ఏపీలోకి చొచ్చుకొస్తున్న ఒడిషా.. ఆ గ్రామాలు మావేనంటూ వాదన

By Siva KodatiFirst Published Oct 30, 2020, 3:37 PM IST
Highlights

భారత్- పాక్, భారత్- చైనా, భారత్- నేపాల్ ఇలా మనదేశానికి ఇతర దేశాలతో సరిహద్దు వివాదాలు వున్నాయి. దీనిపై ప్రతినిత్యం రావణ కాష్టం రగులుతూనే వుంది. దేశం సంగతి పక్కనబెడితే.. ఇప్పుడు భారత్‌లోని వివిధ రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు వెలుగులోకి వస్తున్నాయి. 

భారత్- పాక్, భారత్- చైనా, భారత్- నేపాల్ ఇలా మనదేశానికి ఇతర దేశాలతో సరిహద్దు వివాదాలు వున్నాయి. దీనిపై ప్రతినిత్యం రావణ కాష్టం రగులుతూనే వుంది. దేశం సంగతి పక్కనబెడితే.. ఇప్పుడు భారత్‌లోని వివిధ రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకు కర్ణాటకతో వివాదం నెలకొంది.

కర్ణాటకతో సరిహద్దు వివాదంలో బళ్లారి అటవీ ప్రాంతంలో ఏపీ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే అంతర్రాష్ట్ర సరిహద్దు ఖరారయింది. అక్కడ విలువైన భూమిని కోల్పోయింది. ఇప్పుడు ఒడిసా వివాదంలోనూ అదే కొనసాగనుందా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2000లో కోరాపుట్‌, విజయనగరం జిల్లాల అధికారులతో విచారణ కమిటీ మాట్లాడింది.

అప్పటికి ఏపీ ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపించింది. అది స్టేటస్‌కోకు దారితీసింది. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఒడిసా ప్రభుత్వం పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టింది. ఇంకా నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కర్ణాటక కథే పునరావృతమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అసలెంటీ వివాదం: 

తాజాగా ఒడిషా ..ఏపీతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొటియా గ్రూప్‌లోకి వచ్చే 21 గ్రామాల్లో కాంధ్‌ తెగ గిరిజనులు నివసిస్తున్నారు. బ్రిటిష్‌ హయాం నుంచే ఈ గ్రామాలు మద్రాస్‌ ప్రెసిడెన్సిలో ఉన్నాయి. ఆ గ్రామాలు తమవని 1921 నుంచే ఒడిసా క్లెయిమ్‌ చేస్తుండగా, మద్రాస్‌ ప్రెసిడెన్సీ  ఖండించేది. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడలేదు.

 

 

1942లో ఒడిసా, మధ్యప్రదేశ్‌, బిహార్‌, మద్రాస్‌ రాష్ట్రాల కోసం సర్వే జరిగింది. అప్పుడీ 21 గ్రామాలను సాలూరు పరిధిలోనే చూపించారు. సర్వే అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్వే ల్యాండ్‌ రికార్డ్‌ల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న గిల్‌.బి ఓ మ్యాపు, నివేదికను ఇచ్చారు. వాటిల్లోనూ ఈ విషయం స్పష్టంగా ఉంది. 1943 మే 5వ తేదీన గిల్‌.బి నివేదికను గవర్నర్‌ జనరల్‌ ఆమోదించారు.

మద్రాస్‌ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భౌగోళిక విస్తీర్ణం, సరిహద్దులపై ఇచ్చిన వివరణలోనూ ఈ గ్రామాల ప్రస్తావన ఉంది. సాలూరు మండలంలోని కొటియా సహా 21 గ్రామాలు ఏపీవేనంటూ ఆంధ్రప్రదేశ్‌ గజిట్‌లో పొందుపరిచారు. ఇందుకు ఆధారంగా గిల్‌.బి సర్వే నివేదికతో పాటు అనేక అంశాలను పొందుపరిచారు. దీనిపై ఒడిసా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 

 

1988లో ఈ వివాదంపై కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. 2000లో  రెండు రాష్ట్రాల పరిధిలో విచారణ చేపట్టి ఆధారాలను పరిశీలించింది. చివరగా 2006లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసు తేలేవరకు వివాదం ఉన్న కొటియా గ్రామాలపై స్టేటస్ కో ను పాటించాలని ఆదేశించింది. అంతర్రాష్ట్ర సరిహద్దును పార్లమెంటే తేల్చాలని, అప్పటివరకు స్టేటస్ కో కొనసాగుతుందని చెప్పింది. 

సుప్రీంకోర్టు  స్టేటస్ కో: 

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ 21 గ్రామాల పరిధిలోకి ఒడిసా వేలుపెట్టడానికి వీల్లేదు. ఆ గ్రామాల్లో ఒడిసా అధికారిక కార్యక్రమాలు, నిర్మాణాలు చేపట్టి అది తమ ప్రాంతమేనన్న భావన కలిగించే ఏ ఒక్క చర్యా చేపట్టకూడదు. పార్లమెంటులో ఈ అంశం తేలేవరకు ఒడిసా నుంచి చొరబాట్లు, అధికారిక కార్యక్రమాలు, ఆ ప్రాంతంపై తన రాజముద్రను కనబర్చకూడదు.

 

 

అయితే, స్టేటస్ కో ను ఒడిసా వ్యూహాత్మకంగా ధిక్కరిస్తోంది. కొటియా గ్రూప్‌లోని 21 గ్రామాలపై తన రాజముద్రను చూపించుకునేందుకు గత కొంతకాలంగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆ గ్రామాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొని తన ఏలుబడి కిందే ఉన్నదని నిరూపించుకునే చర్యలు తీసుకుంటోంది. 2018 లో విజయనగరం కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కొటియా గ్రూపు గ్రామాలను సందర్శించారు.

ఆ గ్రామాల్లో సభలు పెట్టి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షించారు. దీనికి సాలూరు ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. ఇది స్టేటస్ కో ఉల్లంఘన కిందకు రాదు. ఎందుకంటే, అది అమల్లోకి రావడానికి ముందే అక్కడ గత 65 ఏళ్లుగా ఏపీ సర్కారు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి.

ఏపీ అధికారుల పర్యటనపై ఒడిషా ఆంక్షలు:

కలెక్టర్‌ పర్యటన వార్తలకు సంబంధించి ఒడిసా మీడియాలో విస్తృతంగా కథనాలు రావడంతో అక్కడి సర్కారు తీవ్రంగా స్పందించింది. తొలుత కోరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసింది. ఆ తర్వాత అక్కడి రెవెన్యూ, అటవీ అధికారులపై చర్యలు తీసుకుంది.

అంతేకాదు...ఏపీ అధికారులు తమ భూభాగంలోకి రాకుండా అడ్డుకునే పేరిట కొటియా గ్రామాలకు వెళ్లే దారిలో చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఆ తర్వాత తమ ముందస్తు అనుమతి లేకుండా ఏపీ అధికారులెవరూ ఆ గ్రామాలను సందర్శించకుండా చర్యలు తీసుకోవాలంటూ కోరాపుట్‌ జిల్లా అధికారయంత్రాంగాన్ని ఆదేశించింది. 

 

 

ఈ క్రమంలో గత ఏడాదిన్నర నుంచి ఒడిసా మరింత దూకుడు పెంచింది. వివాదం ఉన్న ఆ 21 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆనవాళ్లు కనిపించకూడదని, అక్కడ మన రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాపుట్‌ అధికారయంత్రాంగాన్ని ఆదేశించింది. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అటవీ అనుమతులు ఇవ్వకుండా నిరాకరించాలని ఆదేశించింది.

ఆ గ్రామాల్లో ఒడిసా ముద్ర కనబడేలా సొంతంగా పోలీసు స్టేషన్‌, రెవెన్యూ కార్యాలయాలు, ప్రభుత్వానికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేపట్టింది. స్టేట్‌సకో ఉత్తర్వులకు పూర్తి విరుద్ధంగా వివాదం ఉన్న గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన  తహసిల్దార్‌ కార్యాలయం, పోలీస్‌ బెటాలియన్‌ క్యాంపు ఆఫీసులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇతర క్వార్టర్స్‌ పెద్దఎత్తున నిర్మించింది.

పోలీస్ స్టేషన్ నిర్మాణం: 

ఇప్పుడు కొత్తగా పోలీసు స్టేషన్‌ నిర్మాణం చేపట్టింది. ముఖ్యమంత్రి సడక్‌ యోజన కింద 21 గ్రామాలను అనుసంధానం చేసేలా రహదారుల నిర్మాణం ప్రారంభించారు. ఆ ప్రాంతం తమదే అని చెప్పడానికి, ప్రజలు తమ వెంటే ఉన్నారని ఆధారంగా చూపడంకోసం ఒడిసా చాలా వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది.

 

ఆంధ్రాకు పోటీగా అక్కడి ప్రజలకు రేషన్‌ కార్డులు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చింది. అక్కడ భవనాలకు ఒడియాలోనే పేర్లు, శిలాఫలకాలు ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఆ 21 గ్రామాల ప్రజలు ఇటు ఏపీ, అటు ఒడిసా ఎన్నికల పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఏపీ ప్రభుత్వ స్పందన ఏంటీ:

వివాదం ఉన్న గ్రామాల్లో ఒడిసా చొచ్చుకొస్తోందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబరులోనే విజయనగరం ఎస్పీ... డీజీపీకి లేఖ రాశారు. స్టేట్‌సకో ఉత్తర్వులకు విరుద్ధంగా ఒడిసా శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతోందని పేర్కొన్నారు. సొంతంగా పోలీసు స్టేషన్‌, బెటాలియన్‌, ఇతర పరిపాలనా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటోందని, పరిశీలించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఆ తర్వాత నెలరోజులకు అంటే, ఈ ఏడాది జనవరి 29న డీజీపీ కార్యాలయం నుంచి హోమ్‌శాఖ ముఖ్యకార్యదర్శికి ఓ లేఖ వెళ్లింది. ‘‘ఆంధ్రా-ఒడిసా సరిహద్దులో వివాదం ఉన్న గ్రామాల్లో ఒడిసా సర్కారు అనధికార శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది.

 

 

ఏపీకి చెందిన ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్‌సకో ఉత్తర్వులకు పూర్తి విరుద్ధం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒడిసా చేస్తోన్న అనధికార నిర్మాణాలను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ’’ అని హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోరారు.

ఈ అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి  స్పందన లేదు. నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ విధింపునకు చాలారోజుల ముందు నాటి రెవెన్యూ మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాశారు.  దానిపైనా స్పందన లేదు.

click me!