వారికి దక్కని న్యాయం...దిశ ఆత్మ ఘోషిస్తోంది: నిమ్మకాయల చినరాజప్ప

By Arun Kumar PFirst Published Jul 21, 2020, 9:24 PM IST
Highlights

రాష్ట్రంలో అధికార వైసిపి నాయకులు ఆడమన్నట్టు పోలీసులు ఆడుతున్నందుకే దళితులపై, బీసీలపై దాడులు పెరిగిపోయాయని మాజీ హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప పేర్కొన్నారు.

గుంటూరు: రాష్ట్రంలో అధికార వైసిపి నాయకులు ఆడమన్నట్టు పోలీసులు ఆడుతున్నందుకే దళితులపై, బీసీలపై దాడులు పెరిగిపోయాయని మాజీ హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప పేర్కొన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రాజారెడ్డి రాజ్యాంగంను అమలు చేస్తున్నారని... పోలీసులు-వైకాపా నేతలు కుమ్మక్కై ఏపీని దక్షణాది బీహార్ గా మారుస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు. 

''రాజమండ్రిలో పదవ తరగతి చదువుతున్న దళిత బాలికపై అత్యాచారం జరిగితే ఎందుకు సకాలంలో స్పందించ లేదు? ఆడపిల్లలకు అన్యాయం జరిగితే గన్ను కంటే ముందు జగన్ వస్తాడని మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పుడేమయ్యారు? రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం దారుణం. దీనికి కారణం స్థానిక వైకాపా నేతల ఒత్తికి కాదా?'' అని ప్రశ్నించారు. 

''ఇది స్థానిక అధికారుల వైఫల్యమే. ఆఘమేఘాల మీద దిశ చట్టం తీసుకువచ్చి ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యం ఇచ్చారు. నేడు ఆ దిశ చట్టం ఏ రూపం దాల్చిందో తెలియని దుస్థితి. దిశ పేరు మీద తెచ్చిన ఈ చట్టం బాధితులకు న్యాయం జరగకపోవడంతో  దిశ ఆత్మ కూడా ఘోషిస్తోంది'' అని అన్నారు.

read more  ఇలాంటివి సహించం.. శిరోముండనంపై డీజీపీ సవాంగ్ ఆగ్రహం

''బీసీ సామాజిక వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ ఇంటికి అర్ధరాత్రి అక్రమంగా వెళ్లడం ఏ వైకాపా నేతల ఒత్తిడితో జరిగింది? ఇసుక మాఫియా రాష్ట్రంలో ఎలా పేట్రేగిపోతుందో చెప్పడానికి తూ.గో జిల్లా సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్ పై జరిగిన దాడి ప్రత్యక్ష నిదర్శనం. పోలీసులు, ఇసుక మాఫియా కుమ్మక్కై రాష్ట్రాన్ని దక్షిణాది బీహార్ గా మారుస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''దళిత మెజిస్ట్రేట్ రామకృష్ణను, డాక్టర్ సుధాకర్ లను ఉద్దేశించి ‘వాడు వీడు’అన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి దళితులపై ఎంత చిత్తశుద్ది ఉందో తెలియజేస్తున్నాయి. జగన్ పాలనలో న్యాయమూర్తులకు కూడా రక్షణ లేదు. దళితులు, బీసీలపై వైసీపీ నేతలు దాడులు చేయిస్తున్నారు. వీరి అక్రమ వ్యాపారాలకు అడ్డంగా ఉన్నారని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు'' అని అన్నారు. 

''వరుసగా ఇలా దాడులు జరగడానికి జగన్ మోహన్ రెడ్డి మౌనమే కారణం. జిల్లా అధికారులపై, వారిని ఆడించిన వైకాపా నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి'' అని నిమ్మకాయల డిమాండ్ చేశారు. 
 

click me!