బందరుకు గొప్పపేరు తెచ్చిన పింగళి వెంకయ్యకే ... బాలశౌరి గౌరవం తెచ్చారు

By Arun Kumar PFirst Published Oct 2, 2024, 6:00 PM IST
Highlights

జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యకు తగిన గుర్తింపు దక్కడంలో జనసేన ఎంపీ బాలశౌరి కీలక పాత్ర పోషించారు. ఎంపీ విజ్ఞప్తిని వెంటనే సీఎం చంద్రబాబు ఆమోదించడంతో మచిలీపట్నం వాసుల కోరిక నెరవేరింది.

Vallabhaneni Balashouri : జాతీయ జెండా ... ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇలా యావత్ దేశం గౌరవించే జాతీయ జెండాను తయారుచేసింది మన తెలుగు వ్యక్తే. ఆయనే పింగళి వెంకయ్య. మచిలీపట్నంకు చెందిన ఈ స్వాతంత్య్ర సమరయోధుడికి ఇన్నాళ్లకు తగిన గుర్తింపు దక్కింది... అదీ జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి వల్లే సాధ్యమయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎట్టకేలకు మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టడానికి ఒప్పించారు జనసేన ఎంపీ. 

మన తెలుగుబిడ్డ, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడమే కాదు మనం ఈనాడు ఎంతో గౌరవంగా భావించే జాతీయ జెండాను రూపొందించిన పింగళికి తగిన గౌరవం దక్కాలని ఎంపీ బాలశౌరి చాలాకాలంగా కోరుకుంటున్నారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసారు. గతంలో కూడా బందరు మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని వైసిపి ప్రభుత్వాన్ని కోరారు... కానీ కుదరలేదు. కానీ బాలశౌరి వెనక్కి తగ్గలేదు... ఇటీవల కూటమి అధికారంలోకి రావడంతో ఈ ప్రభుత్వం ముందు ప్రతిపాదన వుంచారు. 

Latest Videos

అయితే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా చేపట్టిన కార్యక్రమం కోసం మచిలీపట్నం వెళ్లారు. ఈ వేదికపైనే మెడికల్ కాలేజీకి   పింగళి వెంకయ్య పేరు పెట్టాలని ప్రతిపాదించారు బాలశౌరి. ఇదే విషయంపై గతంలో లేఖకూడా సమర్పించినట్లు గుర్తు చేశారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన సీఎం పింగళి వెంకయ్య పేరును మెడికల్ కాలేజీకి పెడతామని ప్రకటించారు. 

ఇన్నాళ్లకు మువ్వన్నెల జాతీయ జెండా రూపశిల్పికి స్వస్థలంలో తగిన గుర్తింపు లభించింది... ఇదంతా స్థానిక ఎంపీ ప్రయత్న ఫలితమేనని బందరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సీఎం ప్రకటన చేసిన వెంటనే సభ జరుగుతున్న ప్రాంతంలోని ప్రజలు చప్పట్లు కొడుతా హర్షం వ్యక్తం చేశారు. 

సీఎం ప్రకటనపై బాలశౌరి రియాక్షన్ 

పింగళి వెంకయ్య పేరుని మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పెడుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.  మువ్వన్నెల జెండా ఎగుర వేస్తున్నామంటే దానికి కారణం మన బందరు వాసి పింగళి వెంకయ్య తయారుచేసిన త్రివర్ణ పతాకమేనని ఆయన పేర్కొన్నారు.  

దేశానికి స్వాతంత్య్రం రావడం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన మహనీయులు పింగళి వెంకయ్య అని ఎంపీ బాలశౌరి తెలిపారు.    కృష్ణా జిల్లాలో పుట్టి, స్వాతంత్ర సమరంలో పాల్గొని, గాంధీజీ లాంటి గొప్ప నాయకులకు ఇష్టమైన వ్యక్తిగా మారి, ఆయన కోరిక మేరకు మన దేశానికి ఒక జెండా రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య అని ఆయన కొనియాడారు. అటువంటి వ్యక్తిని, ఆయన దేశానికి చేసిన సేవను నిరంతరం స్మరించు కోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. 

బందరు ప్రాంతంలో జన్మించిన పింగళి వెంకయ్య పేరును బందరు లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టడం ఆయనకు మనం అర్పించే ఘన నివాళి అని ఎంపీ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి  పవన కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చి లేఖ కూడా అందజేసినట్లు ఆయన తెలిపారు. 

ఫలించిన ఎంపీ బాలశౌరి కృషి

బందరు మెడికల్ కళాశాలకు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెడతామని సీఎం చంద్రబాబు చెప్పడం చారిత్రాత్మకమని ఎంపీ బాలశౌరి తెలిపారు. గతంలో అనేక సందర్బల్లో పింగళి వెంకయ్య పేరును మెడికల్ కళాశాలకు పెట్టాలని కోరినా... స్థానిక మాజీ ఎమ్మెల్యే అహంకారంతో ఆ మహనీయుని పేరు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి పర్యటనలోనే పింగళి పేరు వైద్య కళాశాలకు పెడుతున్నట్లు చెప్పి బందరు ప్రజలకు శుభవార్త చెప్పారన్నారు. ఈ సందర్బంగా ఎంపీ బాలశౌరి సీఎం చంద్రబాబుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

 

click me!