ఎదురు తిరిగిన చంద్రబాబు వ్యూహం: రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరిక

First Published May 4, 2018, 1:43 PM IST
Highlights

వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని బలహీనపరచడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వ్యూహం ఎదురు తిరుగుతున్నట్లే కనిపిస్తోంది.

కడప: వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని బలహీనపరచడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వ్యూహం ఎదురు తిరుగుతున్నట్లే కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి ఆయన టీడీపిలోకి ఆహ్వానించారు. టీడీపిలోకి వచ్చిన వైసిపి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిచోటూ గ్రూపు తగాదాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి.

తాజాగా కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు ముదిరాయి. వైసిపి నుంచి టీడీపిలోకి వచ్చిన ఎమ్మెల్యే జయరాములు తాను రాజీనామా చేస్తానని హెచ్చరిస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గం నుంచి ఆయన వైసిపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 

మొదటి నుంచి బద్వేల్ లో మాజీ మంత్రి వీరారెడ్డి కూతురు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గ్రూపు ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. గత ఎన్నికల్లో టీడీపి అభ్యర్థి విజయజ్యోతిపై వైసిపి తరఫున పోటీ చేసిన జయరాములు విజయం సాధించారు. 

ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. దాంతో నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఏర్పడ్డాయి. విజయమ్మ, విజయజ్యోతి, జయరాములు గ్రూపులు ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. 

కాగా, గత కొద్ది రోజులుగా జయరాములు పార్టీ కార్యకలాపాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాను ఎమ్మెల్యేను అయినప్పటికీ ప్రొటోకాల్ కూడా పాటించకుండా తనను పక్కన పెట్టి విజయమ్మ ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం ఏమిటని ఆయన మీడియా ముందే విరుచుకుపడ్డారు. 

తనకు జరుగుతున్న అన్యాయాన్ని జిల్లా స్థాయి పార్టీ నేతలకు, మంత్రులకు చెప్పినా ఫలితం లేదని అన్నారు. అయినా న్యాయం జరగలేదని అన్నారు. తనకు న్యాయం చేయకపోతే రాజీనామా చేస్తానని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయిందని జయరాములు అంటున్నారు. 

click me!