Wimbledon 2022: రష్యా వైఖరి మెద్వెదేవ్ కు ముప్పు తెచ్చింది.. వింబుల్డన్ లో ఆడించేదే లేదంటున్న బ్రిటన్..
Russia-Ukraine war: రెండు నెలలుగా ఉక్రెయిన్ కు భరించలేని యుద్ధాన్నిస్తున్న రష్యాపై ప్రపంచ క్రీడా సమాఖ్య లు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాయి. ఆ దేశ ఆటగాళ్లు ఆడకుండా నిషేధాలు విధించాయి. తాజాగా వింబుల్డన్ కూడా రష్యాకు షాకిచ్చింది.
సుమారు రెండునెలలుగా ఉక్రెయిన్ పై సైనిక చర్య జరుపుతున్న రష్యా వైఖరిని ఎండగట్టేందుకు యూరప్ దేశాలు వారి పరిదిలో ఉండే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. ఇప్పటికే ఆంక్షల వలయంలో చిక్కుకున్న రష్యాను మరింత ఒంటరి చేసేందుకు గాను ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్టీసీ) కూడా సిద్ధమైంది. రష్యన్ ప్లేయర్లను ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఈవెంట్ లో ఆడించబోమని.. రష్యా, బెలారస్ ఆటగాళ్లు ఈ గ్రాండ్ ఈవెంట్ నుంచి దూరంగా ఉండాలని హితువు పలికింది. తాజా నిర్ణయంతో వరల్డ్ నెంబర్ టూ టెన్నిస్ స్టార్ డానియెల్ మెద్వదేవ్ కు షాక్ తగిలినట్టే..
త్వరలో జరుగుబోయే వింబుల్డన్-2022 కి గాను ఏఈఎల్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా, బెలారస్ ఆటగాళ్లకు ఈ టోర్నీ ఆడకుండా చర్యలు తీసుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపింది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై రష్యా, బెలారస్ ఆటగాళ్ల భవితవ్యం ఆధారపడి ఉంది.
జూన్ 27 నుంచి జూలై 10 మధ్య బ్రిటన్ వేదికగా వింబుల్డన్ జరుగనుంది. అయితే పురుషుల విభాగంలో ప్రపంచ రెండో నెంబర్ ఆటగాడు డానియెల్ మెద్వదేవ్, ఎనిమిదో ర్యాంకర్ ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా) లతో పాటు మహిళల విభాగంలో 15వ ర్యాంకర్ అనస్తాసియా పావ్లియుచెంకోవా లకు అవకాశం దక్కేది కష్టంగానే ఉంది. వీరితో పాటు బెలారస్ ఆటగాళ్లు కూడా వింబుల్డన్ లో పాల్గొనే అవకాశం కూడా లేదు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి బెలారస్ మద్దతుదారుగా ఉంది.
ఒకవేళ వింబుల్డన్ ఆడాలనుకుంటే పై పై రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు వారి దేశాల జెండాలు కాకుండా మామూలుగా బరిలోకి దిగితే అవకాశమిస్తామని ఏఈఎల్టీసీ అధికారులు తెలిపారు. తాజాగా బ్రిటన్ ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా ఉన్న నిగెల్ హడిల్ స్టన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మెద్వెదేవ్, రూబెల్ తో పాటు అనస్తాసియాల వింబుల్డన్ ఆశలు అడియాసలైనట్టే. దేశం జెండా ఉంటే బ్రిటన్ ఆడనియ్యదు. దేశం జెండా లేకుండా ఆడితే తిరిగి రష్యా తీసుకునే పరిణామాలు ఊహించడం కూడా కష్టమే. ఆ కారణంగా వాళ్లు దేశపు జెండా లేకుండా ఆడే సాహసం చేయకపోవచ్చు. దీంతో వింబుల్డన్ లో ఈ రెండు దేశాల ఆటగాళ్లకు దాదాపు ద్వారాలు మూసుకుపోయినట్టే...
ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా ఇప్పటికే అక్కడ తీవ్ర నష్టం మిగిల్చిన విషయం తెలిసిందే. ఒక్కో నగరం చొప్పున ఆ దేశాన్ని నాశనం చేస్తున్న రష్యా.. ఇప్పుడు అక్కడి డాన్బోస్ నగరంపై దృష్టి సారించింది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఉక్రెయిన్ ఎంతకూ లొంగకపోవడంతో ఆ దేశంపై అణుదాడికి కూడా దిగనుందని సమాచారం. రష్యా వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే ఫుట్బాల్, థైక్వాండో, ఎఫ్1 రేసింగ్ వంటి క్రీడా సమాఖ్యలు ఆ దేశాన్ని, దేశ క్రీడాకారులను పక్కనబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఎవరెన్ని ఆంక్షలు విధించినా తాను మాత్రం తగ్గేదేలే అంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ ను దారికి తెచ్చుకునేదాకా ఎన్ని ఆంక్షలైనా భరిస్తామని ఇటీవలే పేర్కొన్నాడు.