షాకింగ్ : అప్పులప్రదేశ్ గా ఆంధ్ర.. ఒక్కొక్కరి తలపై ఎంతంటే..

By AN TeluguFirst Published Jan 5, 2021, 11:14 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రోజురోజుకూ అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం కుదించుకుని పోతున్నా సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తేడా రావడం లేదు. ఓ వైపు సంక్షేమ పథకాల అమలు, మరో వైపు రాష్ట్రానికి ఆదాయం లేకపోవడంతో సీఎం జగన్ విపరీతంగా అప్పులు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రోజురోజుకూ అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం కుదించుకుని పోతున్నా సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తేడా రావడం లేదు. ఓ వైపు సంక్షేమ పథకాల అమలు, మరో వైపు రాష్ట్రానికి ఆదాయం లేకపోవడంతో సీఎం జగన్ విపరీతంగా అప్పులు చేస్తున్నారు. 

ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ నిర్వహణలో భాగంగా నవంబరు నెలాఖరు వరకు జగన్ సర్కారు వివిధ రూపాల్లో రూ. 3,73,811.85 కోట్లు రుణంగా సమకూర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు నెలలు మిగిలి ఉంది. ఇంకా నాలుగు నెలల లెక్కలు తేలాల్సి ఉంది. ఆ లోపు రుణాల మొత్తం మరింత పెరుగుతుంది.

తాజాగా, తీసుకున్న రుణాలతో కలిపి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై దాదాపు రూ.70 వేల అప్పు ఉన్నట్లు లెక్కలు తేలుస్తున్నాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఒక్కో తలపై చేసిన తలసరి అప్పు దాదాపు రూ.13 వేల పైమాటే. రాష్ట్ర జనాభా 2020లో చేసిన తాజా అంచనాల ప్రకారం 5.39 కోట్లు ఉంటుందని లెక్క.  దీని ఆధారంగా మొత్తం రుణాన్ని జనాభాతో హెచ్చవేస్తే తలసరి అప్పు రూ. 13,694 వరకు తేలింది. 

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ చేసిన మొత్తం అప్పును లెక్కిస్తే అది ఒక్కొక్కరిపై రూ.70 వేల వరకు ఉండబోతోంది. 2019 ఏప్రిల్‌ నుంచి వైసీపీ ప్రభుత్వం 20 నెలల్లో చేసిన అప్పు రూ. లక్ష కోట్లు దాటింది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2019- 20లో దాదాపు రూ. 45 వేల కోట్లు రుణంగా సమీకరించారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాగ్‌ తేల్చిన లెక్కల ప్రకారం ఇప్పటికే రూ.73 వేల కోట్ల వరకు రుణం ఉంది. ఇంకా డిసెంబర్ నెల లెక్కలు తీయలేదు. రాబోయే మూడు నెలల్లో మరింతగా రుణాలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతోపాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు స్థూల రుణ భారం ఏకంగా రూ.3,73,140 కోట్లకు చేరింది.

కాగ్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2020 నవంబర్ చివరి నాటికే ఏపీ అప్పు ఈ స్థాయికి చేరుకుందని వెల్లడించింది. 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మాత్రమే రుణ భారం ఏకంగా రూ.73,811 కోట్లు పెరిగిందని కాగ్ నివేదిక తెలుపుతోంది.

click me!