త్రివర్ణ పతాకానికి వందేళ్లు... పింగళి కూతురును పరామర్శించనున్న జగన్

By Arun Kumar PFirst Published Mar 11, 2021, 12:56 PM IST
Highlights

ముఖ్యమంత్రి అయినా తరువాత తొలిసారిగా మాచర్ల విచ్చేస్తున్న జగన్ కు ఘనస్వాగతం పలికెందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. 

గుంటూరు: జాతీయ పతాకా ఆవిష్కరణకర్త పింగళి వెంకయ్య కుమార్తెను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12వ తేదీ శుక్రవారం అంటే రేపు మాచర్ల వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి తెలిపారు. మాచర్ల వాసి అయిన పింగళి కుమార్తె ఘంటసాల సీతారావమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారని... దీంతో ఆమెను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి మాచర్ల వస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. 

జాతీయ పతాకావిష్కరణ జరిగి వంద వసంతాలు పూర్తయిన సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారని పిన్నెల్లి సోదరులు తెలిపారు. ముఖ్యమంత్రి అయినా తరువాత తొలిసారిగా మాచర్ల విచ్చేస్తున్న జగన్ కు ఘనస్వాగతం పలికెందుకు పిన్నెల్లి సోదరులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్బంగా పిన్నెల్లి కోరారు.

1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తెలుగువారయిన పింగళి వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు. 

గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు.  

1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు.  
 

click me!