన్ను మినహాయింపు లభిస్తున్నది.

దీంతో ఉద్యోగులు, ముఖ్యంగా రిటైర్మెంట్‌ ఉద్యోగుల ఆదాయానికి కేంద్రం గండి కొట్టినట్లేనని నిపుణులు అంటున్నారు. అంతేగాక ఈ నిర్ణయం పన్ను పొదుపు అవకాశాలనూ దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నిజానికి ఇప్పటికే రిటైరైనవారిని అధిక పన్నుల శ్లాబులో ఉంచారని, సర్ చార్జీలు వేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌, ఎన్పీఎస్‌, ఇతర సూపర్‌నేషన్‌ ఫండ్లలో సంస్థలు ఉద్యోగుల తరఫున చెల్లించే సొమ్ముపైనా పన్నులు వేస్తామనడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులను జీవిత చరమాంకంలో కడగండ్లపాలు చేయడమేనని అంటున్నారు.
 

click me!