మా విమానాలు మాకివ్వండి: జెట్ ఎయిర్‌వేస్ కి లీజు కంపనీల డిమాండ్

By Arun Kumar PFirst Published Mar 16, 2019, 12:00 PM IST
Highlights

నరేశ్ గోయల్ సారథ్యంలోని జెట్ ఎయిర్వేస్ సంస్థ మరింత చిక్కుల్లోకి వెళ్లిపోతున్నది. జెట్ ఎయిర్వేస్ సంస్థకు విమానాలను లీజుకు ఇచ్చిన సంస్థలు తమ విమానాలను వెనక్కు ఇచ్చేయాలని కోరుతూ డీజీసీఏకు దరఖాస్తు చేసుకున్నాయి. సకాలంలో లీజు మొత్తం జెట్ ఎయిర్వేస్ చెల్లించకపోవడమే దీనికి కారణం. ఇక జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్‌గా నరేశ్ గోయల్ వాటా, పాత్రపైనే ఎతిహాద్ సంస్థతో విభేదాలు పెరుగడం వల్లే ప్రతిష్ఠంభన దాని వెంట సంక్షోభం కొనసాగుతున్నాయి. కానీ వారంలోగా పరిష్కారం లభిస్తుందని జెట్ ఎయిర్వేస్ లెండర్ ఎస్బీఐ ఆశాభావంతో ఉంది. 

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యం కష్టాలు మరింతగా పెరిగాయి. విమానాలను లీజుకిచ్చిన కంపెనీలు వాటిని వెనక్కి ఇప్పించాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ)కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఆ మేరకు రెండు సంస్థలు లీజు ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి సిద్ధపడినట్లు సమాచారం. 

ఇప్పటి వరకు విమాన బకాయిలను జెట్‌ ఎయిర్వేస్ తీర్చకపోవడమే ఇందుకు కారణం. జెట్ ఎయిర్వేస్ సంస్థకు లీజుకిచ్చిన విమానాలను విదేశాల్లో నడుపుకోవాలని ఆయా విమాన యజమానులు భావిస్తున్నట్లు ఈ వ్యవహారాలతో దగ్గరి సంబంధం ఉన్న అయిదుగురు వ్యక్తులు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు తెలిపారు.

కనీసం అయిదు విమానాల నమోదు ఉపసంహరణ (డీ రిజిస్టర్‌) చేయాలని రెండు సంస్థలు డీజీసీఏకు దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఏవైనా లీజు ఒప్పందాలు రద్దు చేసుకోవాలంటే డీజీసీఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.

బిలియన్‌ డాలర్లకు పైగా రుణాలు పెరిగిపోవడంతో నెలల తరబడి పైలట్లు, సరఫరాదార్లు, విమాన యజమానులకు చెల్లింపులు చేయడంలో జెట్‌ ఆలస్యం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సంస్థ పుంజుకోవడం అనేది బ్యాంకుల నుంచి వచ్చే అత్యవసర నిధులపై ఆధారపడి ఉంది.

బకాయిలు చెల్లించకపోవడంతో జెట్‌ ఎయిర్వేస్ సంస్థకు లీజుకు విమానాలిచ్చిన జీఈ క్యాపిటల్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌(జీఈసీఏఎస్‌), ఏర్‌క్యాప్‌ హోల్డింగ్స్‌, బీఓసీ ఏవియేషన్‌ వంటివి ఇప్పటికే తమకు చెందిన కొన్ని విమానాలను నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీకి ఉన్న మొత్తం 119 విమానాల్లో మూడొంతులు నేలకే పరిమితమయ్యాయి.

ఒక్కసారి డీజీసీఏ వద్ద నమోదు ఉపసంహరణ (డీ రిజిస్టర్‌) జరిగితే వారు తమ విమానాలను దేశం వెలుపలకు తీసుకెళ్లడానికి అనుమతులు వస్తాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డీరిజిస్టర్‌ అయ్యే ఒక విమానం చైనాకు, మరొకటి ఐర్లాండ్‌కు వెళ్లనున్నాయి. జీఈసీఏఎస్‌, ఏర్‌క్యాప్‌లు కనీసం అయిదు విమానాల డీరిజిస్టర్‌కు దరఖాస్తు చేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.

విమానాలను వెనక్కు ఇచ్చేయాలని డీజీసీఏను ఆయా విమానాల యాజమాన్యాలు కోరినట్లు వచ్చిన వార్తలపై జెట్‌ ఎయిర్వేస్ ఇంత వరకు స్పందించలేదు. ఏర్‌క్యాప్‌, జీఈసీఏఎస్‌లు దీనిపై స్పందించాల్సి ఉంది. 
విమాన యజమానులకు జెట్ ఎయిర్వేస్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. అలా చేస్తే కేవలం ఐదు రోజుల్లో విమాన నమోదు రద్దు అవుతుంది. అయితే ఇందుకు కొన్ని షరతులు ఉంటాయి. ముఖ్యంగా ఆ విమాన బకాయిలు సర్దుబాటు కావాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంటుంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు వచ్చే వారం ఒక పరిష్కార ప్రణాళిక దిశగా అడుగులు పడతాయని బ్యాంకర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నరేశ్‌ గోయల్‌ ఎంత వాటా కలిగి ఉండాలన్న దానిపై జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఊరట కలిగించేదే. 

శుక్రవారమిక్కడ ఎస్‌బీఐ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో.. వచ్చే వారంలో ఒక పరిష్కార ప్రణాళికతో వస్తామ’ని పేర్కొన్నారు. నవంబర్ నెలలో పరిష్కార ప్రణాళికల ప్రక్రియ మొదలైంది.

కానీ ఆ ప్రణాళిక ప్రక్రియ అమలు ఇంకా ఆలస్యం కావడంపై ఎస్బీఐ అధికారి స్పందిస్తూ ‘ఏ పరిష్కార ప్రణాళికలోనైనా సంక్లిష్ట ప్రక్రియ ఉంటుంది. ఒకట్రెండు, 15 రోజుల్లో పూర్తి కావు. వివిధ వర్గాలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలి. ప్రమోటర్లు, భాగస్వాములు.. ఇలా ఎందరో ఉంటారు. పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నపుడు అందుకు సమయం పడుతుంద’ని చెప్పుకొచ్చారు. కాగా, జెట్‌కు రూ.8200 కోట్ల రుణాలు ఉండగా.. మార్చి చివరకల్లా రూ.1700 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉంది.

click me!