విశేష వార్తలు తగ్గిన పెట్రోల్ డిజిల్ ధరలు ముచ్చింతల్ ఆశ్రమంలో చిన్న జియర్ స్వామితో జగన్ భేటి తిరుమలలో బయటపడ్డ తమిళ రాజకీయ నాయకుల విభేదాలు గరిష్ట స్థాయి నీటి మట్టంతో ప్రమాదకరంగా మారిన హుస్సేన్ సాగర్ జలాశయం సింగరేణి కార్మికులతో సమానంగా ఉద్యోగులకు సౌకర్యాలు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో జీవో 39,42 లకు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్ష
తగ్గిన పెట్రోల్, డీజీల్ ధరలు

పెట్రోల్, డీజీల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో వాటి ధరలు తగ్గాయి.రెండింటి ధరలు లీటర్ కు రూ.2 చొప్పున తగ్గాయి. తగ్గిన ఈ ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
చిన్న జియర్ స్వామితో జగన్ సమావేశం

శ౦షాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని జీవా ప్రాంగణంలో త్రిదండి చిన్నజీయర్ స్వామితో ఏపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.ఈ సమావేశంలో వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి, మై హోం గ్రూప్ చైర్మన్ రామేశ్వర రావులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై మాట్లాడేందుకు మాత్రం జగన్ నిరాకరించారు.
కర్నూలులో మెగాసీడ్ పార్క్ ఏర్పాటు

ఈ నెల 9 వ తేదీన కర్నూలు లో మెగా సీడ్ పార్క్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ మెగా సీడ్ పార్క్ ను 650 ఎకరాల్లో ఏర్పాటుచేస్తారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.
ఈ పార్క్ కోసం ప్రభుత్వం 671 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 5 సవoత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విత్తనాల తయారీ,మేలు రకాల విత్తనాల ఎంపిక చెయ్యడమే ఈ పార్క్ ఏర్పాటు లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఇప్పటివరకు వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో తమిళనాడు ముందుంది. దీనిని అధిగమించేందుకు ఎపి చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ఈ పార్క్ ఏర్పాటు అని సోమిరెడ్డి చెప్పారు.
తిరుమలలో బయటపడ్డ తమిళ రాజకీయాలు

అన్నాడిఎంకేలో బద్ద శత్రువులుగా ఉన్న పళణిస్వామి, పన్నీరు సెల్వంలు ఈ మధ్య చేతులు కలిపారు. దీంతో ఎఐఎడిఎంకె కథ సుఖాంత మైందని అంతా భావించారు. కానీ వీరి మధ్య ఆ వైరం లోలోన రగులుతూనే ఉంది. అది ఈ రోజు తిరుమలలో బయటపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి, పన్నీరు సెల్వంలు వేర్వేరుగా తిరుమల శ్రీవారిని ఈ రోజు దర్శించుకున్నారు. పళణిస్వామి అష్టాదళ పాదపద్మారాధన సేవలో పాల్గొంటే, పన్నీరు సెల్వం సుప్రభాత సేవను ఎంచుకున్నారు. పన్నీరు సెల్వం నిన్నటి నుంచే తిరుమలలో ఉంటున్నారు. నిన్న ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
నిన్న సాయంత్రమే తిరుమలకు వచ్చినా పళణిస్వామితో పన్నీరుసెల్వం కలవనే లేదట. ఎవరికీ వారు విడివిడిగా ఎందుకుంటున్నారనేది ప్రశ్న.
ఇద్దరూ కలిసి ప్రభుత్వా న్ని నడుపుతునా ఓపిఎస్, ఇపిఎస్ ఇలా ఎడముఖం, పెడముఖంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో అందని అంటున్నారు. ఈ రోజు వీరి తీరు చూస్తే ఎఐఎడిఎంకె ప్రభుత్వం ఎంతకాలం బతుకుతుందబ్బా అనిపిస్తుంది.
తెలంగాణలో 1,13,359 యూనిట్ల గొర్రె పిల్లల పంపిణీ

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక లక్ష పదమూడు వేల మూడు వందల ఏబై ఎనిమిది యూనిట్ల గొర్రె పిల్లలను పంపిణీ చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఇది సాధ్యపడదన్న విమర్శకుల నోర్లు మూయించగలిగామని, దీన్ని మరింత మంది గొల్ల కుర్మలకు చేరువ చేసే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్లు మంత్రి అన్నారు. గొర్రె పిల్లలను పంచడమే కాదు వాటిని సంరక్షించి, చికిత్స అందించడానికి 100 మొబైల్ వెహికిల్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ పథకంపై ఎలాంటి అనుమానాలున్నా టోల్ ఫ్రీ నెంబర్ 18005993699 కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.సమస్యల పరిష్కారానికి అధికారులు ఎల్లపుడు అందుబాటులో ఉంటారని, ఈ పథకంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా టాస్క్ ఫోర్స్ టీమ్ లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ తెలిపారు.
నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్

హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా చేరుతున్న వరదనీటితో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ లో నీటి నిల్వ సామర్థ్యం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.50 మీటర్లకు నీటి నిల్వ చేరింది. దీంతో అధికారులు నీటిని దిగువకు వదలడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా నగరంలో వాన తగ్గకపోవడం, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారడంతో లోయర్ ట్యాంక్ బండ్ వాసులు భయం భయంగా జీవిస్తున్నారు.
జీవో 39, 42 లకు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్ష (వీడియో)

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 39 మరియు 42 లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి తహశీల్దార్ కార్యాలయం ముందు స్థానిక ప్రజలు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తో పాటు అఖిలపక్ష నాయకులు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు.
సింగరేణి కార్మికులకే కాదు,ఉద్యోగులకు అండగా ఉంటాం

సింగరేణి కార్మికులకు అందించే సౌకర్యాలు సింగరేణి కార్పొరేట్ ఆఫీసులో పని చేసే ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని టిబిజికేఎస్ కార్మిక సంఘం గౌరవాద్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. సింగరేణి ఎన్నికల ప్రచారానికి ఈ రోజు చివరి రోజు కావడంతో ఆమె ఇవాళ సింగరేణి ప్రాంతాల్లో టిబిజికేఎస్ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా సింగరేణి కార్పొరేట్ అఫిస్ ఉద్యోగులతో కవిత మాట్లాడారు. సింగరేణికి కార్మికులెంత ముఖ్యమో, ఉద్యోగులు కూడా అంతే ముఖ్యమని, సంస్థకు వీళ్లు రెండు కళ్ళలాంటివారని అన్నారు. సింగరేణి బాగుంటేనే రాష్ట్రమంతా సుభిక్షంగా ఉటుందని అన్నారు. సింగరేణి లాభాలు కార్మికుల కే దక్కాలని, అందుకు అనుగునంగానే తమ ప్రభుత్వం కృషిచేస్తోందని ఎంపి కవిత తెలిపారు.
ఆమెతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు.
ఉప్పొంగుతున్న మూసీ నది (వీడియో)

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదనీటితో మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం లోని మూసీ ప్రాజెక్టు 6 గేట్లను 3ఫీట్ల మేర ఎత్తి వరద నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ లోంచి 15 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. గత రాత్రి హైదరాబాద్ లో కురిసిన బారీ వర్షానికి మూసీలోకి ఈ మద్యాహ్నానికి భారీ వరదనీరు చేరుకునే అవకాశం ఉన్నందున ముందస్తుచర్యల్లో భాగంగా 6 గేట్లు ఎత్తామని ఎఈ మమత తెలిపారు.
భారీ వర్షాలతో హైదరాబాద్ లో ముగ్గురి మృతి
భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా జీహెచ్ఎంసి పరిధిలో ముగ్గురు చనిపోయారు. అలాగే కాలనీల్లోకి, ఇళ్లలోకి వాన నీరు చేరి చాలా మంది నిరాశ్రయులయ్యారు. నిన్న సాయంత్రం కురిసిన కుంభవృష్టి నగరంలో భయాందోళనలు సృష్టించింది.
వర్షాలు మరో ఇరవై నాలుగు గంటలు కొనసాగనుందన్న వాతావరణ శాఖ సమాచారంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసి అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. నగరం లోని ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
పండగ కోసం ఊళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న నగరవాసులు ఈ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.
