ఊరి కథ: మంగళగిరి

By narsimha lodeFirst Published Sep 1, 2019, 11:38 AM IST
Highlights

ఈ వారం వూరి కథలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని కీలక పట్టణం మంగళగిరి గురించి తెలుసుకుందాం. ఈ పట్టణానికి వేల ఏళ్ల చరిత్ర వుంది. క్రీస్తుపూర్వం 225లోనే మంగళగిరి ఏర్పాటైనట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ప్రాచీన కాలంలో దీనిని మంగళాచలం, మంగళశైలం, మంగళాద్రి, ధర్మాద్రి, ముక్త్యాద్రి అని కూడా పిలిచేవారు.

ఈ వారం వూరి కథలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని కీలక పట్టణం మంగళగిరి గురించి తెలుసుకుందాం. ఈ పట్టణానికి వేల ఏళ్ల చరిత్ర వుంది. క్రీస్తుపూర్వం 225లోనే మంగళగిరి ఏర్పాటైనట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ప్రాచీన కాలంలో దీనిని మంగళాచలం, మంగళశైలం, మంగళాద్రి, ధర్మాద్రి, ముక్త్యాద్రి అని కూడా పిలిచేవారు. ఈ వూరిలో ఉన్న కొండ పేరు మీదనే పట్టణానికి మంగళాద్రి అనే పేరు వచ్చినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. 

ఈ పట్టణం శాతవాహనులు, పల్లవులు, విష్ణుకుండీనులు, కాకతీయులు, రెడ్డి రాజుల ఏలుబడిలో వుంది. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత మంగళగిరి గొల్కోండ నవాబుల పాలనలోకి వచ్చింది. 

1568లో ముస్లిం నవాబుల అధిక పన్నులు భరించలేక ప్రజలు మంగళగిరిని విడిచి మచిలీపట్నం, నిజాంపట్నం తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. అయితే నల్గొండ సుల్తాను పరిస్ధితిని గమనించి.. తన సేనాపతి అలీని పంపి ఎలాంటి పన్నులు విధించబోమని హామీ ఇవ్వడంతో జనం తిరిగి మంగళగిరి వచ్చినట్లు పట్టణంలోని మెయిన్ బజారులో ఉన్న శాసనస్తంభం మీద పారశీక భాషలో శాసనం వుంది. 

1780లో హైదర్ అలీ పెద్ద సైన్యంతో పట్టణాన్ని దోచుకున్నారని.. అలాగే 1816లో పిండారీలు అనే దారి దోపిడీ దొంగలు మంగళగిరిలో అత్యాచారాలు, హత్యలు చేయడంతో పాటు సంపదను కొల్లగొట్టారని చారిత్రక ఆధారాలున్నాయి. 1892లో ఈ ప్రాంతంలో సంభవించిన డొక్కల కరువు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రిటీష్ వారు కృష్ణానదీపై ఆనకట్ట కట్టడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. 

మంగళాద్రి పర్వతం పడుకున్న ఏనుగు ఆకారంలో ఉంటుంది. ఏనుగు మీద అంబారీ వున్నట్లుగా దీనిపై గండాలయ స్వామి ఆలయం వుంది. ఈ స్వామికి రూపం వుండదు. వెలుగుతున్న జ్యోతి రూపంలో ఈయన భక్తులకు దర్శనమిస్తారు. ఓ చిన్న గుహలో ఓ ఇనుప పాత్రలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె పోసి భక్తులు దీపం వెలగిస్తారు. కష్టాల్లో ఉన్న వారు ఇక్కడ దీపం వెలిగిస్తామని మొక్కుకుంటారు. 

ఈ క్షేత్ర పురాణం ప్రకారం శ్రీమహావిష్ణువు నమూచి అనే రాక్షసుడిని సంహరించేందుకు సుదర్శన చక్రం రూపంలో వెంబడించచగా.. అతడు ప్రాణాల్ని కాపాడుకోవడానికి మంగళగిరి కొండలోని ఓ గుహలో దాక్కున్నాడట. దీంతో స్వామివారు గుహలోకి ప్రవేశించి రాక్షసుడిని సంహరించాడట. నమూచిని అంతమొందించిన తర్వాత మహోగ్రరూపం దాల్చిన నరసింహుడిని శాంతింపజేయడానికి దేవతలందరూ నానా విధాలుగా స్తుతించారు. 

అయినప్పటికీ ఆయన శాంతించకపోవడంతో స్వయంగా శ్రీ మహాలక్ష్మీ.. స్వామివారిని శాంతమూర్తిగా మార్చిందట. కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో నీటిని, ద్వాపర యుగంలో ఆవుపాలను, కలియుగంలో బెల్లపు పానకాన్ని స్వీకరిస్తూ ఉన్నారు నరసింహుడు. పానకాన్ని స్వీకరిస్తూ ఉండటం వల్లే ఈయనకు పానకాల లక్ష్మీ నరసింహస్వామి అనే పేరొచ్చింది. 

భక్తులు సమర్పించిన పానకం సేవించేటప్పుడు గుటకల శబ్ధం కూడా వినిపిస్తుందని పెద్దల మాట. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే పానకాలరాయుడికి భక్తులు ఎంత పానకం సమర్పించినప్పటికీ సగం మాత్రమే స్వీకరించి మిగిలినది ప్రసాదంగా అందివ్వడం. ఎంత బెల్లం, పంచదార వినియోగించినప్పటకీ ఆలయ పరిసరాల్లో చీమలు, ఈగలు లేవకపోవడం స్వామివారి మహాత్యంగా చెబుతారు. 

ఈ ఆలయం మధ్యాహ్నాం 3 గంటల వరకు మాత్రమే తెరిచి వుంటుంది. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు.. సాయంత్రం వేళ స్వామివారిని దేవతలు సేవిస్తారని ప్రతీతి. ఆ సమయంలో ఇక్కడ నరమానవుడు కూడా సంచరించరు. 

వేల ఏళ్ల నుంచి ఈ కొండ మీదకు కాలినడకనే భక్తులు వెళ్లేవారు. అయితే 1890లో బ్రిటీష్ వారి హయాంలో కొండపైకి మెట్లమార్గం ఏర్పాటైంది. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండపైకి ఘాట్ రోడ్‌ను నిర్మించడంతో పాటు మరిన్ని మౌలిక వసతులు కల్పించడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఇక కొండ కింద ద్వాపర యుగం నాటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వుంది. 

అరణ్యవాసంలో వున్న పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. మూలవిరాట్టును గండక శిలను విగ్రహంగా చేయించి ధర్మరాజు ప్రతిష్టించాడని చెబుతారు.  ఎడమ తొడపై అమ్మవారిని కూర్చోబెట్టుకుని సతీసమేతంగా నరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి తూర్పు రాజగోపురం ఇక్కడ ప్రఖ్యాతి గాంచింది. 

దీనిని 1807లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించారు. సుమారు 152 అడుగుల ఎత్తులో.. 11 అంతస్తులుండే ఈ గోపురం.. పునాది వద్ద వెడల్పు తక్కువగా ఉంటుంది. దీనిని ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్‌తో పోలుస్తారు. 

ఇక వందల ఏళ్లనాటి దివ్యరథం మరో ప్రత్యేకత. సుమారు 30 అడుగుల ఎత్తు కలిగిన రథం చుట్టూ భారత, భాగవత పురాణ గాథలు తెలిపే చిత్రాలు చెక్కి వున్నాయి. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దక్షిణ భాగంలో పుష్కరిణి వుంది. దీనిని పెద్ద కోనేరుగా భక్తులు పిలుస్తారు. అప్పట్లో ఇందులో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించేవారు. కానీ కాలక్రమేణా ఇది శిథిలావస్థకు చేరుకుంది. 

ప్రతీ ఏటా ఫాల్గుణ శుద్ధ పంచమి మొదలు, పూర్ణిమ వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీనికే మంగళగిరి తిరునాళ్లగా పేరు.. ఈ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు వుంది. 

మంగళగిరి చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. సుమారు 500 నుంచి 1000 సంవత్సరాల నుంచి చేనేత వృత్తిని కొనసాగిస్తున్నారు. మంగళకరమైన సందర్భాలన్నింటికీ మంగళాన్నిచ్చే చీరగా మంగళగిరి చీరకు గుర్తింపు ఉంది. ఈ చీరలు దేశ విదేశాలలో ఖ్యాతి పొందాయి. ఈ చీరలలో సుమారు వంద రకాల డిజైన్లు ఉంటాయి. ఇక్కడి చీరలకు భౌగోళిక గుర్తింపు చట్టం 1999 ప్రకారం గుర్తింపు చిహ్నం లభించింది. 

గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో ఉండటంతో పాటు రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో మంగళగిరిలో అభివృద్ది వేగం పెంచుకుంది. ఆటోనగర్ ప్రాంతంలో అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటవ్వగా.. ఎయిమ్స్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు పట్టణానికి సమీపంలో ఏర్పాటయ్యాయి. 

అమరావతి అమరేశ్వరాలయం, నంబూరులోని జైన ఆలయం, ఉండవల్లి గుహలు, హయ్‌లాండ్ మంగళగిరికి సమీపంలోనే ఉన్నాయి. ఈ పట్టణం మీదుగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి వెళుతుంది. రైల్వేస్టేషన్‌తో పాటు దగ్గరలోనే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వుంది. 

click me!