అమెరికాకు షాక్...విమానాల తయారీ నిలిపివేత...

By Sandra Ashok Kumar  |  First Published Dec 17, 2019, 1:43 PM IST

రెండు వరుస ప్రమాదాలతో అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ అతలాకుతలమైంది. ఫెడరల్ ఎవియేషన్ అనుమతి నిరాకరించడంతో 737 మ్యాక్స్‌ విమానాల తయారీ నిలిచిపోయింది. 
 


వాషింగ్టన్‌: అమెరికా ఆర్థిక శక్తిగా మారడంలో విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ కూడా కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోనే విమానాలు, వాటి ఇంజిన్లు తయారు చేయగల అతి తక్కువ సంస్థల్లో బోయింగ్‌ ప్రధానమైంది. బోయింగ్‌ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఐరోపా యూనియన్ (ఈయూ)తోనూ కయ్యానికి కాలు దువ్వాడంటే దీని ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. 

ఈ సంస్థకు ఒకప్పుడు కనవర్షం కురిపించిన 737 మ్యాక్స్‌ మోడల్‌ విమానాలే ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తాజాగా వచ్చే నెల నుంచి 737 మ్యాక్స్‌ జెట్‌ లైనర్ విమానాలను తయారు చేయడమే  నిలిపివేస్తున్నట్లు బోయింగ్‌ ప్రకటించింది. ఎన్నాళ్లు నిలిపివేస్తారనే సంగతి మాత్రం చెప్పలేదు. 

Latest Videos

undefined

తమ నిర్ణయం పూర్తిగా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బోయింగ్ పేర్కొంది. ఈ మోడల్‌ విమానాన్ని సియాటెల్‌లో బోయింగ్‌ నిర్మిస్తోంది. దాదాపు 12వేల మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిని ఉద్యోగాల్లో నుంచి తొలగించబోమని బోయింగ్‌ భరోసా ఇచ్చింది. కానీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా బోయింగ్‌కు ఉన్న పంపిణీ వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నది.

also read టెక్కీలకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాదిలో వారికి పండుగే!

2020 కంటే ముందే ఈ విమానాలను మార్కెట్లోకి తెచ్చేందుకు ఇటీవల ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ అనుమతులు నిరాకరించడంతో.. బోయింగ్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చిలో ఇథియోపియా ఎయిర్స్‌ లైన్స్‌ విమానం గాల్లోకి ఎగిరిన ఎనిమిది నిమిషాల్లోనే నేలకూలింది. ప్రమాదానికి గురైంది సరికొత్త విమానం. 

అంతకు ముందు దాదాపు ఆరునెలల క్రితం ఇండోనేషియా లయన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం కూడా గాల్లోకి ఎగిరిన 10నిమిషాల్లోపే జావా సముద్రంలో కూలిపోయింది. ఇదీ సరికొత్త విమానమే. రెండూ బోయింగ్‌ 737 మాక్స్‌8 మోడల్‌ విమానాలే. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. 

ప్రపంచ వ్యాప్తంగా 54 విమానయాన సంస్థలు మొత్తం 350కు పైగా బోయింగ్‌ 737  మాక్స్‌8 రకం విమానాలను వినియోగిస్తున్నాయి. ఈ ప్రమాదం తర్వాత పలు దేశాల ప్రభుత్వాలకు ఈ మోడల్‌ విమానం భద్రతపై సందేహాలు పుట్టుకొచ్చాయి. దీంతో చాలా దేశాలు ఈ మోడల్‌ విమానాల వినియోగాన్ని సస్పెండ్‌ చేయడం గానీ, లేక నిలిపివేయాలని ఆదేశించడంగానీ చేశాయి. 

ఈ ప్రమాదాలకు ప్రధానంగా ది మనూవరింగ్‌ కేరెక్టరిస్టిక్‌ ఆగ్మెంటేషన్‌ సిస్టమ్ ‌(ఎంసీఏఎస్‌) వ్యవస్థ ప్రధాన కారణమని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పైలట్లకు సాయం చేసేందుకు పలు ఆటోమేటిక్‌ సాఫ్ట్‌వేర్లు ఇప్పుడు విమానాల్లో ఉంటున్నాయి. అటువంటిదే ఇది కూడా. 

విమాన ప్రయాణ సమయంలో కొన్ని సందర్భాల్లో తోకభాగం మరీ కిందకు వెళ్లి.. ముక్కు భాగం పైకి లేచి ప్రయాణిస్తుంటాయి. దీనిని స్టాలింగ్‌ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ సమయంలో పైలట్లు చాకచక్యంగా ముక్కు భాగాన్ని కిందకు దించుతారు. అప్పుడు తోకభాగం కూడా పైకి లేచి విమానానికి స్థిరత్వం లభిస్తుంది. 

ఇదే పనిని ఆటోమేటిక్‌గా చేసేందుకు బోయింగ్‌ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. అదే ఎంసీఏఎస్‌. విమానం పరిస్థితిని అర్థం చేసుకొని ఇది ఆటోమేటిక్‌గా ముక్కు భాగాన్ని కిందకు దించి తోకభాగాన్ని పైకి లేపుతుంది. కానీ ఈ అప్‌డేషన్‌ గురించి అప్పట్లో పైలట్లకు పూర్తిగా అవగాహన లేదు. 

స్టాలింగ్‌ సమయంలో సాఫ్ట్‌వేర్‌ దానంతట అదే విమానం ముక్కును కిందకు దింపుతుంది. ఈ విషయం తెలియక పైలట్లు కూడా మాన్యూవల్‌గా ముక్కును కిందకు దించడంతో విమానం ఒక్కసారిగా భూమివైపు దూసుకెళుతుంది. దీంతో పైలట్లు కంగారుపడి పరిస్థితిని చక్కదిద్దేలోపే ప్రమాదం జరుగుతోంది. లయన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం విషయంలో ఇదే జరిగింది. 

ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ గురించి ఎఫ్‌ఏఏ పలు విమాన నియంత్రణ సంస్థలకు అందజేసింది. కానీ ఆయా విమాన నియంత్రణ సంస్థలు ఈ సమాచారాన్ని తమ దేశంలోని ఎయిర్‌లైన్స్‌కు ఎంతవరకు తెలియజేశాయనేది ప్రశ్నార్థకమైంది. గతంతో భారత్‌కు చెందిన పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కూడా దీనిపై విమానయాన సంస్థలను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత బోయింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ వంటి నష్టనివారణ చర్యలు చేపట్టింది. 

తాజాగా బోయింగ్ బోర్డు తీసుకొన్న నిర్ణయం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు లీజు, కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకొన్నాయి. దీంతో ఈ నిర్ణయం వల్ల తక్షణ ప్రభావం లేకున్నా, దీర్ఘకాలిక ప్రభావం కచ్చితంగా ఉంటుంది. 

also read నిరసనలకు తలొగ్గి...రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపు

దీనిపై శ్వేతసౌధం ప్రతినిధి రిక్‌ లార్సెన్‌ మాట్లాడుతూ ‘‘ఈ నిర్ణయం ఉద్యోగులకు.. ఆర్థిక వ్యవస్థకు ముష్టి ఘాతం వంటింది. ఉద్యోగులను తొలగించబోమని బోయింగ్‌ ప్రకటించడం మాత్రం కొంత ఊరటనిచ్చింది. ఈ మూసివేత దీర్ఘకాలం కొనసాగితే మేము బోయింగ్‌ ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ’’ అని పేర్కొన్నారు. 

కొన్నాళ్లుగా బోయింగ్‌ 737మ్యాక్స్‌ ఆర్డర్లను నిలిపివేసినా.. ఇప్పటి వరకు నెలకు సగటున 42 విమనాలు తయారు చేస్తోంది. దీంతో పాటు విడిభాగాల సరఫరా దారులను కొనసాగించేందుకు నెలకు 52 విమానాలకు అవసరమైన విడిభాగాలను కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే బోయింగ్‌ వద్ద 400 విమానాలు డెలివరీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

ఒక్కసారి ఎఫ్‌ఏఏ అనుమతి ఇవ్వగానే వీటిని కస్టమర్లకు అందజేస్తామని బోయింగ్‌ పేర్కొంది. బోయింగ్‌ నిర్ణయంపై స్పందించడానికి ఎఫ్‌ఏఏ నిరాకరించింది. ‘‘ప్రయాణికుల భద్రతకే మా తొలి ప్రాధాన్యం.. మా పని ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము. దీనికి నిర్దేశిత సమయం లేదు’’ అని పేర్కొంది.   
 

click me!