రొమాన్స్ స్కామ్స్... డేటింగ్ సైట్లలో హైటెక్ వ్యభిచారం.. వేలమంది బాధితులు, కోట్లలో మోసం...

By Bukka SumabalaFirst Published Aug 26, 2022, 10:47 AM IST
Highlights

కర్నూలు కేంద్రంగా సాగుతున్న డేటింగ్ సైట్ల మోసాన్ని పోలీసులు గుర్తించారు. బాధితుల కోసం సైబర్ మిత్ర, పోలీసు వాట్సాప్ నెంబర్ లకు ఫిర్యాదు చేసే ఏర్పాట్లు చేశారు. ఒక్క కర్నూలులోనే ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఇలా మోసపోయారని తేలింది. 
 

కర్నూలు : కర్నూలుకు చెందిన  ఒక ఇంజనీరింగ్ విద్యార్థి  గూగుల్ లో ‘కాల్ గర్ల్స్ మొబైల్ నెంబర్స్ ఇన్ కర్నూలు’ అని ఒక సైట్ చూశాడు. అందులో  కొన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాటిలో ఒక నెంబర్ కు ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడారు. ఎక్కడుంటారని అడిగితే ఆ విద్యార్థి కర్నూలు అని చెప్పాడు. రూ. 10,000 అవుతుందని, అడ్వాన్స్ గా రూ.5వేలు ఫోన్ పే లో పంపాలని అని చెప్పారు. విద్యార్థి  ఫోన్ చేసిన నెంబర్ కు  ఫోటోలు వాట్సాప్ లో పంపారు. అయితే, మోసపోతానేమో అనే భయంతో ఆ విద్యార్థి ఆన్ లైన్ లోని మరో నెంబర్కు ఫోన్ చేశాడు. ఫోటోలు తెప్పించుకుని చూశాడు. అలా నాలుగైదు నెంబర్లకు ఫోన్ చేసి ఫోటోలు తెప్పించుకుని చూసి ఒక నెంబర్ కు ఫోన్ పే ద్వారా రూ5వేలు పంపాడు.

డబ్బులు పంపిన తర్వాత కర్నూలులోని మేడం ఒకరు నీకు ఫోన్ చేస్తారు. లొకేషన్ చెబుతారు. అని అవతలి వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇలా ఈ విద్యార్థి ఒక్కడే కాదు… ‘డేటింగ్ ఉచ్చు’లో పడి వేల మంది మోసపోతున్నారు. ప్రస్తుతం అందరిచేతిలో స్మార్ట్ ఫోన్లో ఉంటుంది. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు లావాదేవీలన్నీ మొబైల్ ద్వారా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఇందులో అతి పెద్ద మోసం ఆన్లైన్ డేటింగ్.  ప్రపంచవ్యాప్తంగా 302 మిలియన్ డాలర్లు ఈ డేటింగ్ వల్ల నష్ట పోతున్నారని ఎఫ్ టిసి (ఫెడరల్ ట్రేడ్ కమిషన్) గణాంకాలు చెబుతున్నాయి.  దీన్ని బట్టే ఇది ఏ స్థాయి కుంభకోణమో ఇట్టే తెలుస్తోంది.

జనాభా అధికంగా ఉండి, స్మార్ట్ ఫోన్లను ప్రపంచంలో అత్యధికంగా వాడే ఇండియా, చైనాకే  ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. ఇండియాలో ఏడాదిలో ఏకంగా రూ.50 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అంచనా. కర్నూలు, నంద్యాల జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు 1,637 మంది బాధితులు రూ.8.77కోట్లు నష్టపోయారు. వీరంతా విధిలేక ఫిర్యాదు చేసిన వారే.  భయంతో, పరువు పోతోందని పోలీసులను ఆశ్రయించని వారు వేలల్లో ఉంటారు. మీరు కనీసం రూ. 100 కోట్లు నష్టపోయి ఉంటారు.

డేటింగ్ సైట్ లో వివరాలు నమోదు..
ఆన్లైన్ బుకింగ్ లో మరో పద్ధతి ఉంది. డేటింగ్ సైట్ తెరవగానే అందులో పేరు, జెండర్, మెయిల్ ఐడి వివరాలు.. ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్లు ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందులో జెండర్, వయసు ఆధారంగా ప్రొఫైల్స్ ఉంటాయి. ఏ వయసు వారికి ఎంత వయస్సు ఉన్నవారు కావాలి?  అమ్మాయి ఇన్ కాల్ లేదా ఔట్ కాల్ అనే ఆఫ్షన్  ఉంటుంది. అన్ని పూర్తి చేసి అడ్వాన్సుగా డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్ పనిచేయదు. ఇలా 40 శాతం సైట్లో అడ్వాన్స్ పేరుతో నగదును బదిలీ చేయించుకుని ఆపై నెంబర్ బ్లాక్ చేస్తారు.

లోకల్ నెంబర్.. హైటెక్ వ్యభిచారం..
డేటింగ్ సైట్ లో కొందరు ఆన్ లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వీరు తెలుగులో మాట్లాడతారు. ఫోటోలు పంపాలంటే అడ్వాన్స్గా వెయ్యి రూపాయలు ఫోన్ పేలో పంపాలి. ఆ తరువాత ఓ వ్యక్తి ఫోన్ చేసి అడ్రస్ చెబుతారు. అక్కడికి వెడితే తీసుకెళ్తారు. అక్కడ ఫోన్లో మాట్లాడుకున్న డబ్బులు ఫోన్ పేలోనే చెల్లించాలి. మళ్లీ రేటు చెబుతారు. అదేంటి మాట్లాడుకున్న డబ్బులు చెల్లించాను కదా.. అని అడిగితే.. అది ఎస్కార్ట్ ఛార్జ్ అని చెబుతారు. ఇక్కడ మేడం (కాల్ గర్ల్)కు ఇవ్వాలి? లేకపోతే వెళ్ళండి? అని తేల్చేస్తారు. ఎలాగూ డబ్బు పోయిందని  మరికొంత చెల్లిస్తారు. ఇలా హైటెక్ వ్యభిచారం నడుస్తుంది.

ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి పిలుపిస్తారు. కలకత్తా, డార్జిలింగ్,  మణిపూర్, నాగాలాండ్, ముంబై, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ల నుంచి యువతులు వస్తుంటారు. ఇన్ కాల్, ఔట్ కాల్ సర్వీసు పేరుతో వారు హోటల్ లేదంటే పర్సనల్ రూమ్ కు వచ్చే ఏర్పాటును మధ్యవర్తులు చేస్తారు. నోయిడా, గుర్గావ్, బీహార్, గుజరాత్, కలకత్తా నుంచి ఎక్కువగా డేటింగ్ నడుస్తుంది. మొబైల్స్ కు వారే ఫోన్ చేస్తారు. డేటింగ్ తీరుతెన్నులు వివరిస్తారు. మీ ప్రాంతం ఏది? అని అడిగి,  ఆ సిటీలోని కొన్ని ప్రాంతాల పేర్లు చెబుతారు.

అక్కడ కొంతమంది మేడమ్స్ ఉన్నారని.. మెంబర్షిప్ తీసుకుంటే వారి నెంబర్లు ఇస్తామని, వారితో ఫోన్లో మాట్లాడే రిలేషన్ చేయొచ్చని ముగ్గులోకి దించుతారు. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది మెంబర్షిప్ లు ఉంటాయి. మూడు నెలలకు రూ.3,500, ఆరు నెలలకు రూ.5వేలు,  ఏడాదికి రూ.7వేలు ఫీజు తీసుకుంటారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఈ నెంబర్లు కూడా పనిచేయవు.

ఈ తరహా నేరాలను ‘రొమాన్స్ స్కామ్స్’, హానీ ట్రాప్ గా పోలీసులు పరిగణిస్తారు.  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరు.  దీంతో పోలీసులు సైబర్ మిత్ర, పోలీసు వాట్సాప్ నెంబర్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఇచ్చారు. డీజే ఆఫీస్ నుంచి ఈ ఫిర్యాదులను మానిటర్ చేస్తారు.  వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఈ కేసులో కర్నూలులో గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ లన్ని ఫేక్ అని తేలింది. వేరేవారి ఆధార్ వారికి తెలియకుండానే ఐడీలతో ఫేక్ అకౌంట్లు సృష్టించారని.. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 
 

click me!