ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంక్ కథ మంగళవారంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బ్యాంకుల విలీనంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంకు విలీనం అధికారికంగా పూర్తయినట్లే.
హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంక్ కథ మంగళవారంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బ్యాంకుల విలీనంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంకు విలీనం అధికారికంగా పూర్తయినట్లే. జాతీయోద్యమ సమయంలో 1923 నవంబర్ 20వ తేదీన భోగరాజు పట్టాబి సీతారామయ్య ప్రైవేట్ బ్యాంకుగా ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు.
అయితే, డిపాజిట్లు రూ.50 కోట్ల కంటే కొద్దిగా తక్కువగా ఉండడంతో నాటి ఇందిరాగాంధీ హయాంలో తొలిసారి 1969లో జాతీయకరణ నుంచి తప్పించుకుంది. కానీ ఇందిరా గాంధీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 1980 ఏప్రిల్‌లో మాత్రం ఆంధ్రా బ్యాంక్ జాతీయకరణ నుంచి తప్పించుకోలేక పోయింది.
బుధవారం (ఏప్రిల్ 1) నుంచి మరో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విలీనమవుతున్నది. తద్వారా ఆంధ్రా బ్యాంకు తన ఉనికినే కోల్పోతోంది. ఆంధ్రా బ్యాంక్‌తోపాటు కార్పొరేషన్ బ్యాంక్ యూబీఐలో విలీనమైంది.
1923 నవంబర్ 20వ తేదీన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు భోగరాజు పట్టాబి సీతారామయ్య ఆంధ్రా బ్యాంకు పేరును రిజిస్టర్ చేశారు. అదే నెల 28వ తేదీన సేవలను ప్రారంభించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1969-1980 మధ్య దేశంలో నెంబర్‌వన్ ప్రైవేట్ బ్యాంక్‌గా గుర్తింపు తెచ్చుకున్నది.
undefined
1980 ఏప్రిల్ 15వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా బ్యాంకును జాతీయం చేసింది. నాటి నుంచి జాతీయంగా సేవలందించిన ఆంధ్రా బ్యాంకు గతేడాది మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 శాఖలు, 3,798 ఏటీఎంలతో వినియోగదారులకు అందుబాటులో ఉన్నది.
1981లో దేశంలో తొలిసారిగా క్రెడిట్ కార్డుల వ్యాపారంలోకి ఆంధ్రా బ్యాంకు అడుగు పెట్టింది. 2020 ఏప్రిల్ ఒకటో తేదీన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. ఆంధ్రా బ్యాంకుతోపాటు కార్పొరేషన్ బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానున్నది.
విలీనం తర్వాత ఆంధ్రా బ్యాంక్‌కు చెందిన కొన్ని స్థిరాస్తులను అమ్మేయాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే కొన్ని నివాస, వాణిజ్య సముదాయాల్ని గుర్తించినట్టు యూబీఐ ఎండీ, సీఈఓ రాజ్‌కిరణ్ రాయ్ ప్రకటించారు. ఈ ఆస్తులతో పాటు ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మలేషియాలోని ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్ మలేషియాలో ఆంధ్రా బ్యాంకు గల వాటానూ విక్రయించాలని నిర్ణయించింది.
దాదాపు తొమ్మిది దశాబ్ధాలుగా తెలుగు నేలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆంధ్రా బ్యాంక్ సేవలు అందించింది. అలాంటి బ్యాంక్ పేరు బుధవారం నుంచి చరిత్రలో కలిసిపోయింది.
విలీనాల ద్వారా పీఎస్బీల బలోపేతం పేరుతో తెలుగు ప్రజలతో ముడిపడి రెండు ప్రముఖ పీఎస్బీలను కేంద్ర ప్రభుత్వం ఇతర పీఎస్బీల్లో కలిపేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కలిసిపోయింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రా బ్యాంక్.. యూబీఐలో విలీనమవుతున్నది.
ప్రస్తుత పరిస్థితుల్లో యూబీఐలో విలీనాన్ని ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. పీఎస్బీల బలోపేతానికి విలీనాలు పరిష్కారం కాదని, దీనివల్ల ఉద్యోగుల ఉద్యోగ భద్రతకూ ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
also read:కేసులపై ఆందోళనొద్దు.. తీవ్రతపైనే ఫోకస్ చేయాలి: కిరణ్‌మజుందార్ షా
విలీనం తర్వాత దాదాపు 700 శాఖలను హేతుబద్ధం చేయాల్సి ఉంటుందని యూబీఐ ఎండీ, సీఈఓ ప్రకటించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కోవిడ్-19తో దేశం వణికిపోతున్నా, ప్రభుత్వం మొండి పట్టుదలతో ఆంధ్రా బ్యాంక్‌ను యూబీఐలో విలీనం చేయడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి.
విలీనాలతో ఆయా రాష్ట్రాల స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్లు కూడా మారిపోయారు. ఏప్రిల్ 1 నుంచి యూబీఐ ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎస్బీసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తుంది. ఆర్‌బీఐ ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆంధ్రా బ్యాంక్.. ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా వ్యవసహరించింది. విలీనంతో ఆ బాధ్యత ఇప్పుడు యూబీఐకి వచ్చింది.