బ్లూ చిప్‌తోనే లాభాలు... బట్ వెనుకబడ్డ మిడ్ స్మాల్ క్యాప్

By Sandra Ashok Kumar  |  First Published Dec 26, 2019, 12:10 PM IST

ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు కొంత లాభం.. కొంత నష్టం మిగిల్చింది. సెన్సెక్స్‌, నిఫ్టీ ఇండెక్స్‌లు రెండంకెల వృద్ధి నమోదు చేసుకున్నాయి. బ్లూ చిప్ కంపెనీల్లో పెట్టుబడులు మదుపర్లకు లాభాలు పంచగా, స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు మాత్రం నష్టాల బాటలో పయనించాయి.


ముంబై/న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఒడుదొడుకులు మరింత పెరిగినా ప్రామాణిక సూచీలు మాత్రం ఎగువముఖంగానే పయనించాయి. సరికొత్త ఆల్‌టైం రికార్డులను నమోదు చేసుకున్నాయి. మార్కెట్లు భారీ నష్టాలనూ చవిచూశాయి. మొత్తంగా చూస్తే మాత్రం రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోగలిగాయి. 

ఈ ఏడాదిలో డిసెంబరు 20 వరకు బీఎస్ఈ సెన్సెక్స్‌ 16 శాతం పుంజుకోగా.. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 13 శాతం పెరిగింది. ఈ ఏడాది సెన్సెక్స్‌ 41వేల, నిఫ్టీ 12వేల స్థాయిలకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఇన్వెస్టర్లకు రిటర్నులు పంచే విషయంలో బ్లూచిప్‌ కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి సంస్థలు వెనకబడ్డాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Latest Videos

undefined

also read  మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలో కొత్త రికార్డు...అదనంగా 4 లక్షల కోట్లు...
 
గత ఏడాది కాలంలో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 2.30 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 7.5 శాతం మేర క్షీణించాయి. 2018 జనవరిలో సెన్సెక్స్‌తో పాటు ఆల్‌టైం గరిష్ఠాలకు చేరిన స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు ఆ తర్వాత నుంచి దిద్దుబాటుకు గురవుతూ వస్తున్నాయి. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు మిడ్‌క్యాప్‌ 19 శాతం, స్మాల్‌ క్యాప్‌ 34 శాతం తగ్గాయి. 2020లో సూచీలు మరింత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.
 
ఈ ఏడాది ప్రధాన సూచీల్లో రెండంకెల వృద్ధి నమోదవడానికి కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతోపాటు ఆర్థిక వృద్ధి, పెట్టుబడులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ప్రకటించిన ఇతర చర్యలే ప్రధానంగా దోహదపడ్డాయని విశ్లేషకులంటున్నారు. మార్కెట్లో కొన్ని కంపెనీల షేర్లు మాత్రమే ఇన్వెస్టర్లను ఆకర్షించగలిగాయని.. బడా కంపెనీల షేర్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని వారన్నారు. 

చిన్న, మధ్య స్థాయి షేర్ల ట్రేడింగ్‌లో మాత్రం ఈ ఆశావహ వాతావరణం కన్పించలేదు. వాస్తవానికి, దేశీయంగా నెలకొన్న పలు ప్రతికూల అంశాలు స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్ల విలువకు గండికొట్టాయి. మున్ముందు త్రైమాసికాల్లో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజురేంటుదని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధికి, మార్కెట్‌ ఊతమిచ్చేలా ఈసారి బడ్జెట్‌లో మరిన్ని చర్యలను ప్రకటించే అవకాశం ఉందని వారంటున్నారు. 2020లో నిఫ్టీ 12,900 స్థాయికి ఎగబాకవచ్చని యెస్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అమర్‌ అంబానీ అంచనా వేస్తున్నారు.

also read  ముకేశ్ అంబానీ మొత్తం సంపాదన ఎంతో తెలుసా....
 
ఈ ఏడాది మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలోని నిర్వహణ ఆస్తుల విలువ మరో రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగింది. 2018 చివరినాటికి రూ.22.86 లక్షల కోట్లుగా నమోదైన ఫండ్ల నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది నవంబర్ చివరినాటికి 18 శాతం (రూ.4.2 లక్షల కోట్లు) పెరిగి రూ.27 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 

ఫండ్‌ ఆస్తుల వృద్ధి కొత్త సంవత్సరంలోనూ కొనసాగనుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ఆర్థిక సాధనాలపై మదుపర్లలో నమ్మకం పెంచేందుకు ఈమధ్యకాలంలో సెబీ చేపట్టిన చర్యలు, డెట్‌ ఫండ్లలోకి పెరుగుతున్న పెట్టుబడులు ఇందుకు దోహదపడగలవని వారు భావిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్లో ఊగిసలాటలు తీవ్రతరమైన నేపథ్యంలో ఈ ఏడాది ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు తగ్గిపోయాయి. అయితే, డెట్‌ సాధనాలకు డిమాండ్‌ పెరగడంతో ఫండ్ల ఆస్తులు మొత్తంగా వృద్ధిని నమోదు చేసుకోగలిగాయి. 

2020లో తమ రంగం 17-18 శాతం వృద్ధిని నమోదు చేసుకోవచ్చని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(యాంఫీ) సీఈఓ ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ అంచనా. ఆర్థిక వృద్ధి పునరుద్ధరణతోపాటు ఈక్విటీ మార్కెట్లో వాతావరణం మెరుగుపడవచ్చన్న అంచనాలున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు మళ్లీ పుంజుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

click me!