సంక్రాంతి అంటేనే కోళ్ళ పందేలు (వీడియో)

First Published Jan 12, 2018, 2:01 PM IST
Highlights

కిక్కుండే పండుగను జరుపుకునేందుకు ఇంటిల్లి పాది ఒకేచోట చేరినపుడు అందరికీ ఎంటర్ టైన్మెంట్ అవసరం కదా?

సంక్రాంతి పండుగ. ఏడాదిలోని పెద్ద పండుగల్లో ఇదొకటి. పైగా మూడు రోజుల పాటు జరుపుకునే ఏకైక పండగ ఇదొక్కటే. నిజానికి సంక్రాంతి పండుగంటేనే గ్రామీణ ప్రంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబించించే పండుగ. సంక్రాంతి పండుగ నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగం మంచి ఊపుమీదుంటారు. పంటలు అమ్ముకుని ఉంటారు కాబట్టి చేతిలో డబ్బులాడుతుంటాయి. అందుకనే ఎక్కడెక్కడి పిల్లలను, పెద్ద వాళ్ళను సంక్రాంతి నాటికి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు తమ ఇళ్ళకు రమ్మని ఆహ్వానిస్తుంటారు. సరే, కొత్త అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంతా ఒకచోట చేరి జరుపుకునే పండుగ కాబట్టే పండగల్లో సంక్రాంతికి ఉండే కిక్కే వేరు.

మరి, అంతటి కిక్కుండే పండుగను జరుపుకునేందుకు ఇంటిల్లి పాది ఒకేచోట చేరినపుడు అందరికీ ఎంటర్ టైన్మెంట్ అవసరం కదా? అప్పటికప్పుడు ఇంట్లోనే ఎంటర్ టైన్మెంట్ అంటే ఎక్కడి నుండి వస్తుంది. అందులో నుండి పుట్టుకొచ్చిందే కోళ్ళ పందేలు. కోళ్ళను గ్రామీణా ప్రాంతాల్లో దాదాపు అందరి ఇళ్ళలోనూ పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఎంటర్ టైన్మెంట్ అంటే ప్రత్యేకించి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. కాకపోతే పోటీ అంటే పందేలు లేకుండా ఎలా ఉంటాయి. అక్కడి నుండే కోళ్ళ పందేలు పుట్టుకొచ్చాయి.

మొదట్లో ఇంటిల్లిపాదికి వినోదం కోసం మొదలైన కోళ్ళ పందేలు తర్వాత్తర్వాత ఇంటి బయటకు విస్తరించి చివరకు జిల్లాలకు విస్తరించింది. చరిత్రలో చూసిన కోళ్ళ పందేలకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ‘పల్నాటియుద్ధం’ చరిత్రలో చూసినా కోళ్ళ పందేలకు పెద్ద కథే కనబడుతుంది. వైరి వర్గాలు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునేందుకు కోళ్ళ పందేలనే ఉపయోగించుకోంవటం కనబడుతుంది. మళ్ళీ ఇందులో కూడా తమ కోళ్ళే గెలవాలన్న పట్టుదలతో కోళ్ళకు కత్తులు కట్టటం, అందులోనూ విషపు కత్తులు కట్టి కుట్రలు చేయటం అంతా చరిత్రలో ఉన్నదే.

అంతస్ధాయిలో కాకపోయినా ఇపుడు కోళ్ళ పందేల నిర్వహణ అన్నది ప్రిస్టేజ్ అయిపోయింది. ప్రతీ ఏడాది కోట్ల రూపాయల్లో పందేలు సాగుతున్నాయి. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే పోయిన ఏడాది సుమారు రూ. 150 కోట్లు చేతులు మారయంటే పందేలు ఏ స్ధాయిలో జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. కోళ్ళ పందేలకు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ప్రధాన కేంద్రం.

పందేలకు ఉపయోగించే కోళ్ళలో 15 రకాలున్నాయి. వీటిల్లో కూడా పచ్చకాకి, కాకి, నెమలి, కాశీ, పర్ల, సేతువ, పెట్టమారు ప్రధానం. పందేలకు ఉపయోగించే కోళ్ళల్లో వాటి రంగు, ఎత్తు, బరువు తదితరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సంక్రాంతికి నాలుగు మాసాల ముందు నుండి పందెంలో దింపే కోళ్ళకు వివిధ రకాల శిక్షణ ఇస్తారు. ప్రధానంగా కాళ్ళు, రెక్కలు, ముక్కు బలంగా ఉండేలా శిక్షణుంటుంది. రెక్కల బలం కోసం ఈత, కాళ్ళ బలం కోసం రన్నింగ్ కూడా చేయిస్తారు. పౌరుషం కోసం కారం కలిపిన డ్రైఫ్రూట్స్ తినిపిస్తారు.

ఇక, పందేల విషయానికి వస్తే కోళ్ళ సొంతదారులు సుమారు రూ. 20 లక్షల దాకా పందేలు కాస్తారు. వీరు కాకుండా పై పందేలు కాసేవారు వేలల్లో ఉంటారు. కోళ్ళ పందేల్లో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు అందరూ పాల్గొంటారు. ఇక్కడ వరకూ పార్టీలన్న తేడాల్లేవు. చీకటి పందేలంటే నలుపు కోళ్ళను, వెన్నెల పందేలంటే తెల్లరంగు కోళ్ళనే పందేల్లోకి దింపుతారు. కోళ్ళకు పందేల్లో కత్తులు కట్టటం  సుమారుగా 20 ఏళ్ళ నుండే మొదలైంది. వీటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు కూడా ఉన్నారు. సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు వారికి భలే గిరికీ ఉంటుంది.

కోళ్ళ పందేలను నిషేధించాలని కోర్టలు ఆదేశించినా ఎవరూ లెక్క చేయటం లేదు. ప్రతీసారి లాగే ఇపుడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కోళ్ళ పందేలకు రెడీ అయిపోయాయి. కోళ్ల పందేలు చూడటానికి ప్రత్యేకించి విదేశీల నుండి కూడా వస్తారంటే ఇవి ఎంత ఫేమస్సో అర్ధమైపోతోంది.

 

 

 

 

click me!