Serena Williams: మా అక్కకు నాకు తేడా తెలియడం లేదా..? చూస్కోవాలి కదా.. న్యూయార్క్ టైమ్స్ ను ఏకిపారేసిన సెరెనా

Serena Williams Slams New York Times: ఆధునిక టెన్నిస్ ప్రపంచాన్ని సుమారు రెండు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాణుల్లా ఏలారు విలియమ్స్ సిస్టర్స్. వారిలో ఒకరికి సంబంధించిన ఫోటోను ఓ ప్రముఖ పత్రిక ప్రచురిస్తూ పప్పులో కాలేసింది.  

You can do better: Serena Williams slams New York Times For This Reason

టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజంగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్న నల్ల కలువ  సెరెనా విలియమ్స్ కు ఊహించని పరిణామం ఎదురైంది. అమెరికాకు చెందిన  ప్రముఖ పత్రిక   న్యూయార్క్ టైమ్స్ చేసిన బ్లండర్ మిస్టేక్  తో ఆమె షాక్ కు గురైంది. తన గురించి రాసిన ఆర్టికల్ లో అక్క ఫోటో వాడటంపై  ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.  ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన పత్రిక ఇలా చేయడం బాధాకరమని.. ఇకనైనా చూసుకోవాలని చురకలు అంటించింది. 

అసలు విషయానికొస్తే.. సెరెనా విలియమ్స్ కు సంబంధించిన సెరెనా వెంచర్స్ పై న్యూయార్స్ టైమ్స్ ఒక కథనాన్ని రాసింది. సెరెనా వెంచర్స్ తో ఆమె సుమారు 111 మిలియన్ డాలర్లను సేకరించిందని అందులో పేర్కొంది. ఆ వెంచర్స్ లో ఆమె చేస్తున్న పనులు,  ఆ సంస్థలోని వ్యవస్థ, పని విధానం గురించి అంతా బాగానే వర్ణించింది. కానీ తీరా ఫొటో దగ్గరికి వచ్చేసరికి  న్యూయార్క్ టైమ్స్ పప్పులో కాలేసింది. 

 

సెరెనా విలియమ్స్ ఫోటోకు బదులు.. తన అక్క వీనస్ విలియమ్స్ ఫోటోను న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. చిన్నప్పుడు దాదాపు ఒకేలా ఉన్న సెరెనా, వీనస్ ఫోటోలలో ఏది సెరెనాదో నిర్ధారించుకోకుండానే..  సెరెనా కు బదులు అక్క వీనస్ ఫోటోను అచ్చువేసింది.   ఇది చూసిన  సెరెనా అభిమానులు  న్యూయార్క్ టైమ్స్  పై మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను సెరెనాకు కూడా పంపించారు.

ఇక ఇది చూసిన సెరెనా ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘మేం ఎంత సాధించినా ఇది చాలదని అనిపిస్తుంది..’ అని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక మరో ట్వీట్ లో.. ‘ఇందుకే నేను సెరెనా వెంచర్స్ పేరు మీద 111 మిలియన్ డాలర్ల నిధిని సేకరించాను. సంస్థను నెలకొల్పిన వ్యక్తులకు మద్దతు  ఇచ్చేందుకు వ్యవస్థ సాయపడుతున్నది. ఇదే విషయాన్ని ఒక పత్రిక  ప్రచురించింది. కానీ  ఇందులో  మా అక్క ఫోటోను వాడింది. సరే.. మా అక్క ఫోటో వాడటం తప్పేమీ కాదు.. కానీ ఫోటో వేసేముందు ఒకసారి  చూస్కుంటే బాగుండేది..  న్యూయార్క్ టైమ్స్, మీ పరిశోధన సరిపోలేదు... ఇంకా బాగా  ప్రయత్నించండి’ అని సదరు పత్రిక చెంప చెల్లుమనేలా  పేర్కొంది. 

 

అయితే  తప్పు  తెలుసుకున్న న్యూయార్క్ టైమ్స్..  ఇందుకు సంబంధించి ఇచ్చిన వివరణ కూడా సెరెనా అభిమానులను శాంతింపజేయలేదు. ప్రింట్ ఎడిషన్ లో మాత్రమే  వీనస్ ఫోటో వచ్చిందని,  ఆన్లైన్ లో మాత్రం సెరెనా ఫోటోనే వాడామని సంజాయిషీ ఇచ్చింది. అయితే.. చేసిన తప్పుకు క్షమాపణ కోరకుండా ఈ సంజాయిషీలు ఇవ్వడమేంటని సెరెనా అభిమానులు న్యూయార్క్ టైమ్స్ పై మండిపడుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios