విదేశాల్లో రాణా కపూర్ ఫ్యామిలీ ఆస్తులు... యెస్ బ్యాంకు స్కాంపై సీబీఐ పరిశోధన...

By Sandra Ashok KumarFirst Published Mar 10, 2020, 10:53 AM IST
Highlights

యెస్ బ్యాంకులో నెలకొన్న అవకతవకలకు రాణా కపూర్ కుటుంబానికి పూర్తిగా సంబంధాలు ఉన్నాయని తేలుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆయనతోపాటు ఆయన భార్య బిందు, ముగ్గురు కూతుళ్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విదేశాల్లో రాణా కపూర్ కుటుంబ ఆస్తులపై పరిశోధన చేస్తోంది. 

యెస్ బ్యాంకు కుంభకోణంలో దాని వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబ సభ్యులు కూడా నిందితులేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారెవ్వరూ విదేశాలకు పారిపోకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఇతర సంస్థలకు ఇచ్చిన భారీ రుణాలు, విదేశాల్లో రాణా కపూర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పరిశోధన సాగిస్తోంది. 

మరోవైపు సోమవారం యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ముంబైలోని ఏడు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా కపూర్‌ కుటుంబానికి రూ.600 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. 

కపూర్‌ అధికారిక నివాసంతోపాటు ఆయనకు సంబంధం ఉన్న మరికొన్ని ప్రాంతాల్లోనూ సోదాలు జరిగాయి. ఇప్పటికే రాణా కపూర్‌ అక్రమ నగదు చలామణి ఆరోపణల కింద ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి వంటి ఆరోపణలపై రాణా కపూర్‌, ఆయన భార్య బిందు, కూతుళ్లు రోష్నీ, రాఖీ, రాధాలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 

also read రాణా కపూర్ కూతురుకి షాక్... విమానం ఎక్కుతున్న ఆమెను...

రాణా కపూర్ కుటుంబంతోపాటు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్‌, డైరెక్టర్‌ కపిల్‌ వాధ్వాన్‌, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ డైరెక్టర్ ధీరజ్ వాద్వాన్, డూఇట్‌ అర్బన్‌ వెంచర్‌లపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చేసే ఆర్థిక సాయం విషయంలో వధ్వాన్‌తో కలిసి కపూర్‌ కుట్ర పన్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వీరందరి ఇళ్లు, కార్యాలయాల్లోనూ సీబీఐ తనిఖీలు కొనసాగాయి.

యెస్ బ్యాంకు నుంచి అందే రుణానికి ప్రతిఫలంగా తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల ద్వారా లబ్ధి చేకూర్చాలని రాణా కపూర్ ఒప్పందం కుదుర్చుకున్నారని సీబీఐ ప్రధాన అభియోగం.  2018 ఏప్రిల్‌, జూన్‌ మధ్య ఈ కుట్రకోణం రూపుదిద్దుకున్నదని పేర్కొన్నారు. 

అదే సమయంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్వల్పకాలిక డిబెంచర్‌లలో రూ.3,700కోట్లు యెస్‌ బ్యాంక్‌ పెట్టుబడి పెట్టిందన్నారు. దీనికి ప్రతిఫలంగా వధ్వాన్‌ ‘డుఇట్‌ అర్బన్‌ వెంచర్స్‌’ అనే సంస్థకు రుణాల రూపంలో రూ.600 కోట్లు అందించారని తెలిపారు. ఈ బ్యాంకు నుంచి కార్పొరేట్ సంస్థలకు జారీ చేసిన భారీ రుణాలపై ఈడీ అధికారులు కేంద్రీకరించారు.

మరోవైపు యస్‌ బ్యాంకు ఖాతాదారులు అతి త్వరలోనే ఎటువంటి పరిమితి లేకుండా తమ నగదును ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉండొచ్చు. యస్‌ బ్యాంక్‌ ఖాతాదారులు వచ్చే ఏప్రిల్‌ మూడో తేదీ వరకు కేవలం రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకునేలా ఇటీవల ఆర్‌బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే.

కాగా దీన్ని మార్చి 15 వరకే పరిమితం చేసి తర్వాతా ఎత్తివేసే అవకాశం ఉందని కొత్తగా నియమితులైన యస్‌ బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఎస్‌బీఐ మాజీ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ అన్నారు. ఆ తర్వాత ఖాతాదారులు తమ ఖాతాల్లోని నగదును ఎంత కావాలంటే అంత మొత్తం నగదును ఉపసంహరించుకోవడానికి వీలు ఉంటుందన్నారు. 

ఇంకా యస్‌బ్యాంక్‌ను ఎస్‌బీఐలో విలీనం చేస్తారనే ఊహాగానాల్లో వాస్తవం లేదని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. యస్‌ బ్యాంక్‌ స్వంతంత్రంగానే పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మూలధనం సమకూర్చలేనప్పుడు మాత్రమే విలీనం అవసరమేర్పడుతుందని అన్నారు. కాగా మార్చి7 నుంచి బ్యాంకు ఖాతాదారులు డెబిట్‌ కార్డులు ఉపయోగించి నగదును విత్‌డ్రా చేసుకుంటున్నారన్నారు.

also read డజన్ల కొద్ది కంపెనీలు... వేల కోట్ల పెట్టుబడులు...ఇది రాణా కపూర్ స్టైల్...

త్వరలోనే యస్‌బ్యాంక్‌ను పునర్‌నిర్మాణానికి ఆర్‌బీఐ ప్రయత్నిస్తున్నదని ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇతర బ్యాంకులతో చర్చిస్తున్నామని వివరాలన్నింటిని మార్చి 14న వెల్లడిస్తామని తెలిపారు. ఖాతాదారులకు ఆటంకం లేని సేవలు అందించడమే తమ ప్రథమ లక్ష్యమన్నారు. 

తమ వినియోగదారులకు యూపీఐ లావాదేవీలను అందజేయడానికి మరిన్ని పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (పీఎన్పీ) భాగస్వామ్యులను చేర్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఫోన్ పే తెలిపింది. సంక్షోభంలో కూరుకున్నా యెస్ బ్యాంకుతో తమ పార్టనర్ షిప్ కొనసాగుతుందని తెలిపింది. యెస్ బ్యాంకు లావాదేవీలపై మారటోరియంతో చెల్లింపులకు సమస్య తలెత్తకుండా ఐసీఐసీఐ బ్యాంకుతో ఫోన్ పో పార్టనర్ షిప్ చేసుకున్న సంగతి తెలిసిందే. 

గతేడాది మార్చి- సెప్టెంబర్ మధ్య యెస్ బ్యాంకు నుంచి రూ.18,100 కోట్ల డిపాజిట్లు వెళ్లిపోయాయి. బ్యాంకుపై విశ్వాసం తగ్గడంతో గతేడాది మార్చి నాటికి రూ.2,27,610 కోట్ల డిపాజిట్లు ఉండగా, 2019-20 జూన్ నెలాఖరుతో ముగిసి త్రైమాసానికి రూ.2.25 లక్షల కోట్లకు, సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.2.09 లక్షల కోట్లకు తగ్గిపోయాయి.

click me!