పయ్యావుల కేశవ్ మకాం హైదరాబాద్ మారుస్తారా?

అనంతపురం జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో జరిపిన హెలిపాడ్ సమావేశం కాక ఇప్పట్లో చల్లారేలా లేదు. ఈ సమావేశంలో నాయకులిద్దరు నిలబడుకునే మాట్లాడుకున్నారు. సమావేశం కూడా పది పన్నెండు నిమిషాలు మించలేదు. అయితే, ఉహాగానాలు మాత్రం టన్నుల్లో వెలువడ్డాయి. ఇంకా వెలువుడుతున్నాయి. కొందరేమో ఇది తెలంగాణాలో వెల్ కమ్ (వెలమ ప్లస్ కమ్మ) కూటమికి దారి తీస్తుందనే రాస్తే, మరికొందరు కెసిఆర్ నంద్యాల రహస్యం గురించి ఆరా తీశారన్నారు. ఇంకొందరేమో రేవంత్ ని కాస్త నోరుమూయించరాదూ అని కెసిఆర్ అడిగనట్లు చెబుతున్నారు. మరి కొందరేమో 2019లో కాంగ్రెస్ ( రెడ్ల పార్టీ)కు వ్యతిరేకంగా కెసిఆర్ టిడిపితో చేతులు కలుపుతారని అదే చర్చకు వచ్చిందని అన్నారు. పార్టీ లేనపుడు పార్టీ వోట్ బ్యాంక్ దేనికి, అందువల్ల టిడిపితో చేతులు కలిపితే, పచ్చపార్టీకి ఉన్నబిసి వోట్ బ్యాంక్ పింక్ కు మార్చకోవచ్చని, అలాకాకుండా టిడిపితో కయ్యానికిపోతే, అది కాంగ్రెస్ వైపో, బిజెపివైపో పోతుందని కెసిఆర్ అనుమానిస్తున్నారని ఇంకొందరు విశ్లేషించారు.

ఈ నేపథ్యంలో మరొక కొత్త కోణం ఆంధ్రా తెలుగుదేశం సర్కిల్స్ లో ముఖ్యంగా అనంతపురం సర్కిల్స్ లో మొదలయింది. అదేంటేంటే, కేశవ్ ని కెసిఆర్ హైదరాబాద్ కు రమ్మని ఆహ్వనించారట. ఎందుకు ఆహ్వానించారనుకుంటున్నారు? ఇలా నిలబడి కాకుండా, తీరుబడిగా టీ తాగుతూ మాట్లాడేందుకనుకుంటున్నారా? కాదు.

వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీచేయమని చెప్పడానికట. హైదరాబాద్ లో ఉన్న ఆంద్రోళ్లను ఇలాగయితే పర్మనెంటుగా మచ్చిక చేసుకోవచ్చని కెసిఆర్ భావిస్తున్నారట.2019లో తెలుగుదేశం పోటీ చేసిన ఏ నియోజకవర్గం నుంచయినా కేశవ్ పోటీ చేయవచ్చునని చెప్పటానికి వప్పించటానిరి హైదరాబాద్ రమ్మన్నారని అనంతపురం జిల్లాలో టిడిపి నేతులు కొంతమంది చెప్పారు. 

తెలంగాణకు మారడం కేశవ్ కు అచ్చిరావచ్చు. ఎందుకంటే, ఆంధ్రలో ఉంటూ ఆయన ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కంటే పైకెక్క లేరు. ఎందుకంటే, జిల్లా కు రెండు మంత్రి పదవులు మించి రావు. ఇందులో ఒకటి బాగా ఇమేజ్ ఉన్న పరిటాల కుటుంబానికి పోగా రెండోది సౌమ్యుడు, విధేయుడు, బిసి కులానికి చెందిన కాల్వ శ్రీనివాస్ కు తప్పనిసరి. కాబట్టి ఆంధ్రలో ఉండి కేశవ్ సాధించేదేముంది? అని అనంతపురం నాయకులుకొందరు అంటున్నారు. హైదరాబాద్ కు మకాం మార్చుకుంటే అన్ని కలిసొస్తాయి. ఇంతకి పోటీ టిడిపి తరఫునుంచా లేక టిఆర్ ఎస్ నుంచా అనేది తెలియడం లేదు. ఎన్నికలపుడెక్కడా ఉన్నా గెల్చాక బంగారు తెలంగాణ సాధనకోసం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ బాట పట్టవచ్చుఅని కూడా వారంటున్నారు.

మరిన్ని వార్తల కోసం కింది లింక్ మీద క్లిక్ చేయండి 

http://telugu.asianetnews.com/home-page/asianet-telugu-express-news-andhra-pradesh-and-telangana-43